Telugu Global
NEWS

ఎన్నికల బహిష్కరణ.. చంద్రబాబు వెనకడుగు..

అంతా అనుకున్నట్టే జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరినుంచి టీడీపీ తప్పుకుంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది వెనకడుగువేసినట్టు కాదని, వైసీపీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటం అని వివరణ ఇచ్చుకున్నారు బాబు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదని చెప్పిన బాబు, టీడీపీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తమ పార్టీ అభ్యర్థులు బరిలోనుంచి తప్పుకుంటున్నారని, వారికి […]

ఎన్నికల బహిష్కరణ.. చంద్రబాబు వెనకడుగు..
X

అంతా అనుకున్నట్టే జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరినుంచి టీడీపీ తప్పుకుంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది వెనకడుగువేసినట్టు కాదని, వైసీపీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటం అని వివరణ ఇచ్చుకున్నారు బాబు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదని చెప్పిన బాబు, టీడీపీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తమ పార్టీ అభ్యర్థులు బరిలోనుంచి తప్పుకుంటున్నారని, వారికి తగిన సమయంలో న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

ఎందుకీ నిర్ణయం..?
పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా చేపట్టారని, ఇప్పుడు హడావిడిగా పరిషత్ ఎన్నికలను ఒకే ఫేజ్ లో నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికల కమిషన్ పై తమకు నమ్మకం లేదని, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరగదని తేల్చి చెప్పారు. పోలీసులు కూడా అధికార పక్షానికి మద్దతు తెలుపుతున్నారని, ఇలాంటి సమయంలో ఎన్నికలను బహిష్కరించడం ఒక్కటే తమ ముందున్న ఏకైక మార్గమని అన్నారాయన. పార్టీలో చర్చించిన తర్వాత, ఎంతో బాధతో, ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు చంద్రబాబు.

ఎస్ఈసీపై మండిపాటు..
ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఆమె రాజభక్తి చూపించుకున్నారని విమర్శించారు. ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుపునిచ్చి, అదే రోజు ఎన్నికల షెడ్యూల్ ని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నా కూడా, దానికి ముందుగానే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం సరికాదన్నారు.

తిరుపతి భయమేనా..?
పరిషత్ ఎన్నికల్లో ఇప్పటికే ఏకగ్రీవాలతో వైసీపీ పైచేయి సాధించింది. పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన పంచాయతీల్లో టీడీపీ తమ లెక్కలు తాము చెప్పుకున్నా.. మున్సిపాల్టీల్లో వైసీపీ క్లీన్ స్వీప్ స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ దశలో పరిషత్ ఎన్నికలు కూడా జరిగితే అందులోనూ వైసీపీకే మెజార్టీ వస్తుందనడంలో అనుమానం లేదు. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. వైసీపీకి మెజార్టీ తగ్గించడానికి ట్రై చేస్తోంది. ఈ దశలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఓటమి భారంతో పార్టీ శ్రేణులు డీల పడితే, దాని ప్రభావం తిరుపతి ఉప ఎన్నికలపై కూడా పడుతోందనే అనుమానం టీడీపీని వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారు. గతంలో జ్యోతి బసు, జయలలిత కూడా వారి వారి రాష్ట్రాల్లో ఎన్నికలను బహిష్కరించారని, ఇదేమీ కొత్త విషయం కాదని, తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

First Published:  2 April 2021 7:43 AM GMT
Next Story