Telugu Global
NEWS

ఎన్నికల వేళ కేసీఆర్ తాయిలాలు..

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ ఉద్యోగులకు 7.5శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఉద్యోగులు భగ్గుమన్నారు. పొరుగున ఉన్న ఏపీ 27శాతం ఫిట్ మెంట్ ఇస్తే.. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న తెలంగాణలో మాత్రం 7.5శాతం విదిలిస్తారా అంటూ మండిపడ్డారు. ఆ ముచ్చట అయిపోయిన ఇన్నాళ్లకు తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ కి గుర్తొచ్చారు. పట్టభద్రుల స్థానాలకు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లకోసం కేసీఆర్ భారీగా వరాలు ప్రకటించారు. ఫిట్ మెంట్ […]

ఎన్నికల వేళ కేసీఆర్ తాయిలాలు..
X

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ ఉద్యోగులకు 7.5శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఉద్యోగులు భగ్గుమన్నారు. పొరుగున ఉన్న ఏపీ 27శాతం ఫిట్ మెంట్ ఇస్తే.. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న తెలంగాణలో మాత్రం 7.5శాతం విదిలిస్తారా అంటూ మండిపడ్డారు. ఆ ముచ్చట అయిపోయిన ఇన్నాళ్లకు తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ కి గుర్తొచ్చారు. పట్టభద్రుల స్థానాలకు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లకోసం కేసీఆర్ భారీగా వరాలు ప్రకటించారు. ఫిట్ మెంట్ వ్యవహారం నుంచి కారుణ్య నియామకాల వరకు అడిగిన వాటికి అడిగినట్టు ఓకే చెప్పేశారు. అయితే ప్రస్తుతానికి ఇదంతా అనధికారికం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే కోడ్ ఉన్నా కూడా పట్టుబట్టి మరీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన కేసీఆర్ వారికి శుభవార్త చెప్పి పంపించేశారు. బయటకి వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులు కేక్ లు కట్ చేసుకుని, స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో వారిపై కేసీఆర్ భారీ వరాల జల్లు కురిపించారనే విషయం అర్థమవుతోంది.

ఫిట్ మెంటే కాదు.. అంతకు మించి..
ఉద్యోగుల రిటైర్‌ మెంట్‌ వయసును 61 ఏళ్లకు పెంచడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం పరిధిలోని ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్ ని ఏడాది పాటు కుదించడం, టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో ఆలస్యం లేకుండా చేస్తానని కూడా హామీ ఇచ్చారట కేసీఆర్. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో అన్ని ఆస్పత్రులలో చికిత్సకు అనుమతివ్వడం, ఏపీలో పనిచేస్తున్న 800మంది ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడం వంటి విషయాల్లో కూడా ఉదారంగా ఉంటానని హామీ ఇచ్చారట.

ఫైనల్ గా వీఆర్వోలకు కూడా కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఇటీవలే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ వారి ఆగ్రహానికి గురయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో వీఆర్వోలు, వారి కుటుంబ సభ్యులు అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం కూడా జరిగింది. అధికారాలను కత్తిరించడమే కాదు, వారికి ఇతర పోస్టింగ్ లు కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకూ వీఆర్వోలను సతాయిస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు వారందరినీ రెవెన్యూ వ్యవస్థలోనే సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ తప్పు సరిదిద్దుకుంటానని అన్నారట. మొత్తమ్మీద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న వేళ, ఉద్యోగ సంఘాలకు తాయిలాలు ప్రకటించి ప్రత్యర్థులను డైలమాలో పడేశారు కేసీఆర్. అయితే ఈ తాయిలాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయో లేదో వేచి చూడాలి.

First Published:  9 March 2021 10:36 PM GMT
Next Story