Telugu Global
NEWS

చంద్రబాబులో ఉన్న ఉత్సాహం.. నాయకుల్లో ఉందా..?

పంచాయతీ ఎన్నికల రణక్షేత్రంలో తాడో పేడో తేల్చుకుంటామన్నారు చంద్రబాబు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని పంచాయతీ ఫలితాలలో అది ప్రతిఫలిస్తుందని కూడా ఢంకా భజాయించారు. కానీ ఆయన అనుకున్నదొకటి, అయినది ఒకటి. 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నామని చెబుతూనే, మరోవైపు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయలేదని నిందలు వేశారు. పంచాయతీ పర్వం పూర్తి కావడంతో ఇప్పుడు పురపోరుకి సిద్ధమయ్యారు బాబు. ఎన్నికలేవయినా.. అందరికంటే ముందుగా ప్రణాళికలు రచించడం, వీలైతే పంచాయతీ […]

చంద్రబాబులో ఉన్న ఉత్సాహం.. నాయకుల్లో ఉందా..?
X

పంచాయతీ ఎన్నికల రణక్షేత్రంలో తాడో పేడో తేల్చుకుంటామన్నారు చంద్రబాబు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని పంచాయతీ ఫలితాలలో అది ప్రతిఫలిస్తుందని కూడా ఢంకా భజాయించారు. కానీ ఆయన అనుకున్నదొకటి, అయినది ఒకటి. 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నామని చెబుతూనే, మరోవైపు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయలేదని నిందలు వేశారు. పంచాయతీ పర్వం పూర్తి కావడంతో ఇప్పుడు పురపోరుకి సిద్ధమయ్యారు బాబు.

ఎన్నికలేవయినా.. అందరికంటే ముందుగా ప్రణాళికలు రచించడం, వీలైతే పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం, అభ్యర్థుల ప్రకటన.. హడావిడి.. ఇదంతా చంద్రబాబు మార్కు రాజకీయం. ఇప్పుడు పురపోరుకి కూడా ఆయన అంతే హడావిడి పడుతున్నారు. ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు, మున్సిపాల్టీల్లో మనదే విజయం అంటూ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు.. పంచాయతీ ఎన్నికల్లో కనబరిచిన స్ఫూర్తినే మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలని పిలుపునిచ్చారు. నామినేషన్లు వేసినవారిని వైసీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సిపాలిటీలకు, గ్రామాలకు తేడా ఉంటుందని, అర్ధరాత్రి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటం పట్టణ ఎన్నికల్లో కుదరదని, బలవంతపు ఏకగ్రీవాలు, మైండ్‌ గేమ్‌, ప్రలోభాలు, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బాబులో ఉత్సాహం.. నాయకుల్లో నిస్తేజం..
చంద్రబాబు ఎప్పుడూ ఉత్సాహంగానే కనిపిస్తారు. పంచాయతీల్లో వ్యతిరేక ఫలితాలొచ్చినా.. తనదైన లాజిక్ చెబుతూ కార్యకర్తలు బెదిరిపోకుండా చూస్తున్నారు. అయితే మున్సిపాల్టీలకు కూడా అదే ఫార్ములా వర్తిస్తుందని అనుకోలేం. పంచాయతీ ఫలితాలతో చాలా చోట్ల టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఏకగ్రీవాల సంగతి పక్కనపెడితే, నాయకులనుంచి ఆర్థిక భరోసా అందక, స్థానికంగా వైసీపీని ఢీకొట్టే సామర్థ్యం లేక ఇబ్బపంది పడ్డారు అభ్యర్థులు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. చంద్రబాబు భరోసా ఇస్తున్నా.. స్థానిక నాయకత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు అభ్యర్థులు. పంచాయతీల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో మున్సిపల్ పోరు విషయంలో ముందుగానే టీడీపీ అభ్యర్థులు కాడె పడేస్తున్నారనే సమాచారం ఉంది. దీంతో చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. అభ్యర్థులను ఉత్సాహ పరిచేందుకు ఆయన పదే పదే టెలికాన్ఫరెన్స్ లు, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా అందుబాటులోకి వస్తున్నారు. అయితే బాబులో ఉన్న ఉత్సాహం స్థానిక నాయకత్వంలో లేదనే విషయం మాత్రం అర్థమవుతోంది. పంచాయతీ ఫలితాలతో డీలాపడ్డ టీడీపీ నేతలు, కార్యకర్తలు, పురపోరుకి వెనకడుగేస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  23 Feb 2021 10:33 PM GMT
Next Story