Telugu Global
NEWS

అద్దె మైక్ పవన్.. మంత్రి పేర్ని నాని ధ్వజం..

“ఓ బలిజ కులస్తుడిగా చెబుతున్నా.. ఏపీకి అన్యాయం చేస్తున్న వారిని మీరు చొక్కా పట్టుకుని నిలదీయండి, పోలవరం ప్రాజెక్ట్‌ కు త్వరగా డబ్బులు ఇవ్వండని నిలదీయండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్రంలోని పెద్దల చొక్కా పట్టుకోండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చొక్కా పట్టుకోండి. అంతే తప్ప, అద్దె మైకులా తయారై మన బలిజల పరువు తీయద్దని సూచిస్తున్నా” అంటూ పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పేర్ని నాని. తిరుపతిలో […]

అద్దె మైక్ పవన్.. మంత్రి పేర్ని నాని ధ్వజం..
X

“ఓ బలిజ కులస్తుడిగా చెబుతున్నా.. ఏపీకి అన్యాయం చేస్తున్న వారిని మీరు చొక్కా పట్టుకుని నిలదీయండి, పోలవరం ప్రాజెక్ట్‌ కు త్వరగా డబ్బులు ఇవ్వండని నిలదీయండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్రంలోని పెద్దల చొక్కా పట్టుకోండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చొక్కా పట్టుకోండి. అంతే తప్ప, అద్దె మైకులా తయారై మన బలిజల పరువు తీయద్దని సూచిస్తున్నా” అంటూ పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పేర్ని నాని. తిరుపతిలో బలిజ కులస్తులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రస్తావించిన అంశాలను ఆయన తిప్పికొట్టారు. బలిజలకు సాయం చేసిన జగన్ ని వారు ఎప్పటికీ మరచిపోరని, ఆలోచించి ఓటు వేయడానికి తిరుపతి ప్రజలు, బలిజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

అద్దె మైకు..
పవన్‌ నాయుడు అద్దె మైకులా తయారయ్యాడని, ఏ పార్టీవారు అద్దెకు తీసుకుంటే, ఆ పార్టీ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని తిరుపతి వేదికపై చదివి, తన కాల్షీట్ కి న్యాయం చేసి వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. తనది కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. 2014లో కమలం, సైకిల్ కి ఓటు వేయాలని అడిగారని, 2019లో కత్తి, సుత్తి, కొడవలి, ఏనుగు, గ్లాస్ కి ఓటు వేయాలని అన్నారని, ఇప్పుడు తిరిగి కమలం అంటున్నారని.. ఇన్ని పార్టీలు మార్చే పవన్ కల్యాణ్ ని తిరుపతి ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

అజ్ఞానవాసి..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిసి కూడా జగన్ ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే పవన్ కల్యాణ్ సినిమాలో అజ్ఞాతవాసి కాదు, నిజ జీవితంలో అజ్ఞానవాసి అని విమర్శించారు మంత్రి పేర్ని నాని. వివేకా హత్య తర్వాత రెండున్నర నెలలు చంద్రబాబు సీఎంగా ఉన్నారని, ఆ కేసులో చంద్రబాబు పాత్రపై కూడా విచారణ జరగాలని, అలా అడగలేదంటే.. పవన్ కల్యాణ్ ఇంకా బాబు దత్త పుత్రుడిగా ప్యాకేజీ అందుకుంటున్నట్టేనని చెప్పారు.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ పై హత్యాయత్నం జరిగిందని, ఆ కేసుని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, ఈ కేసు విచారణ ఆలస్యం అయితే దానికి జగన్ ఎలా బాధ్యులవుతారని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం పరిధిలోని దర్యాప్తు సంస్థలు విచారణ ఆలస్యం చేస్తుంటే పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సింది జగన్ ని కాదని, మోదీని, అమిత్ షా ని అని స్పష్టం చేశారు.

పాచిపోయిన లడ్డూల సంగతేంటి..?
గతంలో పవన్ కల్యాణ్ తిరుపతి వేదికగా.. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. బీజేపీకి దక్షిణాదివారంటే చులకన అని, ఏపీకి బీజేపీ ద్రోహం చేస్తోందని కూడా విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికపైనుంచి పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చారు, బీజేపీ విధానాలను ఆకాశానికెత్తేశారు. ఈ వ్యవహారంపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బాగుచేసుకుని తింటున్నావా పవన్ అని ప్రశ్నించారు నాని. ప్రత్యేకహోదా లేక నిద్ర పట్టలేదు, అన్నం మానేశానని చెప్పుకున్న పవన్, ఇప్పుడు బిర్యానీ తింటున్నారా? అని ప్రశ్నించారు.

జగన్ ఎప్పటికీ సీఎం కాలేడని 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ అన్నారని, అయితే వెంకన్న స్వామి ఆశీస్సులతో జగన్ సీఎం అయ్యారని, పవన్ రెండు చోట్లా ఓడిపోయారని గుర్తు చేశారు. తప్పుడు మాటలతో దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి లాగారు కాబట్టే పవన్ కి తగిన శాస్తి జరిగిందని అన్నారు. చంద్రబాబు హయాంలో బెజవాడలో విగ్రహాలను, ఆలయాలను కూల్చేస్తే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఇప్పుడు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని నిర్లజ్జగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేవుళ్లపై అంత భక్తి ఉంటే.. తిరుపతి వచ్చిన పవన్ తిరుమల ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాల్షీట్ ని కేవలం బీజేపీ మీటింగ్ కి మాత్రమే ఇచ్చారు కాబట్టి ఆయనకు స్వామివారు గుర్తుకు రాలేదని చెప్పారు.

కొండమీద బ్యాగులు అమ్మేవారు, ట్యాక్సీ తోలేవారిని బెదిరిస్తున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు నాని, నేరుగా ప్రత్యేక విమానంలో వచ్చి, తిరిగి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయిన పవన్, ఎవరితో మాట్లాడారని, ఎవరి కష్టాలు తెలుసుకున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వి వర్షాకాలం రాజకీయాలని, తిరుపతిలో అసలు పవన్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకి నష్టం జరిగే పని చేయరు కాబట్టే జనసేన పోటీకి దిగలేదని విమర్శించారు. కాపులపై చంద్రబాబు కేసులు పెట్టినప్పుడు నోరు మెదపని పవన్, ఇప్పుడు కులం ఓట్లకోసం బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు.
రత్నప్రభ వల్ల ఐటీ కంపెనీలు వచ్చాయని, అందుకే ఆమెకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్ కి, ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు.

చిరంజీవి తమ్ముడిగానే..
పవన్ కల్యాణ్ ని చిరంజీవి తమ్ముడిగానే ప్రజలు ఆదరించారని అన్నారు పేర్ని నాని. పవన్ వెండి తెరమీద నటించలేకపోయినా, రాజకీయాల్లో మాత్రం గొప్పగా నటిస్తున్నారని విమర్శించారు.

First Published:  4 April 2021 12:12 PM GMT
Next Story