Telugu Global
NEWS

పిల్లలకు సురక్షిత మంచినీరు.. రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కారు

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందుగా తెలంగాణలో పూర్తయింది. వందరోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా 22,882 ప్రభుత్వ పాఠశాలలకు, 27,310 అంగన్‌వాడీ కేంద్రాలకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు‌ ఇచ్చారు. వీటన్నిటికీ జియో ట్యాగింగ్ చేయడం మరో కీలక ముందడుగు. ప్రతి […]

పిల్లలకు సురక్షిత మంచినీరు.. రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కారు
X

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందుగా తెలంగాణలో పూర్తయింది. వందరోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా 22,882 ప్రభుత్వ పాఠశాలలకు, 27,310 అంగన్‌వాడీ కేంద్రాలకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు‌ ఇచ్చారు. వీటన్నిటికీ జియో ట్యాగింగ్ చేయడం మరో కీలక ముందడుగు.

ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించిన తొలి రాష్ట్రంగా ఇప్పటికే తెలంగాణ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నల్లా కనెక్షన్ అందించిన రాష్ట్రంగా కూడా తెలంగాణ ముందువరుసలో నిలిచిందని కేంద్ర జల్ ‌జీవన్‌ మిషన్‌ ప్రశంసించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా సురక్షిత తాగునీటి సరఫరాకు 100 రోజుల ప్రణాళికను ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్రం లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, గోవా, హర్యానా రాష్ట్రాలు చేరుకున్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉంది. ఇంకా లక్ష్యాన్ని పూర్తిచేయని రాష్ట్రాలకు మార్చి నెలాఖరు వరకు కేంద్రం గడువు ఇచ్చింది.

గతంలో అనేక ప్రభుత్వ పాఠశాలలకు శుద్ధిచేసిన తాగునీరు అందేదికాదు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా నల్లా కనెక్షన్లు ఉండేవి కాదు. బోర్లు, పబ్లిక్‌ నల్లాల వద్ద మంచినీటిని తీసుకొచ్చి మధ్యాహ్న భోజనానికి ఉపయోగించేవారు. దీని వల్ల విద్యార్థులకు మంచినీటి సంబంధిత ఇబ్బందులు తలెత్తిన సందర్భాలూ ఉన్నాయి. కరోనా కారణంగా చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోడానికి కూడా నీటి సౌకర్యం ఉండేది కాదు. ఇప్పుడు నల్లా కనెక్షన్ల వల్ల ఈ సమస్యలన్నీ తీరిపోయాయి.

ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించడం సీఎం కేసీఆర్‌ విజన్‌ వల్లే సాధ్యమైందని చెబుతున్నారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసలతోపాటు నీతి ఆయోగ్‌ సిఫార్సు మేరకు మిషన్‌ భగీరథకు నిధులు కూడా ఇవ్వాలని ఆయన కోరారు. మిషన్‌ భగీరథకు అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.

First Published:  22 Feb 2021 4:13 AM GMT
Next Story