Telugu Global
MOVIE REVIEWS

చావు కబురు చల్లగా రివ్యూ

నటీనటులు: కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగర్, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు మ్యూజిక్ : జేక్స్‌ బిజాయ్ సినిమాటోగ్రాఫ‌ర్: క‌ర‌మ్ ఛావ్లా స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌వింద్ నిర్మాణం : జీఏ2 పిక్చ‌ర్స్ నిర్మాత : బ‌న్నీ వాసు రచన -దర్శకత్వం : కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి నిడివి : 137 నిమిషాలు రేటింగ్: 2.25/5 చావు కబురు చల్లగా అనే టైటిల్ లోనే పరమార్థం అంతా దాగుంది. సినిమా అంతా […]

చావు కబురు చల్లగా రివ్యూ
X

నటీనటులు: కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగర్, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు
మ్యూజిక్ : జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్: క‌ర‌మ్ ఛావ్లా
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌వింద్
నిర్మాణం : జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత : బ‌న్నీ వాసు
రచన -దర్శకత్వం : కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
నిడివి : 137 నిమిషాలు
రేటింగ్: 2.25/5

చావు కబురు చల్లగా అనే టైటిల్ లోనే పరమార్థం అంతా దాగుంది. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఓస్ ఇంతేనా అనిపిస్తే అది మన తప్పు కాదు. చెప్పాల్సిన పాయింట్ ను క్లైమాక్స్ వరకు దాచి, అప్పటివరకు ఏదేదో చూపించి.. చివరాఖర్లో చావుకబురు చల్లగా చెప్పారు. అందుకే ఈ సినిమా ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు.

సినిమాలో ఏం చెప్పామనేది ముఖ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఆడియన్స్ కు కొత్తగా చెప్పడానికేం లేదిక్కడ. అందుకే చెప్పాల్సిన పాయింట్ ను ఎంత బాగా చెప్పామనేది చాలా ముఖ్యమంటారు. ఆ విషయంలో చావు కబురు చల్లగా సినిమా, అత్యంత మెల్లగా నడుస్తుంది. కొన్ని కథలు వినడానికి బాగుంటాయి కానీ, తెరపైకి తీసుకొచ్చినప్పుడు అంత బాగుండవనే విషయానికి చావు కబురు చల్లగా మూవీ పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి, అసలు విషయాన్ని చెప్పకుండా కథ ఏంటనేది పైపైన చెప్పుకుందాం.

వైజాగ్ లో శవాలను స్మశానానికి తీసుకెళ్ళే స్వర్గపురి వాహనం నడిపే డ్రైవరు బస్తీ బాలరాజు ( కార్తికేయ). తన వృత్తిపరంగా ఓ చావు ఇంటి దగ్గర మల్లిక(లావణ్య త్రిపాఠి) అనే భర్త కోల్పోయిన అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నిత్యం ఆమెనే తలుచుకుంటూ వెంట తిరుగుతుంటాడు. భర్త పీటర్ హఠాన్మరణంతో బాధలో ఉన్న మల్లికకి బాలరాజు చేష్టలు విసుగెత్తిస్తాయి. బాలరాజు పదే పదే మల్లిక వెంట పడుతూ ఉండటంతో ఆమె మావయ్య తనకి మరో అబ్బాయితో రెండో పెళ్లి ఫిక్స్ చేస్తాడు.
మరో వైపు తన తండ్రి బ్రతికి ఉండగానే తల్లి గంగమ్మ(ఆమని) కి ఇంకో పెళ్లి చేసేందుకు రెడీ అవుతాడు బాలరాజు. ఇంతకీ బాలరాజు తన తల్లి గంగ కి మరో పెళ్లి చేయడానికి కారణం ఏమిటి? చివరికి తను కోరుకున్న అమ్మాయి మల్లికని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగతా కథ.

కథగా చెప్పుకోవడానికి ఇది చాలా బాగుంది. కానీ 137 నిమిషాల పాటు కూర్చోబెట్టాలంటే కథనం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో దర్శకుడు కౌశిక్ తడబడ్డాడు. అతడి రైటింగ్ బాగుంది కానీ, అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక దశలో ఫార్ములాను విడిచిపెట్టి, తను చెప్పాలనుకున్న పాయింట్ పైనే బలంగా నిలబడ్డంతో.. సినిమాలో వినోదం కంటే సూక్తులు ఎక్కువైపోయాయి.

తెల్లవారితే చావు-పుట్టుకల మధ్య ఉండే అబ్బాయి-అమ్మాయి మధ్య ప్రేమ అనే పాయింట్ కొత్తగా ఉంది.
కానీ దాన్ని సరైన స్క్రీన్ ప్లేతో ఇంకా స్ట్రాంగ్ గా చెప్పి మంచి సందేశం ఇవ్వగలిగితే బాగుండేది. కథ పరంగా సినిమా కొత్తగా అనిపిస్తుంది… కానీ కథనం వీక్ గా ఉండటం, స్లో నెరేషన్, మెయిన్ థీమ్ కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం మైనస్ పాయింట్స్.

ఉన్నంతలో కౌశిక్ చేసిన మంచి పని ఏదైనా ఉందంటే, తన కథలో పాత్రలకు మంచి నటీనటుల్ని ఎంపిక చేసుకోవడమే. కార్తికేయ, లావణ్య, ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్.. ఇలా అంతా తమ పాత్రలకు భలేగా సెట్టయ్యారు. మరీ ముఖ్యంగా ఆమనికి ఇది కెరీర్ బెస్ట్ అని చెప్పాలి. టెక్నికల్ గా చూస్తే జేక్స్ బిజాయ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. కరమ్ సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ మాత్రం బాగాలేదు. ఎప్పట్లానే గీతాఆర్ట్స్-2 పిక్చర్స్ నిర్మాతలు ప్రొడక్షన్ లో కాంప్రమైజ్ కాలేదు.

ఓవరాల్ గా చావుకబురు చల్లగా సినిమా ఓ కొత్త కథను ఆడియన్స్ కు పరిచయం చేసింది కానీ, ఓ హిట్ సినిమాను అందించలేకపోయింది.

Next Story