Telugu Global
National

మంత్రాలకు తమిళ ఓట్లు రాలతాయా..?

సమకాలీన రాజకీయాలన్నీ స్థానిక సమస్యల చుట్టూనే తిరుగుతున్నా బీజేపీ మాత్రం ఆదినుంచీ మత రాజకీయాలనే నమ్ముకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా తమ సత్తా బయటపడటానికి కారణం కూడా అదేనంటోంది ఆ పార్టీ. అదే ఊపులో తమిళనాడులో పాగా వేసేందుకు రెడీ అయింది. విభజించి పాలించు పద్ధతిలో అన్నాడీఎంకే నుంచి శశికళను వేరుచేసి బయటకు తెచ్చింది. తోలుబొమ్మలు ఆడించినట్టు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.. ఇద్దర్నీ ఆడిస్తోంది. ఈదశలో ప్రీపోల్స్ తనకే అనుకూలంగా ఉన్నా.. ప్రతిపక్ష నేత స్టాలిన్ […]

మంత్రాలకు తమిళ ఓట్లు రాలతాయా..?
X

సమకాలీన రాజకీయాలన్నీ స్థానిక సమస్యల చుట్టూనే తిరుగుతున్నా బీజేపీ మాత్రం ఆదినుంచీ మత రాజకీయాలనే నమ్ముకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా తమ సత్తా బయటపడటానికి కారణం కూడా అదేనంటోంది ఆ పార్టీ. అదే ఊపులో తమిళనాడులో పాగా వేసేందుకు రెడీ అయింది. విభజించి పాలించు పద్ధతిలో అన్నాడీఎంకే నుంచి శశికళను వేరుచేసి బయటకు తెచ్చింది. తోలుబొమ్మలు ఆడించినట్టు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.. ఇద్దర్నీ ఆడిస్తోంది. ఈదశలో ప్రీపోల్స్ తనకే అనుకూలంగా ఉన్నా.. ప్రతిపక్ష నేత స్టాలిన్ ని చిన్న అనుమానం వెంటాడుతోంది. అందుకే ఆయన కూడా అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించారు. చివరిగా ఇప్పుడు హిందూ అజెండాని భుజానికెత్తుకున్నారు.

రాష్ట్రంలో ఆలయాల జీర్ణోద్ధరణకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీని మేనిఫెస్టోలో ప్రకటించారు స్టాలిన్. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారికి 25వేలనుంచి నుంచి లక్ష రూపాయల దాకా ఆర్థికసాయం ఇస్తామన్నారు. హిందూ దేవాదాయ ధార్మిక విభాగం ఏర్పాటు ద్వారా ఆలయాల సంరక్షణను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తేవడం మరో అంశం. తిరుత్తణి, శోలింగార్‌, తిరునీర్‌ మలై, తిరుచ్చి మొదలైన ఆలయాల్లో కేబుల్‌ కార్‌ సౌకర్యం, తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకోసం హరితవనం ఏర్పాటు కూడా మేనిఫెస్టోలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లోని ఆలయ పూజారులకు నెలకు 2వేల రూపాయల పింఛను, రాష్ట్రవ్యాప్తంగా అర్చకుల జీతాలు 3వేలనుంచి 4వేలకు పెంపు.. ఇలా సాగింది స్టాలిన్ హిందూ అజెండా.

హిందూ ఓట్లను ఆకట్టుకోడానికి డీఎంకే ఇలాంటి హామీలు కూడా ఇస్తుందా అనేదే ఇప్పుడు అందర్నీ విస్మయ పరుస్తున్న విషయం. నాస్తికవాద సిద్ధాంతాల భావజాలంతో ఆవిర్భవించిన డీఎంకే కరుణానిధి హయాం వరకు వాటినే అనుసరిస్తూ వచ్చింది. పెరియార్‌ రామస్వామికి నిజమైన వారసుడిని అని చెప్పుకునే కరుణానిధి, మతాలకు అతీతంగా వ్యవహరించారు. లౌకిక వాదాన్నే బలపరిచారు. ఏ ఎన్నికల్లోనూ ఆయన హిందూ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. కానీ కాలం మారింది. అటు బీజేపీ హిందూ అజెండాతో దండయాత్రకు వస్తోంది. భారీ నష్టం కలుగుతుందని చెప్పలేం కానీ, హిందువుల ఓట్ల విషయంలో ఎంతోకొంత డీఎంకేకి నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే స్టాలిన్ రూటు మార్చారు. కాషాయ కండువా కప్పుకోలేదు కానీ.. అలా కప్పుకున్నవారందర్నీ తనవైపు తిప్పుకునేలా ఎన్నికల హామీలిచ్చారు. హిందువులకు తాము వ్యతిరేకం కాదనే భావన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరి బీజేపీ మంత్రాలకు తమిళ ఓట్లు రాలతాయా.. లేక స్టాలిన్ మంత్రాంగం ఫలిస్తుందా అనేది వేచి చూడాలి.

First Published:  15 March 2021 9:33 PM GMT
Next Story