Telugu Global
NEWS

తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏప్రిల్ 3న భారీ కవాతు..

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఉంటుందా లేదా అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ.. ఏప్రిల్ 3న పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించబోతున్నారు. అభ్యర్థి ఖరారయినా, నామినేషన్ ఘట్టం ముగిసినా.. ఇన్నాళ్లూ జనసేన తరపున ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో.. పవన్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నాదెండ్ల మనోహర్.. జనసేనాని పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 3న తిరుపతిలో ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పవన్ […]

తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏప్రిల్ 3న భారీ కవాతు..
X

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఉంటుందా లేదా అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ.. ఏప్రిల్ 3న పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించబోతున్నారు. అభ్యర్థి ఖరారయినా, నామినేషన్ ఘట్టం ముగిసినా.. ఇన్నాళ్లూ జనసేన తరపున ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో.. పవన్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నాదెండ్ల మనోహర్.. జనసేనాని పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 3న తిరుపతిలో ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తారని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు మనోహర్. రెండో విడతలో పవన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.

జనసేన ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ వస్తారో.. రారో అనే అనుమానంతో ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. తిరుపతి సీటు జనసేనకు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ అసంతృప్తి, ఉప ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకతగా మారితే మరింత ప్రమాదం. అందులోనూ టీడీపీని వెనక్కు నెట్టి కచ్చితంగా రెండో స్థానం సాధించాలనే కసితో బీజేపీ ఉంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని ఓడిస్తామని పైకి చెబుతున్నా.. లోపల మాత్రం బీజేపీ టార్గెట్ సెకండ్ ప్లేసేనని తెలుస్తోంది. ఈ దశలో జనసేన సపోర్ట్ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కమలదళం టెన్షన్ పడుతోంది. పవన్ కల్యాణ్ ప్రచారంతో ఆ ఆందోళన వారిలో తొలగిపోతోంది. పవన్ కల్యాణ్ ని స్వాగతించేందుకు జనసేన నాయకులతోపాటు, బీజేపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

పాచిపోయిన లడ్డూల సంగతేంటి..?
తిరుపతిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ అంటే.. ముందుగా గుర్తొచ్చేది పాచిపోయిన లడ్డూల కథ. ప్రత్యేక ప్యాకేజీపై సెటైర్లు వేస్తూ గతంలో ఇదే తిరుపతి కేంద్రంగా బీజేపీపై తిరుగుబాటు ప్రకటించారు పవన్ కల్యాణ్. కట్ చేస్తే.. ఇప్పుడు అదే పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి వస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజే.. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టేశారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలోనే ఆయన బీజేపీతో విభేదిస్తున్నారు. ప్రైవేటీకరణ వద్దంటూ జరుగుతున్న ఉద్యమానికి పవన్ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ప్రైవేటీకరణకు కారణం వైసీపీయేనంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మొత్తమ్మీద తిరుపతి సీటు తమకు ఇవ్వలేదన్న కారణంతో కొన్నాళ్లు అలకబూనిన జనసేనాని.. ఎట్టకేలకు పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి.. మిత్రధర్మం పాటిస్తూ రత్నప్రభ గెలుపుకోసం ప్రచారానికి వస్తున్నారు.

First Published:  30 March 2021 9:10 PM GMT
Next Story