Telugu Global
NEWS

కొత్త చట్టం కోరుకుంటున్న నిమ్మగడ్డ..

స్థానిక ఎన్నికలకు ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకోవాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్ లైన్ లో నామినేషన్లు వేసేందుకే టీడీపీ తరపున జనాలు లేకపోవడంతో ఆ డిమాండ్ ని అటకెక్కించేశారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆన్ లైన్ నామినేష‌న్లు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై రచ్చ ముగిసిందనుకునే లోపే.. ఆన్ లైన్ నామినేషన్లంటూ మరోసారి అధికారులకు షాకిచ్చారు నిమ్మగడ్డ. తొలి దశలో నేను […]

కొత్త చట్టం కోరుకుంటున్న నిమ్మగడ్డ..
X

స్థానిక ఎన్నికలకు ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకోవాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్ లైన్ లో నామినేషన్లు వేసేందుకే టీడీపీ తరపున జనాలు లేకపోవడంతో ఆ డిమాండ్ ని అటకెక్కించేశారు. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆన్ లైన్ నామినేష‌న్లు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై రచ్చ ముగిసిందనుకునే లోపే.. ఆన్ లైన్ నామినేషన్లంటూ మరోసారి అధికారులకు షాకిచ్చారు నిమ్మగడ్డ. తొలి దశలో నేను చెప్పినట్టు ఆన్ లైన్ లో నామినేషన్లు ఎందుకు స్వీకరించలేదంటూ వివరణ అడిగారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ ను పిలిపించుకుని మరీ మాట్లాడారు. రెండో దశలో అయినా సరే నామినేషన్లు ఆన్ లైన్ లో స్వీకరించాలని ఆదేశాలిచ్చి పంపించారు.

ఎందుకీ ఆన్ లైన్..?
నేరుగా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే బెదిరింపులు ఉంటాయని, కిడ్నాప్ లు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు లాక్కుని చించేయడం.. ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి చెప్పాలంటే ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకోవడం ఒక్కటే మార్గం అని చెబుతున్నారు నిమ్మగడ్డ. ఆఫ్ లైన్ వ్యవహారంపై అంత నమ్మకం లేకపోతే.. అసలు అన్ని నామినేషన్లు ఆన్ లైన్ లోనే తీసుకుంటే సరిపోతుంది కదా? అసెంబ్లీ, లోక్ సభ
ఎన్నికలకు కూడా ఇదే తరహాలో ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకోవాలని చట్టం చేస్తే పోతుంది కదా.. అంటూ ఇటీవల వైసీపీ నేతలు విమర్శించారు కూడా. అయినా సరే ఆన్ లైన్ నామినేషన్లపై పట్టుబడుతున్నారు నిమ్మగడ్డ.

సాధ్యాసాధ్యాల మాటేమిటి..?
ఆన్ లైన్ లో నామినేషన్లు స్వీకరించాలంటే, దానికోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ రూపొందించాలి. కొత్త సాఫ్ట్ వేర్ సాయంతో అన్ని ధృవపత్రాలు పీడీఎఫ్ రూపంలో తీసుకోవాలి. వాటిని తిరిగి సిబ్బంది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ అంటే అసలా, నకిలీయా అనే విషయం వెంటనే తేలిపోతుంది. ఆన్ లైన్ లో నకిలీ ధృవపత్రాలతో నామినేషన్ వేస్తే వాటిని స్క్రూట్నీ చేయడం కాస్త కష్టసాధ్యమే. పొరపాటున తప్పుడు ధృవపత్రాలతో నామినేషన్లు అంగీకరిస్తే వాటి పర్యవసానంగా గొడవలు ముదరడం తథ్యం. మా సంతకాలు ఫోర్జరీ చేశారు, మా బదులు వేరేవాళ్లు ఆన్ లైన్ లో నామినేషన్ వేశారు అనడానికి ఆస్కారం ఎక్కువ. ఇలాంటి సమయంలో ఆన్ లైన్ పై ఆధారపడటం కంటే.. నేరుగా నామినేషన్లు స్వీకరించడమే సరైన చర్య అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వీటన్నిటినీ పక్కనపెడితే ఆన్ లైన్ వ్యవహారం కోసం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ అవసరం అని అధికారులు నిమ్మగడ్డకు స్పష్టం చేశారు. అసలే ప్రభుత్వం తనకు సహకరించడంలేదని అంటున్న నిమ్మగడ్డ, చట్టంలో సవరణ ఎలా సాధ్యమని అంచనా వేస్తున్నారో అర్థం కావడంలేదు. రెండో దశకు రెడీ కావాలంటూ ఆదేశాలిచ్చారంటే.. సాధ్యంకాని పనికోసం కావాలనే పట్టుబడుతున్నారని తేలిపోయింది.

ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
అసలు ఆన్ లైన్ వ్యవహారంతో ఎవరికి లాభం అనే విషయమే ఇప్పుడు తేలాల్సి ఉంది. పంచాయతీ తొలి దశలో అక్కడ గొడవ జరిగింది, ఇక్కడ కారు అద్దం పగిలింది అంటూ.. మీడియా హడావుడే కానీ.. ఎక్కడా దౌర్జన్యాలు జరిగాయని కేసులు నమోదు కాలేదు. మమ్మల్ని భయపెట్టారు, మా నామినేషన్ పత్రాలు చించేశారంటూ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతుందని ఇరు వర్గాలకూ తెలుసు. అందుకే అందరూ సంయమనం పాటిస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువశాతం ఏకగ్రీవాలకే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ తరపున అత్యంత తక్కువగా నామినేషన్లు పడుతున్నాయనే విషయం అర్థమవుతోంది. ఈ దశలో ఆన్ లైన్ నామినేన్లు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలాల్సి ఉంది.

First Published:  1 Feb 2021 9:33 PM GMT
Next Story