Telugu Global
NEWS

బాబు, నిమ్మగడ్డ ఇద్దరూ డ్రామా ఆర్టిస్ట్ లు..

ఎస్ఈసీ సమర్థంగా పనిచేయలేదంటూ చంద్రబాబు మాట్లాడటం, ఓ డ్రామా అని, బాబు, నిమ్మగడ్డ ఇద్దరూ డ్రామా ఆర్టిస్ట్ లేనని అన్నారు మంత్రి కొడాలి నాని. వారిద్దరూ వేర్వేరు అని ప్రజలు అనుకోవడం లేదని, అందుకే స్టైల్ మార్చి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకుంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రేషన్ డోర్ డెలివరీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీయేనని, దానిపై రాద్ధాంతం చేయడం తగదన్నారు నాని. రేషన్ డోర్ డెలివరీ వల్ల వైసీపీకి స్థానిక ఎన్నికల్లో లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో […]

బాబు, నిమ్మగడ్డ ఇద్దరూ డ్రామా ఆర్టిస్ట్ లు..
X

ఎస్ఈసీ సమర్థంగా పనిచేయలేదంటూ చంద్రబాబు మాట్లాడటం, ఓ డ్రామా అని, బాబు, నిమ్మగడ్డ ఇద్దరూ డ్రామా ఆర్టిస్ట్ లేనని అన్నారు మంత్రి కొడాలి నాని. వారిద్దరూ వేర్వేరు అని ప్రజలు అనుకోవడం లేదని, అందుకే స్టైల్ మార్చి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకుంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రేషన్ డోర్ డెలివరీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీయేనని, దానిపై రాద్ధాంతం చేయడం తగదన్నారు నాని. రేషన్ డోర్ డెలివరీ వల్ల వైసీపీకి స్థానిక ఎన్నికల్లో లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో నిమ్మగడ్డకు చెప్పి దాన్ని ఆపివేయించారని అన్నారు. మున్సిపాల్టీల్లో విజయవంతంగా పథకం అమలవుతుంటే.. మరోవైపు టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం రేషన్ బండి ఆగింది అంటూ రాద్ధాంతం చేస్తున్నారని, అదే నిజమైతే.. రాష్ట్రంతా పథకం అమలు చేస్తే వైసీపీకి నష్టం జరిగేది కదా, అది టీడీపీకి లాభమే కదా అని ప్రశ్నించారు. పరస్పర వ్యతిరేక వార్తలు రాస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే టీడీపీ కుట్ర చేస్తోందని.. డబ్బా ఛానల్స్, చెత్త పేపర్లలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. డబ్బున్నోళ్లు.. అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌ కు ఫోన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి డోర్ డెలివరీ చేయించుకోవచ్చు కానీ, పేదవాడికి తింటానికి రేషన్ సరకులు డోర్‌ డెలివరీ చేస్తుంటే ప్రతిపక్షాలు తెగ ఏడుస్తున్నాయని అన్నారు.

పంచాయతీల్లో వైసీపీదే విజయం..
తొలి దశ ఎన్నికల్లో దాదాపు (82-83%) వైసీపీ 2640 మంది సర్పంచ్‌ లు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి 500 మంది సర్పంచ్‌లు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పారు మంత్రి నాని. దీన్ని మభ్యపెట్టాలని, టీడీపీకి 2000-3000 వరకు సర్పంచ్ స్థానాలు వచ్చాయని సొంత పేపర్లలో గాలి వార్తలు రాయించుకుంటున్నారని, ఈ తప్పుడు వార్తల్ని బూచిగా చూపి మిగతా దశల్లో లబ్ధి పొందాలని ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. వారి పప్పులు ఉడికే రోజులు పోయాయని చెప్పారు నాని. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,000కు పైగా పంచాయితీలలో 11వేల పంచాయతీల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు.

తండ్రీ కొడుకుల్ని సాగనంపాల్సిందే..
వైసీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు కలలు కంటున్నారని, పంచాయతీ, జిల్లా పరిషత్‌, మున్సిపాల్టీ ఎన్నికలు పూర్తి అయ్యేసరికి టీడీపీ కేడరే చంద్రబాబు, లోకేశ్‌ ను ఆ పార్టీ నుంచి బయటకు పంపే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తూ ఏదో రకంగా టీడీపీ కార్యకర్తల్ని పోటీలో పెట్టి వారిని ఆర్థికంగా నష్టపరుస్తున్నారని అన్నారు. చంద్రబాబు దొంగమాటలు నమ్మి గత్యంతరం లేక పోటీలో నిలబడి, చివరికి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు గ్రామాల్లో ఏడుస్తున్నారని, ఆర్థికంగా నష్టపోయిన టీడీపీ కేడరే తండ్రీకొడుకుల్ని త్వరలో రాష్ట్రం నుంచి సాగనంపుతారని అన్నారు. లోకేష్ సర్పంచ్‌ గా పోటీ చేస్తే జగన్ దెబ్బ ఏంటో చూసేవారని, చిత్తూరు జిల్లాలో సైతం లోకేష్ సర్పంచ్ గా పోటీ చేసినా ఓడిపోతారని అన్నారు.

ప్రజా స్వామ్యం గురించి బాబు మాట్లాడటమా..?
చంద్రబాబు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు మంత్రి నాని. వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువా కప్పి, వారిలో నలుగురికి మంత్రి పదవులిచ్చిన బాబు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని చెప్పారు. 2018లో కాలపరిమితి పూర్తయిన పంచాయతీలకు 2019లో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు. బాబు నిజమైన ప్రజాస్వామ్యవాది అయితే ఆరోజే ఎన్నికలు పెట్టాల్సింది కదా అని అడిగారు. మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు వెళ్లిందని, రాష్ట్రపతికి, అమిత్ షాకు లేఖలు రాస్తున్న బాబు, రెండో దశ ఎన్నికలు పూర్తి కాగానే, రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి కూడా లేఖలు రాస్తారని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆప‌లేరా..?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానంటూ ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. చివరకు వైసీపీ ఎంపీల మద్దతు కోరుతున్నారని, తమ ఎంపీలందర్నీ పంపిస్తాం, పవన్ ప్రైవేటీకరణ ఆపగలరా అని ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షంలో ఉన్న పవన్ అంతమాత్రం చేయలేరా అని అడిగారు. నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే ఆలోచన ప్రతిపక్షాలకు ఉంటే వైసీపీతో కలసి రావాలని, పోరాటం చేయాలని అన్నారు. సంక్షోభ సమయాన్ని కూడా టీడీపీ, జనసేన రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

First Published:  12 Feb 2021 5:44 AM GMT
Next Story