Telugu Global
National

‘గాయపడ్డ పులి’ పంజా ఎలా ఉండబోతుంది?

ఉక్కు మహిళ, రాజీలేని పోరాటాలు చేసే నాయకురాలిగా పేరున్న మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయపడ్డ పులి చాలా ప్రమాదకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన ఓ ఎన్నికల కార్యక్రమంలో ఆమె గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. సింపతీ కోసం దీదీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు వచ్చాయి. అయితే దీదీ గాయపడ్డ మాట వాస్తవం. దీంతో ఆమె చక్రాల కుర్చీలోనే తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆమె కోల్​కతాలో జరిగిన […]

‘గాయపడ్డ పులి’ పంజా ఎలా ఉండబోతుంది?
X

ఉక్కు మహిళ, రాజీలేని పోరాటాలు చేసే నాయకురాలిగా పేరున్న మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయపడ్డ పులి చాలా ప్రమాదకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన ఓ ఎన్నికల కార్యక్రమంలో ఆమె గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. సింపతీ కోసం దీదీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు వచ్చాయి.

అయితే దీదీ గాయపడ్డ మాట వాస్తవం. దీంతో ఆమె చక్రాల కుర్చీలోనే తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆమె కోల్​కతాలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘నందిగ్రామ్​ దివస్​’ పేరుతో సుమారు ఐదుకిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన జరిగింది. నందిగ్రామ్​లో 2007 మార్చి 14న భూసేకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో 14 మంది పోలీసుల కాల్పుల్లో అమరులయ్యారు. ఈ ఆందోళనను గుర్తుచేస్తూ ‘నందిగ్రామ్​ దివస్​’ పేరుతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మమతా ప్రసంగిస్తూ.. ‘ నా జీవితంలో అనేక దాడులు జరిగాయి. నేను ఎవ్వరికీ తలవంచలేదు. రాజీలేని పోరాటం చేశా. గాయపడ్డ పులి మరింత ప్రమాదకరం. రాష్ట్రంలోకి కొన్ని నిరంకుశ శక్తులు వచ్చి రాజ్యమేలుతున్నాయి. దాంతో బెంగాల్​ ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు మీ(ప్రజల) కష్టాలతోపోలిస్తే.. నేను పడే కష్టాలు ఎక్కువేమి కాదు’ అంటూ ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికలను భారతీయ జనతాపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ముమ్మరంగా ఆపరేషన్​ ఆకర్ష్​ను కొనసాగిస్తున్నది. మరోవైపు మమతా బెనర్జీ వైపు ఉన్న నేతలపై సీబీఐ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే దీదీ కూడా బీజేపీ నేతలకు స్ట్రాంగ్​గా కౌంటర్లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

మరోవైపు దీదీకి ప్రధాన అనుచరులుగా ఉన్న చాలా మంది ఆమెను వీడి బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆమె సింగిల్​గానే పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. ‘మీ ఇంటి ఆడపడుచును గెలిపించండి’ అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు.ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ సలహాలతో ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. సర్వేలు మాత్రం దీదీకి అనుకూలంగానే ఉన్నాయి. ఇక ఫలితాలు ఎలా ఉంటాయో? వేచి చూడాలి.

First Published:  15 March 2021 7:40 AM GMT
Next Story