Telugu Global
National

మహారాష్ట్ర సర్కారు ప్రమాదంలో పడుతుందా..?

సంకీర్ణ సర్కారుల జీవిత కాలం ఎన్ని సంవత్సరాలో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. అందులోనూ కేంద్రంలో బీజేపీ ఉండగా.. రాష్ట్రాల్లో బీజేపీలేని సంకీర్ణాలకు ఆయుష్షు చాలా తక్కువ. చివరి నిముషం వరకూ మహారాష్ట్రలో అధికారం కోసం పాకులాడి.. బలం లేకపోయినా దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి మరీ పరువు పోగొట్టుకుంది బీజేపీ. అప్పటినుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూనే ఉంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్.. కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తూనే ఉంది. అందివచ్చిన అవకాశమో, లేక దాని వెనక […]

మహారాష్ట్ర సర్కారు ప్రమాదంలో పడుతుందా..?
X

సంకీర్ణ సర్కారుల జీవిత కాలం ఎన్ని సంవత్సరాలో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. అందులోనూ కేంద్రంలో బీజేపీ ఉండగా.. రాష్ట్రాల్లో బీజేపీలేని సంకీర్ణాలకు ఆయుష్షు చాలా తక్కువ. చివరి నిముషం వరకూ మహారాష్ట్రలో అధికారం కోసం పాకులాడి.. బలం లేకపోయినా దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి మరీ పరువు పోగొట్టుకుంది బీజేపీ. అప్పటినుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూనే ఉంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్.. కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తూనే ఉంది.

అందివచ్చిన అవకాశమో, లేక దాని వెనక బీజేపీ ప్రమేయం ఉందో తెలియదు కానీ.. మహారాష్ట్ర మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ముంబైలో ఆయన టార్గెట్ నెలకు 100 కోట్ల రూపాయలని, ఆ పని చేసి పెట్టాల్సింది ముంబై పోలీసు బాసేనంటూ.. మాజీ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అంతకు ముందు ముకేష్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్ధాల వాహనం కేసులో పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజే ను అరెస్ట్ చేయడం కూడా మహా సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అక్కడినుంచి ఒకదానిక వెంట ఒకటి చకచకా కూటమిలో కల్లోలం రేపే పరిణామాలు జరిగిపోతున్నాయి.

మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారంపై ఆదివారం ఆల్రడీ ఓసారి చర్చోప చర్చలు జరిగాయి. సోమవారం జరిగే చర్చలతో హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ భవితవ్యం తేలిపోతుందని అంటున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు ఎన్సీపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దేశ్‌ ముఖ్‌ వ్యవహారంలో సీఎం ఠాక్రేదే తుది నిర్ణయం అని శరద్ పవార్ చెబుతున్నా.. తమ పార్టీ నేతపై వేటు వేయడం అంటే తమకు అవమానంగానే ఆయన భావిస్తున్నారు. అయితే అనిల్ దేశ్ ముఖ్ వాదన కూడా విని ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతున్నారాయన.

మరోవైపు మంత్రిపై వచ్చిన ఆరోపణల్ని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా అభివర్ణించారు పవార్. అవి ఫలించవని పేర్కొన్నారు. ఈ లేఖ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఠాక్రేకు పవార్‌ సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న తర్వాత పరమ్‌ వీర్‌ పై కేంద్ర సంస్థలు ఒత్తిడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అటు శివసేన కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది.

అయితే శివసేన వ్యాఖ్యలు మాత్రం కూటమిలో కలకలం రేపుతున్నాయి. మంత్రిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ ఏర్పడిందని, దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో కూటమిలోని మిత్ర పక్షాలన్నీ కలిసి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. ‘మేం కొత్త దారుల కోసం అన్వేషిస్తున్నాం’ అంటూ ఆయన ట్వీట్‌ చేయడం చర్చకు దారి తీస్తోంది. కూటమి బీటలు వారుతుందా అనే అనుమానం కలుగుతోంది. మరోవైపు ఢిల్లీలో కూటమి నేతల చర్చల అనంతరం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్.. మీడియాతో మాట్లాడారు. దేశ్ ముఖ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన తేల్చేయడంతో ఈ వివాదం టీ కప్పులో తుపానేనంటున్నారు మరికొంతమంది.

Next Story