Telugu Global
NEWS

కేటీఆర్ ఆంధ్రా జపం వెనక మర్మమేంటి..?

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. ఈ నినాదం ఏపీలో వినబడిందంటే దానికో అర్థముంది. అదే నినాదం తెలంగాణలో అందులోనూ.. ఆంధ్రా అంటే అత్యంత అక్కసుతో ఉండే టీఆర్ఎస్ నాయకుల నోట వినపడ్డం మామూలు విషయం కాదు. స్వయానా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఈ నినాదం చేయడం, దాని అర్థం వివరించడం, విశాఖ ఉక్కు ఉద్యమానికి తాము కూడా మద్దతు పలుకుతామని అనడం, అవసరమయితే వైజాగ్ కి వచ్చి మరీ పోరాటానికి ప్రత్యక్ష మద్దతిస్తామనడం.. అంతా […]

కేటీఆర్ ఆంధ్రా జపం వెనక మర్మమేంటి..?
X

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. ఈ నినాదం ఏపీలో వినబడిందంటే దానికో అర్థముంది. అదే నినాదం తెలంగాణలో అందులోనూ.. ఆంధ్రా అంటే అత్యంత అక్కసుతో ఉండే టీఆర్ఎస్ నాయకుల నోట వినపడ్డం మామూలు విషయం కాదు. స్వయానా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఈ నినాదం చేయడం, దాని అర్థం వివరించడం, విశాఖ ఉక్కు ఉద్యమానికి తాము కూడా మద్దతు పలుకుతామని అనడం, అవసరమయితే వైజాగ్ కి వచ్చి మరీ పోరాటానికి ప్రత్యక్ష మద్దతిస్తామనడం.. అంతా విచిత్రంగా తోచింది.

“విశాఖలో ఏదో జరిగితే మాకేదో లాభం వస్తుందనుకోవద్దు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్నదాంతో మాకు సంబంధం లేదని కూర్చుంటే, తెల్లారితే మా దగ్గరకొస్తుంది. ఈరోజు విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతారు. ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని మా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తారు. కాబట్టి విశాఖ ఉక్కు పోరాటంలో ఉద్యోగులతో పాటు మేం కూడా కలిసుంటాం.” అంటూ కేటీఆర్ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నా.. ఆ వ్యాఖ్యల వెనక అసలు మర్మం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పక తప్పదు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానం విషయంలో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై పెద్దగా బెంగ బెట్టుకోలేదు. అదే సమయంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం మాత్రం టీఆర్ఎస్ కి కొరకరాని కొయ్యలా మారింది.

సరిగ్గా ఎన్నికల వేళ.. విశాఖ ఉక్కు విషయం వారికి దొరికింది. ఇంకేముంది, తెలంగాణ-ఆంధ్ర భాయ్ భాయ్ అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చిపడేశారు. విశాఖ వచ్చి మరీ ఉక్కుపోరాటంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. మిగతా తెలంగాణ అంతా ఒకరకంగా ప్రచారం చేసుకునే టీఆర్ఎస్, హైదరాబాద్ విషయంలో మాత్రం సెటిలర్ల ఓట్లకోసం ఏపీపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా ఏపీ ఓట్లకోసం ఆ పార్టీ తనదైన స్ట్రాటజీ అమలు చేస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విశాఖ ఉక్కు అంశాన్ని తన రాజకీయ లాభం కోసం వాడుకుంటోంది. అందులోనూ ఉమ్మడి శత్రువు బీజేపీపై రాళ్లేయడం, ఆ పార్టీని కార్నర్ చేయడం కూడా ఇక్కడ టీఆర్ఎస్ కి కలసివచ్చే అంశం. అటు సెటిలర్లను మచ్చిక చేసుకోవడం, ఇటు బీజేపీని విలన్ గా చూపడం .. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని టార్గెట్ చేశారు కేటీఆర్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్ సెటిలర్ల ఓట్లకు గాలం వేశారు.

First Published:  10 March 2021 9:14 PM GMT
Next Story