Telugu Global
National

టీకా ప్రస్థానం.. ఉచితం నుంచి అమ్మకం వరకు..

భారత్ లో కరోనా టీకా మొదటి విడత పంపిణీ ఏ స్థాయిలో విజయవంతం అయిందో అందరికీ తెలుసు. వైద్య సిబ్బందిని బతిమిలాడి మరీ వ్యాక్సిన్ వేశారు. రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు హెచ్చరికలతో పని పూర్తి చేశారు. ఇప్పుడు పోలీసుల్లో కూడా తప్పనిసరి అంటనే చాలామంది టీకాకోసం ముందుకెళ్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ పై జరుగుతున్న ప్రచారంతోనే సగం మంది టీకాకి దూరంగా ఉంటున్నారు. టీకా వేయించుకున్నవారికి కూడా కరోనా సోకడం, టీకా వేయించుకున్నా కూడా మాస్క్ తప్పనిసరి అంటూ […]

టీకా ప్రస్థానం.. ఉచితం నుంచి అమ్మకం వరకు..
X

భారత్ లో కరోనా టీకా మొదటి విడత పంపిణీ ఏ స్థాయిలో విజయవంతం అయిందో అందరికీ తెలుసు. వైద్య సిబ్బందిని బతిమిలాడి మరీ వ్యాక్సిన్ వేశారు. రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు హెచ్చరికలతో పని పూర్తి చేశారు. ఇప్పుడు పోలీసుల్లో కూడా తప్పనిసరి అంటనే చాలామంది టీకాకోసం ముందుకెళ్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ పై జరుగుతున్న ప్రచారంతోనే సగం మంది టీకాకి దూరంగా ఉంటున్నారు. టీకా వేయించుకున్నవారికి కూడా కరోనా సోకడం, టీకా వేయించుకున్నా కూడా మాస్క్ తప్పనిసరి అంటూ వైద్య సిబ్బంది హెచ్చరించడం.. ఇదంతా చూస్తుంటే అసలు టీకా అవసరమా అనే అనుమానం సామాన్య ప్రజల్లో కలుగుతోంది.

ఉచితం అన్నారు, రేటు కడుతున్నారు..
ఎక్కడికక్కడ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో ఉచిత టీకాని చేర్చేసి ప్రచారం చేసుకున్న బీజేపీ అసలు ఆ ప్రక్రియనే అపహాస్యం చేసింది. ప్రధాని మోదీ నేరుగా టీకా ఉచితం అంటూ ప్రకటన చేయలేదు కానీ, బడ్జెట్ లో కేటాయించిన నిధులను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా ఉచితంగానే పంపిణీ చేసే ఉద్దేశం కేంద్రానికి ఉందనే విషయం అర్థమైంది. ఒకవేళ కేంద్రం రేటు కట్టినా, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దాని భారం మోసేందుకు సిద్దమైపోయాయి. అయితే అంతలోనే టీకాకి రేటు కడుతున్నారనే వార్తలు మొదలయ్యాయి. కొవిడ్ వారియర్స్ కి టీకా పంపిణీ పూర్తవుతుండటంతో.. మార్చి నుంచి 50ఏళ్లపైబడినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్ మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇక్కడే ప్రైవేటుకి అవకాశం కల్పించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని, కొవిడ్ టీకా ఒక్కో డోసు ఖరీదు రూ.500 ఉండొచ్చని కూడా వార్తలొస్తున్నాయి.

అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా తీసుకోవాలనుకునేవారికి ఎప్పటికీ ఉచితంగానే అందిస్తారని, కేవలం ప్రైవేటు ఆస్పత్రులలో టీకా తీసుకునేవారికి మాత్రమే రేటు కట్టి టీకాను విక్రయిస్తారని తెలుస్తోంది. అలా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేవారి వద్ద ఒక్కో డోసుకి రూ.500 వసూలు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్టు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై కేంద్రం క్లారిటీ ఇస్తుందని అంటున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి, వారికి ఉచితంగా సరఫరా చేశారని, సామాన్య ప్రజానీకానికి టీకా పంపిణీ మొదలు పెడితే ఒత్తిడి తట్టుకోవడం సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వం, ప్రైవేటుకి అప్పగించే ఉద్దేశంలో ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తమ్మీద భారత్ లో కొవిడ్ వ్యాక్సిన్ ఉచితం నుంచి అమ్మకానికి సిద్ధమవుతుందనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

First Published:  25 Feb 2021 8:33 PM GMT
Next Story