పవన్ ఒంటరి పోరుకి ఇదే సరైన సమయం..
ఇటీవల కాలంలో తెలుగు మీడియాకి మంచి మసాలా వార్తలు దొరకలేదు. అందుకే బీజేపీ, జనసేన మైత్రిపై రకరకాల కథనాలు వండి వారుస్తున్నారు. మీడియాలో వచ్చే వార్తలు చూసి ఆవేశ పడుతున్నారో, లేక సహజంగానే ఆయా నాయకుల్లో అసంతృప్తి ఉందో తెలియదు కానీ.. కొన్నిరోజులుగా బీజేపీ, జనసేన ఇరు వర్గాలనుంచి మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి సీటు త్యాగం చేసిన కొన్ని గంటల తర్వాత, జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ జరిగిన ముచ్చటని పవన్ మరోసారి […]
ఇటీవల కాలంలో తెలుగు మీడియాకి మంచి మసాలా వార్తలు దొరకలేదు. అందుకే బీజేపీ, జనసేన మైత్రిపై రకరకాల కథనాలు వండి వారుస్తున్నారు. మీడియాలో వచ్చే వార్తలు చూసి ఆవేశ పడుతున్నారో, లేక సహజంగానే ఆయా నాయకుల్లో అసంతృప్తి ఉందో తెలియదు కానీ.. కొన్నిరోజులుగా బీజేపీ, జనసేన ఇరు వర్గాలనుంచి మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి సీటు త్యాగం చేసిన కొన్ని గంటల తర్వాత, జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ జరిగిన ముచ్చటని పవన్ మరోసారి తెరపైకి తేవడం కాస్త ఆశ్చర్యంగా తోస్తుంది. అసంతృప్తి ఉంటే అప్పుడే చెప్పి ఉండాలి, లేదా పూర్తిగా మనసులోనే పెట్టుకుని ఉండాలి. అలాంటిది పవన్ కల్యాణ్ తిరుపతి సీటు ఖరారైన తర్వాత ఆ వ్యవహారాన్ని బయటపెట్టి, అసంతృప్తి వెళ్లగక్కారు. కేంద్ర పార్టీతో సత్సంబంధాలున్నాయి కానీ, రాష్ట్ర నాయకులతో లేవని, ముఖ్యంగా తెలంగాణ నాయకత్వం తమను అవమాన పరిచిందని, బండి సంజయ్ వ్యాఖ్యలతో కలత చెందామని అన్నారు పవన్ కల్యాణ్. అందుకే ఈసారి జనసైనికుల మాట మన్నించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తెకు మద్దతిచ్చామని చెప్పారు.
పీవీ కుమార్తెకు ఓటేయండి అని నేరుగా చెప్పకుండానే, జనసైనికుల కోరిక ఇది, దాన్ని నేను మన్నించానంటూ పవన్ పరోక్షంగా హింటిచ్చారు. జనసేనాని వ్యాఖ్యలకు బండి సంజయ్ ఇచ్చిన రియాక్షన్ కూడా మరింత అగ్గి రాజేసేలా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ తటస్థంగా ఉంటే బాగుండేదని, టీఆర్ఎస్ కి మద్దతివ్వడం సరికాదని అన్నారాయన. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగలేదు. ఇటు జనసేనలో చోటా మోటా నాయకులంతా టీవీ డిబేట్లలో బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తమని మోసం చేశారని, అన్యాయం చేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికలనుంచి, తిరుపతి బైపోల్ వరకు చేతులు కట్టేశారని అంటున్నారు. ఈ దశలో ఖమ్మం, వరంగల్ మున్సిపాల్టీల్లో జరిగే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసేసుకుంది. అయితే సరిగ్గా ఎన్నికల సమయానికి పవన్ ని బీజేపీ నేతలు బుజ్జగించితే పరిస్థితి మరోలా ఉంటుందనేది జనసైనికులకు కూడా అనుభవంలోని విషయమే.
పవన్ బయటికొస్తే.. ఉక్కు ఉద్యమానికి నాయకత్వం..
ప్రస్తుతానికి బీజేపీ కేంద్ర నాయకత్వంతో పవన్ కి సత్సంబంధాలే ఉన్నాయి. ఏపీలో బలమైన మద్దతుదారుగా ఉన్న పవన్ ని వదిలిపెట్టేంత అనాలోచిత నిర్ణయం అమిత్ షా తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఒకవేళ అదే జరిగితే మాత్రం తిరుపతి ఉప ఎన్నికల్లో చతుర్ముఖ పోరు తప్పదు. పవన్ బయటికొస్తే, ఉక్కు ఉద్యమానికి కచ్చితంగా ఆయన కేంద్ర బిందువు అవుతారనడంలో అనుమానం లేదు. ఇన్నాళ్లూ బీజేపీతో మైత్రి ఉంది కాబట్టి, ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు పవన్ ఇబ్బంది పడ్డారు. ఆ బంధనాలు తెంచేసుకుంటే.. ఉక్కు ఉద్యమం సాక్షిగా పవన్ ప్రత్యామ్నాయ రాజకీయాలు నడిపే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో తెలిసింది కాబట్టి.. పవన్ ఒంటరి పోరుకి ఇదే సరైన సమయం అని అంటున్నారు అభిమానులు.