Telugu Global
NEWS

నిమ్మగడ్డ ఓదార్పు యాత్రలు రాజ్యాంగబద్ధమేనా..?

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఫక్తు రాజకీయనాయకుడిలా మారిపోయారంటూ ఓవైపు అధికార పక్షం విమర్శలు చేస్తున్నా.. మరోవైపు ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చే పనులన్నీ చేసేస్తున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కడప జిల్లా పర్యటనలో వైఎస్సార్ గురించి గొప్పగా ప్రస్తావిస్తూనే జగన్ పై ఉన్న సీబీఐ కేసులపై వ్యాఖ్యలు చేసి పరోక్షంగా వైసీపీని ఇరుకున పెట్టాలని చూశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తాను కలెక్టర్ గా పనిచేసిన అనుభవాలు చెప్పుకుంటూనే.. ఎన్నికల కమిషన్ ఫర్నిచర్ […]

నిమ్మగడ్డ ఓదార్పు యాత్రలు రాజ్యాంగబద్ధమేనా..?
X

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఫక్తు రాజకీయనాయకుడిలా మారిపోయారంటూ ఓవైపు అధికార పక్షం విమర్శలు చేస్తున్నా.. మరోవైపు ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చే పనులన్నీ చేసేస్తున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కడప జిల్లా పర్యటనలో వైఎస్సార్ గురించి గొప్పగా ప్రస్తావిస్తూనే జగన్ పై ఉన్న సీబీఐ కేసులపై వ్యాఖ్యలు చేసి పరోక్షంగా వైసీపీని ఇరుకున పెట్టాలని చూశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తాను కలెక్టర్ గా పనిచేసిన అనుభవాలు చెప్పుకుంటూనే.. ఎన్నికల కమిషన్ ఫర్నిచర్ ని ప్రభుత్వం ఎత్తుకెళ్లిందంటూ సెటైర్ వేశారు. అందుకే అధికార పార్టీ నేతలు కూడా అదే స్టైల్ లో నిమ్మగడ్డపై విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తన గురువు చంద్రబాబు గురించి చెప్పేటప్పుడు.. ఓటుకు కోట్లు కేసుని కూడా గుర్తు చేయాలంటూ చురకలంటించారు.

పరామర్శలు.. విమర్శలు..
తూర్పుగోదావరి జిల్లా గొల్లగుంటలో సర్పంచ్ అభ్యర్థి భర్త మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు నిమ్మగడ్డ. అది హత్యో, ఆత్మహత్యో.. ఇంకా తేలలేదు. ఆ మరణం వెనకున్న కారణాలు బయటకు రాలేదు. అలాంటప్పుడు ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ ఆ ఇంటికి వెళ్లడం, వారిని ఓదార్చడం.. పనిలో పనిగా రాజకీయ ప్రతీకార డైలాగులు వల్లెవేయడం సరైన చర్యేనా..? తప్పు చేసింది ఎంత పెద్దోళ్లయినా తప్పకుండా శిక్షపడుతుంది అంటూ నిమ్మగడ్డ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఎవరికి మేలు చేస్తాయి? ఎవరిని టార్గెట్ చేస్తాయి? ఆమాత్రం తెలియకుండానే నిమ్మగడ్డ ఈ పరామర్శకు వెళ్లారా అంటూ అధికార పక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయన జిల్లా కలెక్టర్ కాదు, కనీసం కేసు విచారణ చేసే పోలీస్ ఆఫీసర్ కూడా కాదు, అయినా కూడా ఓ సర్పంచ్ అభ్యర్థి ఇంటికి నిమ్మగడ్డ ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాసరెడ్డి మరణం విషయంలో స్థానిక ఎస్సైని, కానిస్టేబుల్‌ని వీఆర్ కి పంపించాలని నిమ్మగడ్డ ఆదేశాలివ్వడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలా అధికారం నిమ్మగడ్డకు ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే.. ప్రాథమిక విచారణ పూర్తికాక ముందే, నెపం పోలీసులపై నెట్టి వీఆర్ కి పంపించాలనడం తప్పుడు సంకేతాలకు దారిస్తుందని అంటున్నారు.

నిమ్మగడ్డను ఇలాగే వదిలేస్తే.. రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని, ఆస్పత్రిలో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని కూడా కలసి వస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. రోజు రోజుకీ నిమ్మగడ్డ రాజకీయ నాయకుడిలా మారిపోతున్నారని అంటున్నారు. ప్రభుత్వాన్ని శత్రువుగా చూస్తూ, తన మాటలు, చేతలతో ప్రతిపక్షాలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలైందని, గవర్నర్ ద్వారా త్వరలోనే నిమ్మగడ్డపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

First Published:  2 Feb 2021 9:49 PM GMT
Next Story