Telugu Global
National

కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కలిసొచ్చిన కరోనా కాలం..

కరోనా కష్టకాలం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది, సంచలన మార్పులకీ కారణం అయింది. పదేళ్ల తర్వాత వస్తాయనుకున్న సాంకేతిక మార్పులన్నీ ముందుగానే వచ్చిపడ్డాయి. ఫేస్ టు ఫేస్ వ్యవహారాలు చాలా వరకు తగ్గిపోయాయి. వీధిబడి పిల్లలు సైతం ఆన్ లైన్ బోధనకి అలవాటు పడేలా చేసింది కరోనా కాలం. చిన్నా చితకా ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చితికిపోయాయి. విద్యార్థులనుంచి ఫీజులు వసూలు కాక, అటు టీచర్లకు జీతాలు చెల్లించలేక, అద్దెలు కట్టుకోలేక సతమతం […]

కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కలిసొచ్చిన కరోనా కాలం..
X

కరోనా కష్టకాలం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది, సంచలన మార్పులకీ కారణం అయింది. పదేళ్ల తర్వాత వస్తాయనుకున్న సాంకేతిక మార్పులన్నీ ముందుగానే వచ్చిపడ్డాయి. ఫేస్ టు ఫేస్ వ్యవహారాలు చాలా వరకు తగ్గిపోయాయి. వీధిబడి పిల్లలు సైతం ఆన్ లైన్ బోధనకి అలవాటు పడేలా చేసింది కరోనా కాలం. చిన్నా చితకా ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చితికిపోయాయి. విద్యార్థులనుంచి ఫీజులు వసూలు కాక, అటు టీచర్లకు జీతాలు చెల్లించలేక, అద్దెలు కట్టుకోలేక సతమతం అయ్యాయి. దాదాపుగా కరోనా తర్వాత పాత యాజమాన్యాలన్నీ పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కార్పొరేట్ కబంధ హస్తాలు విద్యావ్యవస్థపై మరింతగా పరుచుకుంటున్నాయి. ప్రైవేటు రంగంలో ఉన్న చిన్న చిన్న స్కూల్స్ అన్నీ కనుమరుగు కావడంతో కార్పొరేట్ వ్యవస్థ పల్లెటూళ్లకి కూడా విస్తరించేందుకు మార్గం సుగమం అయింది. ఇప్పటికే పల్లెటూళ్లలో కార్పొరేట్ అడుగులు పడినా, కరోనా తర్వాత స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్స్ పోటీనుంచి తప్పుకోవడంతో.. వాటికి ఎదురు లేకుండా పోయింది. దాదాపుగా ప్రతి ఊరిలోనూ ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ మూతపడిందని విద్యాశాఖ చెబుతున్న అధికారిక సమాచారం.

తెలంగాణలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా పరిస్థితులతో రాష్ట్రంలో వందలాది చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు మూతబడే పరిస్థితి ఒక వైపు ఉన్నా.. మరో వైపు భారీగానే కొత్త బడులను నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం విశేషం. ఆ ఔత్సాహికులు మరెవరో కాదు. కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చినవారే. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రెండు జోన్లలో దాదాపు 200కు పైగా కొత్త పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు విద్యాశాఖకు అందాయి. కరోనా తర్వాత స్కూల్స్ సంఖ్య తగ్గుతుందని, కొత్తగా పర్మిషన్ కోసం ఎవరూ రారని ప్రభుత్వం అంచనా వేస్తే.. కార్పొరేట్ రంగం నుంచి కొత్త బ్రాంచ్ ల కోసం 200 అప్లికేషన్లు రావడం విశేషం. ఇక మూతబడుతున్న పాఠశాలలను కార్పొరేట్ సంస్థలు గుంపగుత్తగా స్వాధీనం చేసుకుని లైసెన్స్ లు రెన్యువల్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ యాజమాన్యాల సంఘం దీన్ని వ్యతిరేకిస్తున్నా చేయగలిగిందేమీ లేదు, కార్పొరేట్ కి రెడ్ కార్పెట్ పరవడం మినహా నిబంధనల ప్రకారం ఎవరూ దానికి అడ్డు చెప్పలేరు.

కరోనా కాలంలోనూ ముక్కుపిండారు..
కరోనా కష్టకాలంలో ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించడానికి తల్లిదండ్రులెవరూ ఉత్సాహం చూపించలేదు. 9, 10 తరగతుల విద్యార్థుల పేరెంట్స్ కాస్త ఆందోళన పడ్డా.. చిన్న తరగతుల వారినుంచి పెద్దగా స్పందన లేదు. అదే సమయంలో కార్పొరేట్ స్కూల్స్ మాత్రం పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్ సహా.. అన్నిటికీ ముక్కుపిండి ఫీజులు వసూలు చేశాయి. ఆన్ లైన్ బోధన రుసుము దీనికి అదనం. ఇలా ప్రైవేట్ విద్యా రంగంలో.. ప్రత్యేకించి కార్పొరేట్ సెక్టార్ లో మాత్రమే కాసుల గళగళలు వినిపించాయి. స్కూల్ తెరవకపోవడంతో మెయింటెనెన్స్ ఖర్చు లేకపోయినా కూడా ఫీజులు ఏమాత్రం తగ్గించలేదు కార్పొరేట్ యాజమాన్యాలు. ఇప్పుడు కూడా పల్లెటూళ్లలో వారి ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తమ బడుల్లో విద్యా బోధన ఆగదని, ఎంట్రన్స్ పరీక్షలకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఉంటుందని ప్రచారం చేస్తూ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తమ్మీద కరోనా వల్ల విద్యారంగంలో చిన్న చిన్న కాన్వెంట్ లన్నీ మూతబడి.. ఆ స్థానంలో కార్పొరేట్ సెక్టార్ వేళ్లూనుకోబోతోంది.

First Published:  31 Jan 2021 9:06 PM GMT
Next Story