Telugu Global
NEWS

ఏపీలో కార్పొరేట్ విద్యామాఫియా చిరునామా గల్లంతు..

ప్రభుత్వ స్కూళ్లలో సుశిక్షితులైన ఉపాధ్యాయులున్నా, ఊరిలోనే అందుబాటులో ఉన్నా.. చాలామంది వాటిని వదిలి దూరంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కి వ్యాన్ లోనే వెళ్లడానికి ఇష్టపడతారు. వేలకు వేలు ఫీజులు కట్టే స్థోమత లేకపోయినా పిల్లల చదువుకోసం నిరుపేదలు సైతం అప్పులు చేస్తుంటారు. కార్పొరేట్ ఫీజుల దోపిడీని మనసులో తిట్టుకుంటున్నా, పైకి ఏమీ అనలేని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న దుస్థితే ఇది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట ఇప్పటి వరకూ […]

ఏపీలో కార్పొరేట్ విద్యామాఫియా చిరునామా గల్లంతు..
X

ప్రభుత్వ స్కూళ్లలో సుశిక్షితులైన ఉపాధ్యాయులున్నా, ఊరిలోనే అందుబాటులో ఉన్నా.. చాలామంది వాటిని వదిలి దూరంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కి వ్యాన్ లోనే వెళ్లడానికి ఇష్టపడతారు. వేలకు వేలు ఫీజులు కట్టే స్థోమత లేకపోయినా పిల్లల చదువుకోసం నిరుపేదలు సైతం అప్పులు చేస్తుంటారు. కార్పొరేట్ ఫీజుల దోపిడీని మనసులో తిట్టుకుంటున్నా, పైకి ఏమీ అనలేని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న దుస్థితే ఇది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు, ఇకపై సాధ్యం కాదు అనుకుంటున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ తీసుకొస్తున్న సంచలన మార్పులు, ఏపీలో కార్పొరేట్ విద్యామాఫియా మూటా ముల్లె సర్దుకోవాల్సిన తరుణం వచ్చిందని చెబుతున్నాయి.

ఇంగ్లిష్ మీడియంతో మొదలై, సీబీఎస్ఈ సిలబస్ వరకు..
ప్రైమరీ సెక్షన్ నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే బోధన, సీబీఎస్ఈ సిలబస్, అత్యాధునిక క్యాంపస్ ఫెసిలిటీ.. ఇవీ ఇప్పటి వరకూ కార్పొరేట్ విద్యాసంస్థలు తమ ప్రచారంలో చెప్పుకునే గొప్పలు. ఇకపై వీటిని చెప్పుకోవడం సాధ్యం కాదు. నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్లలో కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. తరగతి గదులు, మరుగుదొడ్లు.. కార్పొరేట్ స్కూళ్లలో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవు అనే స్థాయిలోకి మార్పు జరుగుతోంది. ఇంగ్లిష్ మీడియంపై కోర్టు కేసులు నడుస్తున్నా.. పూర్తి స్థాయిలో అమలుకోసమే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

సీబీఎస్ఈతో మరో ముందడుగు..
1నుంచి 7 తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత ప్రతి ఏడాదీ దాన్ని విస్తరించి 10వతరగతికి చేర్చడం కొత్తగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయంతో కార్పొరేట్ యాజమాన్యాల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం నిర్ణయంతో సగం అడ్మిషన్లు తగ్గాయి. ఇప్పుడిక సీబీఎస్ఈ సిలబస్ అంటే ప్రైవేట్ స్కూళ్ల ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు పేరెంట్స్. సుశిక్షితులైన స్టాఫ్ ప్రభుత్వ స్కూళ్ల సొంతం, అందులోనూ జగనన్న విద్యా కానుక పేరుతో పుస్తకాలు, బ్యాగ్, షూ, టై.. అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఆకలి తీరుస్తున్నారు. ఇన్ని వనరులున్న ప్రభుత్వ స్కూళ్లను వదిలి, ఇకపై ఎవరైనా ప్రైవేటు స్కూల్ కి వెళ్తారా అనేది ప్రశ్నార్థకం.

నేరుగా కార్పొరేట్ విద్యా మాఫియాపై కొరడా ఝళిపించకుండా.. పరోక్షంగా ప్రభుత్వ విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి, కార్పొరేట్ పై గట్టి దెబ్బ కొట్టింది వైసీపీ సర్కారు. ఈ సంచలన మార్పుల ఫలితాలు ఎలా ఉంటాయనేదానికి భవిష్యత్ తరాల విద్యాభివృద్ధే గీటురాయి.

First Published:  24 Feb 2021 8:35 PM GMT
Next Story