Telugu Global
NEWS

బీజేపీతో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

కేసీఆర్ ఢిల్లీ టూర్ తరువాత టీఆర్ఎస్ స్వరం మార్చింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డ అధికార పార్టీ అకస్మాత్తుగా మ్యూట్ అయిపోంది. అప్పటి వరకూ కేంద్రం విధానాలను తప్పుబట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా బీజేపీ అడుగులో అడుగేస్తూ నడవడం మొదలుపెట్టింది. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణను భాగం చేసింది. వ్యవసాయ చట్టాలను సమర్థించింది. ఈ పరిణామాలతో కేసీఆర్ కేంద్రానికి సరెండర్ అయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ.. తాజాగా మళ్లీ టీఆర్ఎస్ […]

బీజేపీతో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
X

కేసీఆర్ ఢిల్లీ టూర్ తరువాత టీఆర్ఎస్ స్వరం మార్చింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డ అధికార పార్టీ అకస్మాత్తుగా మ్యూట్ అయిపోంది. అప్పటి వరకూ కేంద్రం విధానాలను తప్పుబట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా బీజేపీ అడుగులో అడుగేస్తూ నడవడం మొదలుపెట్టింది. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణను భాగం చేసింది. వ్యవసాయ చట్టాలను సమర్థించింది. ఈ పరిణామాలతో కేసీఆర్ కేంద్రానికి సరెండర్ అయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ.. తాజాగా మళ్లీ టీఆర్ఎస్ దూకుడు పెంచింది. బీజేపీపై ఎదురుదాడి మొదలు పెట్టింది.

హలియా బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ నేతలను కొత్త బిచ్చగాళ్లుగా అభివర్ణించిన కేసీఆర్, పిచ్చిగా మాట్లాడితే తొక్కి పడేస్తామన్నారు. తాము తలుచుకుంటే బీజేపీ నేతలు దుమ్ము దుమ్ము అవుతారని, నశం కింద కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు భూకబ్బాలకు పాల్పడుతున్నారంటూ నల్లగొండ జిల్లాలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగిన రెండు రోజులకే కేసీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. నాగార్జునసాగర్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎన్నికల ప్రస్తావన తేకుండానే ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు.

కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ పేరెత్తే అర్హతే లేదన్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. పిచ్చి కార్యక్రమాలు చేస్తే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. కేసీఆర్ ఇచ్చిన బూస్టింగ్ తో టీఆర్ఎస్ నేతలు సైతం ప్రతిపక్షాలపై ఎదురుదాడి మొదలుపెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల పదవులు కేసీఆర్ పెట్టిన బిక్షమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ కోసం రాజీనామాలు చేయమంటే పారిపోయిన సన్నాసులు మీరు అంటూ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ఒకటి రెండు సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారని, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసని బీజేపీ నేతలనుద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది అని, తాము తలుచుకుంటే ప్రధాన మంత్రినైనా వదిలిపెట్టబోమని హెచ్ఛరించారు. నిన్నా మొన్నటిదాకా.. కేంద్రానికి అనుకూలంగా మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఎందుకు స్వరం మార్చారనే సందేహం ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సత్తా చాటాలనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటే నష్టపోతామనే భయం టీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. అందుకే.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మాటల దాడిని మొదలు పెట్టింది. తద్వారా కిందిస్థాయి కేడర్ లో స్థైర్యాన్ని నింపడమనేది కేసీఆర్ వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ ఈ కొత్త వ్యూహమైన సత్ఫలితాలిస్తుందో లేదో చూడాలి.

First Published:  13 Feb 2021 12:28 AM GMT
Next Story