ఎవరు ఎవర్ని బెదిరించారు..? చట్టప్రకారమే అచ్చెన్నాయుడిపై కేసు..
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోటే ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు భిన్నంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అచ్చెన్నాయుడి బెదరింపులపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని, దాన్ని కక్షసాధింపు అంటే ఎలా అని ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరించడాన్ని మీడియాలో రాష్ట్ర ప్రజలందరూ చూశారని గుర్తు చేశారు. తప్పు చేసిన అచ్చెన్నాయుడిని వెనకేసుకురావడం చంద్రబాబుకి సరికాదని హితవుపలికారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక దళిత తహశీల్థార్.. […]
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతోటే ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు భిన్నంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అచ్చెన్నాయుడి బెదరింపులపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని, దాన్ని కక్షసాధింపు అంటే ఎలా అని ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరించడాన్ని మీడియాలో రాష్ట్ర ప్రజలందరూ చూశారని గుర్తు చేశారు. తప్పు చేసిన అచ్చెన్నాయుడిని వెనకేసుకురావడం చంద్రబాబుకి సరికాదని హితవుపలికారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక దళిత తహశీల్థార్.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే.. ఆమెపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. ఒకవైపు దళితుల ఓట్లకోసం కల్లబొల్లి కబుర్లు చెప్పే టీడీపీ నేతలు, మరోవైపు దళిత అధికారులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
ఆ యాప్ ఈసీదా..? టీడీపీదా..??
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్న నిఘా యాప్ తెలుగుదేశం వారు తయారు చేయించిందేనని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఒక ప్రైవేటు వ్యక్తితో ఆ యాప్ తయారు చేయించారని, దాని గురించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఈసీ యాప్ విడుదలైన తరువాత దానిని పరిశీలిస్తామని, దానిలో పొందుపరిచే వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసే అవకాశం వుందా లేదా అనేది కూడా గమనిస్తామని అన్నారు.
కడపలో వైఎస్ఆర్ గురించి చెప్పారు, చిత్తూరులో బాబు గురించి మాట్లాడతారా..?
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు జిల్లాలో పర్యటించే సందర్భంలో చంద్రబాబు గురించి కూడా మీడియాకు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉందని, ఆయన వద్ద తాను సెక్రటరీగా పనిచేశానని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజ్యాంగపదవిలో ఉన్న నిమ్మగడ్డ ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ముందు నిమ్మగడ్డ మాట్లాడితే, ఆ తర్వాత అదే అంశంపై చంద్రబాబు స్పందిస్తున్నారని, వారిద్దరి మధ్య ఉన్న లాలూచీకి అదే నిదర్శనం అని చెప్పారు.
గవర్నర్ నే బెదిరిస్తారా..?
మంత్రి బొత్స సత్యనారాయణ సహా తనను కించపరిచేలా ఎస్ఈసీ, గవర్నర్‌కు లేఖ రాశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆ లేఖలోనూ గవర్నర్‌ను సైతం బెదిరించే వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. చట్టప్రకారమే ప్రివిలేజ్ కమిటీ దానిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మహారాష్ట్రలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే.. సభ్యుల హక్కులను ప్రివిలేజ్ కమిటీ కాపాడిందని, బాధ్యుడైన ఎస్ఈసీపై చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.