Telugu Global
NEWS

ఉక్కు సంకల్పం పలుచనవడానికి కారణం ఎవరు..?

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారనగానే రాష్ట్రవ్యాప్తంగా ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. అది కేవలం ఉత్తరాంధ్ర సమస్యే కాదు, రాష్ట్ర సమస్య అంటూ, గతంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పేరుతో చేసిన పోరాటాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో స్వాభిమానం పొంగి పొర్లింది, వాట్సప్ స్టేటస్ లలో ఆంధ్రుల హక్కు అనే నినాదం మారుమోగింది. తీరా రోజులు గడిచేకొద్దీ.. ఎవరి దారి వారిదే, ఎవరి పనులు వారివే. ముఖ్యంగా రాజకీయ పార్టీలు […]

ఉక్కు సంకల్పం పలుచనవడానికి కారణం ఎవరు..?
X

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారనగానే రాష్ట్రవ్యాప్తంగా ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. అది కేవలం ఉత్తరాంధ్ర సమస్యే కాదు, రాష్ట్ర సమస్య అంటూ, గతంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పేరుతో చేసిన పోరాటాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో స్వాభిమానం పొంగి పొర్లింది, వాట్సప్ స్టేటస్ లలో ఆంధ్రుల హక్కు అనే నినాదం మారుమోగింది. తీరా రోజులు గడిచేకొద్దీ.. ఎవరి దారి వారిదే, ఎవరి పనులు వారివే. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా పలుచన చేశాయి. అందరికంటే ముందు రాజీనామా లేఖ రాసి హడావిడి చేసేవారు ఒకరైతే.. అందరం కలసి రాజీనామా చేద్దామంటూ సవాల్ విసిరేవారు మరికొందరు, ప్రధానితో భేటీకోసం, ఢిల్లీ వెళ్లి ఉత్త చేతుల్తో వెనక్కి వచ్చేవారు ఇంకొందరు. ఇలా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తలోదారి పట్టాయి. స్వతహాగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమదారిన తాము ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మద్దతు తెలిపేందుకు వచ్చిన పార్టీల నాయకులను, ఇతర ముఖ్యులను స్వాగతిస్తున్నారు.

ఐకమత్యం ఉందా..?
ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరాది రాష్ట్రాల రైతులు చేస్తున్న ఆందోళన ఏకంగా విదేశీయుల్ని సైతం కదిలించింది. రెండేళ్లపాటు చట్టాల అమలుని వాయిదా వేస్తామనే స్థితికి కేంద్రాన్ని తీసుకొచ్చింది. మరి విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నట్టు? అందరూ కలిసి కేంద్రంపై యుద్ధం ప్రకటించాల్సిన వేళ.. విడివిడిగా సవాళ్లు విసురుతూ పలుచన అయిపోయారు. విభజిచి పాలించు అనే పద్ధతిలో కేంద్రం కూడా ఈ విడివిడి పోరాటాలను చూసి నవ్వుకుంటోంది. తమ పార్టీ నాయకులు తమ వద్దకే వచ్చి ఇస్తున్న అభ్యర్థనలు చూసి డ్రామా రక్తికట్టిస్తున్నారంటూ ప్రశంసించి పంపిస్తోంది. వాస్తవానికి కేంద్రానికి కావాల్సింది కూడా ఇదే. తమపై నిందమోపకుండా.. ఏపీలోని పార్టీలన్నీ ఒకదానిపై ఒకటి బురదజల్లుకోవడంతో ప్రైవేటీకరణ అంశంపై వెనక్కి తగ్గాల్సిన అవసరం కేంద్రానికి లేకుండా పోయింది. విశాఖ విషయంలో అసలు ఏంజరుగుతోందో అర్థం కాక ఏపీ ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ఉద్యమాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎంతకాలం నానబెడతారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ వస్తున్న అభ్యర్థనలపై కేంద్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. ప్రైవేటీకరణ అపుతామని కానీ, వాయిదా వేద్దామని కానీ, అసలు ప్రైవేటీకరణ జోలికే వెళ్లబోమని కానీ ప్రకటించలేదు. ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా స్పందన లేదు. విశాఖ ఉక్కుకి కొత్త గనుల కేటాయింపు, బకాయిలపై వడ్డీమాఫీ వంటి అంశాలపై మారు మాట కూడా లేదు. ఈ దశలో నానబెట్టి నానబెట్టి వివాదం సద్దుమణిగాక ప్రైవేటీకరణ ఒప్పందాన్ని చల్లగా అమలు చేయాలనే ధోరణిలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, కుమ్ములాటలు ఆపేసి, కేంద్రంపై సమరభేరి మోగిస్తేనే ఫలితం కనపడొచ్చు. లేకపోతే టీడీపీ ఉద్యమం, వైసీపీ ఉద్యమం, జనసేన-బీజేపీ ఉద్యమం, వామపక్షాలతో కలసి ఉద్యోగుల ఉద్యమం అంటూ.. విడివిడిగా ఎవరి టెంట్లు వాళ్లు నడుపుకోవాల్సిందే.

First Published:  15 Feb 2021 11:45 PM GMT
Next Story