Telugu Global
National

సీటు మార్చను.. మోదీకి కౌంటర్ ఇచ్చిన దీదీ..

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓటమి ఖరారైందని, ఆమె కొత్త నియోజకవర్గాన్ని వెదుక్కుంటున్నారని, త్వరలోనే నామినేషన్ వేస్తారంటూ ప్రధాని మోదీ వేసిన సెటైర్లకు అంతే దీటుగా బదులిచ్చారు మమతా బెనర్జీ. బెంగాల్ లో ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతోంది, ఇప్పటికే రెండు విడతలు ముగిశాయి. 6, 7, 8 విడతలకు సంబంధించి నామినేషన్లకు ఇంకా గడువు ఉంది. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ లో పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, దీదీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ […]

సీటు మార్చను.. మోదీకి కౌంటర్ ఇచ్చిన దీదీ..
X

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓటమి ఖరారైందని, ఆమె కొత్త నియోజకవర్గాన్ని వెదుక్కుంటున్నారని, త్వరలోనే నామినేషన్ వేస్తారంటూ ప్రధాని మోదీ వేసిన సెటైర్లకు అంతే దీటుగా బదులిచ్చారు మమతా బెనర్జీ. బెంగాల్ లో ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతోంది, ఇప్పటికే రెండు విడతలు ముగిశాయి. 6, 7, 8 విడతలకు సంబంధించి నామినేషన్లకు ఇంకా గడువు ఉంది. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ లో పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, దీదీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ లో దీదీ ఓటమి ఖాయమైందని, అందుకే ఆమె ముందు జాగ్రత్తగా మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తారని మోదీ అన్నారు. టీఎంసీ కార్యకర్తల్ని నైతికంగా దెబ్బకొట్టేందుకే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు నేరుగా మమతా బదులు చెప్పారు. తాను మరెక్కడా పోటీ చేయాల్సిన అవసరం లేదని, నందిగ్రామ్‌ నుంచి తన గెలుపు ఖాయమని అన్నారు.

మరో సీటు నుంచి పోటీ చేయాలంటూ మోదీ తనకు సలహా ఇవ్వడమేంటని, అలా సలహాలిచ్చేందుకు తానేమీ బీజేపీ సభ్యురాలిని కాదని గట్టిగా బదులిచ్చారు మమతా బెనర్జీ. తనతోపాటు 200మంది టీఎంసీ నేతలు కూడా కచ్చితంగా గెలుస్తారని, భారీ మెజార్టీతో మరోసారి బెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు దీదీ.

నందిగ్రామ్ సంగ్రామం..
బెంగాల్ లో రెండో విడత జరిగిన పోలింగ్ లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. టీఎంసీ కార్యకర్త ఒకరు, బీజేపీ నేత ఒకరు ఘర్షణల్లో మరణించారు. దీదీ ప్రత్యర్థి సువేందు అధికారి కారుపై జరిగిన దాడి కూడా సంచలనం రేపింది. అటు బీజేపీ కూడా ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా బెంగాల్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఒకరు మార్చి ఒకరు బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఎనిమిది విడ‌త‌ల‌ ఎన్నికల ప్రక్రియ కూడా బీజేపీకి కలిసొస్తుందనే ప్రచారం ఉంది. అయితే ప్రీపోల్స్ మాత్రం మమతా బెనర్జీకే మొగ్గు చూపించడం విశేషం.

First Published:  2 April 2021 5:09 AM GMT
Next Story