Telugu Global
NEWS

చంద్రబాబులో ఓటమి భయం.. లోకేష్ లో ఐడెంటిటీ భయం..

కనీసం నామినేషనే వేసేందుకు కూడా కుప్పంకి వెళ్లని చంద్రబాబు.. ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకి విలవిలలాడిపోతున్నారని, కుప్పంలో వీధి వీధీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కుప్పంకి అన్యాయం చేశానని చంద్రబాబే ఒప్పుకున్నారని అన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కుప్పంకి మంచినీరివ్వలేని చంద్రబాబుకి,. ఆ నెపం జగన్ పై నెట్టేసేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గానికి దోసెడు నీళ్లివ్వలేని బాబు, ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని […]

చంద్రబాబులో ఓటమి భయం.. లోకేష్ లో ఐడెంటిటీ భయం..
X

కనీసం నామినేషనే వేసేందుకు కూడా కుప్పంకి వెళ్లని చంద్రబాబు.. ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకి విలవిలలాడిపోతున్నారని, కుప్పంలో వీధి వీధీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కుప్పంకి అన్యాయం చేశానని చంద్రబాబే ఒప్పుకున్నారని అన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కుప్పంకి మంచినీరివ్వలేని చంద్రబాబుకి,. ఆ నెపం జగన్ పై నెట్టేసేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గానికి దోసెడు నీళ్లివ్వలేని బాబు, ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని అన్నారు. కుప్పం వీధుల్లో సైతం బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని ప్రచారం చేసుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు అంబటి. 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసిన బాబు, చివరకు ఆయన సినిమాలకు కూడా అడ్డుపడ్డారని విమర్శించారు. బాబు ప్రచారంలో కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తీసుకురావాలని కోరుతున్నారని, దాన్ని బట్టి బాబు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు అంబటి.

బాబుకి మేనిఫెస్టోల పిచ్చి..
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని, మేనిఫెస్టోలు ప్రచురించడంలో ఉన్న శ్రద్ద వాటి అమలులో పెట్టరని విమర్శించారు. 2014లో తెచ్చిన మేనిఫెస్టోకే ఇంతవరకు అతీ గతీ లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే హామీలు అమలు చేయలేని చంద్రబాబు, ఇప్పుడు అధికారంలో లేకుండా మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరం కాక ఇంకేంటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తలపై కేసులు మాఫీ చేస్తానని చెబుతున్నారని, కుప్పంలో ఇరుక్కుపోయిన బాబు బయటకు వచ్చేదెప్పుడు, అధికారంలోకి వచ్చేదెప్పుడు, కేసులు మాఫీ చేసేదెప్పుడు అని దెప్పిపొడిచారు. గతంలో చంద్రగిరిని మార్చినట్టు, రేపు కుప్పం నియోజకవర్గాన్ని కూడా బాబు మార్చుతారేమోనని అన్నారు.

లోకేష్ కి ఐడెంటిటీ క్రైసిస్..
నారా లోకేష్ ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నారని విమర్శించారు అంబటి. రాజకీయంగా ఎవరూ గుర్తించటం లేదనే ఫ్రస్ట్రేషన్ లోకేష్ కు ఎక్కువైందని, అందుకే స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. వాస్తవానికి లోకేష్ వచ్చిన తర్వాతే.. టీడీపీ సైకిల్ పూర్తిగా తునాతునకలైందన్న విషయాన్ని గమనించుకోవాలని ఎద్దేవా చేసారు. జగన్ గన్ లో బుల్లెట్ లు లేకపోతేనే.. లోకేష్ మంగళగిరిలో కూలిపోయాడా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల కొడుకులందరూ ముఖ్యమంత్రులు కాలేరని, దానికి జగన్ మోహన్ రెడ్డిగారిలా దమ్ము, ధైర్యం ఉండాలని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి మెటీరియల్ కాదని తేల్చేశారు. నారా లోకేష్ లో ఏదో తేడా ఉందని, మంచి డాక్టర్ కు చూపించాలని నారా భువనేశ్వరికి సలహా ఇచ్చారు అంబటి. నారావారి కుటుంబంలో మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ ని చూస్తేనే అర్థమవుతుందని చెప్పారు. లోకేష్ ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దటం అయ్యే పనికాదని, ముందు మంచి పౌరుడిగా తీర్చిదిద్దండని సూచించారు.

ఫినిషింగ్ టచ్ జనసేనపై..
జనసేనకు వైసీపీని ప్రశ్నించే హక్కుగానీ, విమర్శించే హక్కుగానీ లేదని అన్నారు అంబటి రాంబాబు. జనసేన ఎవరికో సేవ చేసే.. సేనగా కాకుండా, జనాలకు సేవచేసే సేనగా ఉంటే చాలని, అప్పుడే వారికి రాజకీయంగా మాట్లాడే హక్కు ఉంటుందని చెణుకులు విసిరారు.

First Published:  26 Feb 2021 10:05 AM GMT
Next Story