Telugu Global
National

అన్ని వయసులవారికీ వ్యాక్సిన్..?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న విషయం తెలిసిందే. విదేశాల్లో వ్యాక్సిన్ పట్ల ప్రజలంతా సుముఖంగా ఉన్నట్టు, అసలు వ్యాక్సిన్ కోసం కొన్ని పేద దేశాలు అర్రులు చాస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. భారత్ విషయానికొచ్చేసరికి మాత్రం ప్రభుత్వం అనుకున్న టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమే కోవిడ్‌ టీకా ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. దానికి తగ్గట్టే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ నాయకులు […]

అన్ని వయసులవారికీ వ్యాక్సిన్..?
X

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న విషయం తెలిసిందే. విదేశాల్లో వ్యాక్సిన్ పట్ల ప్రజలంతా సుముఖంగా ఉన్నట్టు, అసలు వ్యాక్సిన్ కోసం కొన్ని పేద దేశాలు అర్రులు చాస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. భారత్ విషయానికొచ్చేసరికి మాత్రం ప్రభుత్వం అనుకున్న టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమే కోవిడ్‌ టీకా ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. దానికి తగ్గట్టే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ నాయకులు కూడా దూరంగా ఉండి వైద్య, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించారు. అయితే అనుకున్న స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆ తర్వాత 60ఏళ్ల పైబడినవారిని 45ఏళ్ల పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని లిస్ట్ లో చేర్చారు. అప్పటికీ రష్ పెరగలేదు. దీంతో 45ఏళ్ల వయసున్న అందరికీ వ్యాక్సిన్ అంటూ నియమాన్ని సడలించారు. ఇటీవలే సెలవు రోజుల్లో కూడా వ్యాక్సిన్ అంటూ ఉపశమనం కల్పించారు.

తాజాగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరాన్ని కేంద్రానికి గుర్తు చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వ్యాక్సినేషన్ వృథాని అరికట్టాలన్నా, అనుకున్న సమయానికి భారత్ లో టీకా కార్యక్రమం పూర్తి కావాలన్నా.. వేచి చూడాల్సిన అవసరం లేదని, అన్ని వయసుల వారికీ టీకా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.

వాస్తవానికి భారత్ లో టీకా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి కానీ, టీకా వేయించుకునేవారే కరువయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా కార్యక్రమాన్ని అప్పగించడంతో.. ప్రజలు క్యూ కడతారని ఆశించారంతా. కానీ అక్కడ కూడా స్పందన అంతంతమాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వేస్తున్నా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నామమాత్రపు ఫీజు తీసుకుని వేస్తున్నా కూడా జనంలో ఆసక్తి లేదు. సెకండ్ వేవ్ కూడా ఎవర్నీ భయపెడుతున్నట్టు కనిపించడంలేదు.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా కార్యక్రమం మొదలైంది. ముందుగా పింఛన్లు తీసుకునేవారందరికీ టీకా వేశారు. 45ఏళ్లపైబడినవారంతా సచివాలయానికి వచ్చి టీకా వేయించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం బాగున్నా.. ప్రజల్లో స్పందన లేదని తెలుస్తోంది. ఈ దశలో నిర్బంధ టీకా అనే అంశాన్ని తెరపైకి తీసుకురాలేకపోయినా.. కనీసం వయోభేదం లేకుండా అందరికీ టీకా వేయాలని కోరుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

First Published:  3 April 2021 12:06 AM GMT
Next Story