Telugu Global
National

మమతపై దాడి కేసు.. చివరికిలా తేల్చారు..

పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తనపై దాడి జరిగిందని, కాలు విరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ఎన్నికల స్టంట్ గా అభివర్ణించారు. నందిగ్రామ్ లో నామినేషన్ వేసినప్పటినుంచి ఆమెకు గెలుపుపై ధీమా లేదని, చివరికి తిరిగి ఇంటికెళ్తూ, ఇలా దాడి డ్రామా ఆడారంటూ విమర్శించారు. ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. కాలికి కట్టుతో, చక్రాల కుర్చీతో దీదీ ప్రచారం బెంగాల్ లో హాట్ టాపిక్ […]

మమతపై దాడి కేసు.. చివరికిలా తేల్చారు..
X

పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తనపై దాడి జరిగిందని, కాలు విరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇదంతా ఎన్నికల స్టంట్ గా అభివర్ణించారు. నందిగ్రామ్ లో నామినేషన్ వేసినప్పటినుంచి ఆమెకు గెలుపుపై ధీమా లేదని, చివరికి తిరిగి ఇంటికెళ్తూ, ఇలా దాడి డ్రామా ఆడారంటూ విమర్శించారు. ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. కాలికి కట్టుతో, చక్రాల కుర్చీతో దీదీ ప్రచారం బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. సింపతీ మీటర్ పెరుగుతుందో లేదో చెప్పలేం కానీ, దెబ్బ తగిలినా లేచి నిలబడ్డ ఉక్కు మహిళగా మరోసారి మమత ఇమేజ్ పెరిగిందనేది మాత్రం వాస్తవం.

అయితే ఈ ఘటనపై సీరియస్ గా దృష్టిసారించిన ఎన్నికల కమిషన్ చివరకు దాడి జరగలేదని తేల్చేయడం కొసమెరుపు. మమతా బెనర్జీపై ఉద్దేశపూర్వకంగా ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తు ఆమె గాయాలపాలయ్యారని ప్రత్యేక పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. అనుకోకుండా జరిగిందే తప్ప, పథకం ప్రకారం జరిగిన దాడి కాదని తేల్చి చెప్పారు. ఈ ఘటన జరిగేటప్పుడు ఆమె చుట్టూ భారీగా భద్రతా సిబ్బంది ఉన్నారని, అయితే ముఖ్యమంత్రికి అతి సమీపంగా జనం తోసుకుంటూ వచ్చినా వారిని నిలువరించడం, నియంత్రించడంలో పోలీసులు, భద్రత సిబ్బంది విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నారు.

ఒకటికి రెండు నివేదికలు..
ఇప్పటికే ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం ఓ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. దాడి జరిగిందని చెబుతున్నా.. దానికి తగిన ఆధారాలు లేవని, వీడియో దృశ్యాలు స్పష్టంగా లేవని పేర్కొంది. పూర్తి వివరాలతో మరో నివేదిక పంపాలని సీఈసీ ఆదేశించడంతో రాష్ట్రం తరపున మరో నివేదిక కూడా వెళ్లింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక పరిశీలకులతో మరో నివేదికను తెప్పించుకుంది. నలుగురైదుగురు వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మమతా బెనర్జీ చెబుతున్న సందర్భంలో.. అలాంటి దృశ్యాలెక్కడా లభించకపోవడం విచిత్రం. ‘రద్దీగా ఉన్న ప్రాంతంలో సీఎం వాహనం వెళ్తోంది. ఆ సమయంలో సీఎం ఉన్న కారు తలుపును ఎవరో తోశారు. అది ఉద్దేశపూర్వకమో, కాదో స్పష్టంగా తెలియడం లేదు. వీడియోలోనూ స్పష్టత లేదు’ అని మాత్రమే నివేదికలో తెలిపింది ప్రత్యేక పరిశీలకుల కమిటీ.

అయితే దాడి విషయాన్ని హైలెట్ చేస్తున్న టీఎంసీ శ్రేణులు మాత్రం ఈ నివేదికపై మండిపడుతున్నాయి. దాడి జరిగినా కూడా కావాలనే దాన్ని తొక్కిపెడుతున్నారని విమర్శిస్తున్నారు టీఎంసీ నేతలు. మమతకు హాని తలపెట్టాలని చూస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు.

First Published:  13 March 2021 9:09 PM GMT
Next Story