Telugu Global
NEWS

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఏం తేల్చినట్టు..?

వస్తానని చెప్పలేదు, అలాగని రాననీ తేల్చేయలేదు. వస్తే ఎప్పుడొస్తాననేది స్పష్టం చేయలేదు, రాకపోతే ఎప్పటికీ రానని కూడా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తమ్మీద తన పొలిటికల్ ఎంట్రీపై చాలా తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఓ టీవీ షో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజకీయ రంగప్రవేశంపై సమాధానం దాటవేశారు ఎన్టీఆర్‌. ఇది సమయం కాదు, సందర్భం కాదు అని చెప్పారు. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏంటో.. నాకంటే మీకే ఎక్కువగా […]

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఏం తేల్చినట్టు..?
X

వస్తానని చెప్పలేదు, అలాగని రాననీ తేల్చేయలేదు. వస్తే ఎప్పుడొస్తాననేది స్పష్టం చేయలేదు, రాకపోతే ఎప్పటికీ రానని కూడా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తమ్మీద తన పొలిటికల్ ఎంట్రీపై చాలా తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఓ టీవీ షో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజకీయ రంగప్రవేశంపై సమాధానం దాటవేశారు ఎన్టీఆర్‌. ఇది సమయం కాదు, సందర్భం కాదు అని చెప్పారు. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏంటో.. నాకంటే మీకే ఎక్కువగా తెలుసని జర్నలిస్ట్ లనే ఇరుకున పెట్టారు తారక్.

ఎలా అర్థం చేసుకోవాలి.. ?
ఇది సమయం కాదు, సందర్బం కాదు అన్న తారక్ మాటలకు ఎవరికి నచ్చినట్టు వారు అర్థాలు చెప్పుకుంటున్నారు. ఇది సందర్భం కాదు అనేమాట కరెక్ట్ అని, అయితే సమయం కూడా కాదు అన్నారంటే, కచ్చితంగా వేరే సమయంలో తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారనే విషయం స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాత పార్టీని కైవసం చేసుకునే సమయం కోసం ఎన్టీఆర్ వేచి చూస్తున్నారని, అందుకే ఇది సమయం కాదని అన్నారని అంటున్నారు.

చంద్రబాబు వైరి వర్గానికి పండగే..
జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వినిపించిన సమాధానం చంద్రబాబుకు మేలు చేస్తుందా, లేక ఒత్తిడి పెంచుతుందా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు కాకపోయినా, తర్వాతయినా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వస్తారని, అన్నీ తానై పార్టీని నడిపిస్తారని అంటున్నారు. ఎన్టీఆర్ సమాధానం విని చంద్రబాబు వణికి పోతున్నారని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి. దీన్ని కేవలం ట్రోలింగ్ గానే చూడాలా, లేక నిజంగానే బాబు వర్గం ఆందోళనలో ఉందా అనేది తేలాల్సి ఉంది.

ఎంత పబ్లిక్ ఫంక్షన్ అయినా.. జర్నలిస్ట్ లు ఏమేం ప్రశ్నలు అడుగుతారనే విషయంపై నిర్వాహకులతో పాటు, ఇంటర్వ్యూకి వ‌చ్చే వారికి కూడా ఓ క్లారిటీ ఉంటుంది. అందులోనూ అది పూర్తిగా కమర్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి.. అక్కడ అంతా నిర్వాహకుల కంట్రోల్ లోనే ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ ని పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న అడిగారంటే.. కచ్చితంగా ముందే దానిపై నిర్ణయం జరిగిపోయి ఉంటుందని అంటున్నారు. తారక్ కూడా ఈ ప్రశ్నకు ఆల్రెడీ సమాధానం రెడీ చేసుకుని వచ్చారని అంటున్నారు. కుప్పం కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి, ప్రశ్నలు కురిపించిన వేళ, ఆయనే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఎన్టీఆర్ తో ఆ మాట చెప్పించారనే వాదన కూడా వినిపిస్తోంది. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న-సమాధానం.. అంతా ముందుగా రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోయిందనేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా.. ఎన్టీఆర్ మాటల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సమయం, సందర్భం ఇప్పుడు కాదు అన్న ఆయన.. ఇంకెప్పుడో వచ్చే ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నట్టే లెక్క.

First Published:  13 March 2021 6:16 AM GMT
Next Story