Telugu Global
National

రైతు ఉద్యమం తుది అంకానికి చేరుకున్నట్టేనా..?

సాగుచట్టాలు పూర్తిగా రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదు అంటున్నాయి రైతు సంఘాలు. పతి ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకొమ్మని సావిత్రిని యమధర్మరాజు అడిగినట్టుగా అది తప్ప ఇంకేదైనా ఇస్తామంటూ కేంద్రం మెలిక పెడుతోంది. ఓ దశలో విడదల వారీగా జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. చివరి దఫా చర్చలు సఫలం అవుతాయనుకున్న సమయంలో గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన రచ్చ తీవ్ర ప్రతిష్టంభనకు దారి తీసింది. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై ఎగిరిన […]

రైతు ఉద్యమం తుది అంకానికి చేరుకున్నట్టేనా..?
X

సాగుచట్టాలు పూర్తిగా రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదు అంటున్నాయి రైతు సంఘాలు. పతి ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకొమ్మని సావిత్రిని యమధర్మరాజు అడిగినట్టుగా అది తప్ప ఇంకేదైనా ఇస్తామంటూ కేంద్రం మెలిక పెడుతోంది. ఓ దశలో విడదల వారీగా జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. చివరి దఫా చర్చలు సఫలం అవుతాయనుకున్న సమయంలో గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన రచ్చ తీవ్ర ప్రతిష్టంభనకు దారి తీసింది. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై ఎగిరిన రైతు జండాపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఢిల్లీ అల్లర్లపై 38 కేసుల్లో 84మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. 9మంది నేతలకు నోటీసులిచ్చారు. అయితే అరెస్ట్ లతో రైతులు వెనక్కు తగ్గుతారని, గందరగోళ వాతావరణం నేపథ్యంలో ఉద్యమం ఆగిపోతుందని అంచనా వేసింది ప్రభుత్వం.

రెట్టింపు ఉత్సాహంతో..
అరెస్ట్ ల పర్వం మొదలైన తర్వాత మరింత ఉత్సాహంతో రైతు సంఘాలు కదం తొక్కాయి. సింఘు సరిహద్దుల్లో భారీగా రైతులు మోహరిస్తున్నారు. ఇప్పటి వరకూ పంజాబ్, హరియాణా రైతుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండగా, ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రైతులు కూడా కదం తొక్కడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముఖ్యంగా జాట్ లు ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతివ్వడం కూడా బీజేపీ నేతలకు మింగుడు పడటంలేదు. యూపీ రైతులు ముందుకొచ్చారంటే కచ్చితంగా అది బీజేపీకి తీరని నష్టమే. ఇంకా మొండి వైఖరి వీడకపోతే.. రాబోయే ఎన్నికల్లో యూపీలో బీజేపీకి గడ్డుకాలమేనని చెప్పాలి.

ఇరకాటంలో ప్రభుత్వం
ఓవైపు పోలీసు బలగాలను మోహరించి, మరోవైపు ఇంటర్నెట్ ని ఆపేసి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోంది బీజేపీ ప్రభుత్వం. అదే సమయంలో ఏదైనా తేడా వస్తే దేశవ్యాప్తంగా పరువు పోతుందని, వ్యతిరేకత పెరుగుతుందనే భయం కూడా ఉంది. దీంతో కక్కలేక, మింగలేక అన్నట్టుంది సర్కారు పరిస్థితి. రైతు చట్టాలను రద్దుచేసేది లేదు అని ఖరాఖండిగా చెప్పే ధైర్యం లేదు, చట్టాలను రద్దు చేసి రైతుల్ని ఊరడించేంత పెద్ద మనసు కూడా కేంద్ర నాయకులకు లేదు. ఇప్పటి వరకూ మొండిగా, మూర్ఖంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ వచ్చిన అధినాయకత్వానికి ఇది నిజంగా అగ్నిపరీక్షే. ప్రతిపక్షాలు కూడా ఆచితూచి స్పందిస్తున్న నేపథ్యంలో తప్పంతా వైరిపక్షాలపైకి నెట్టేసే మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ వర్కవుట్ కావడంలేదు.

మెత్తబడ్డ మోదీ.. ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తా..!
ఇప్పటి వరకూ ముగ్గురు మంత్రులపై భారం పెట్టి తమాషా చూసిన ప్రధాని మోదీ.. ఇప్పుడు నేరుగా నష్ట నివారణ చర్యలకు సిద్ధమయ్యారు. ఏడాదినుంచి, ఏడాదిన్నరపాటు రైతు చట్టాలను వాయిదా వేస్తామంటూ గతంలో ఓ మెట్టు వెనక్కి తగ్గినా ఫలితం లేకపోవడంతో.. ఇప్పుడు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానంటూ రైతు సంఘాలకు సందేశం పంపుతున్నారు మోదీ. ఫోన్ చేసి మాట్లాడితే పరిష్కారమయ్యే సమస్యను ఇంత పెద్దదిగా చేస్తారెందుకంటున్నారు. ఈ ఫోన్ కాల్ సందేశానికి రైతు సంఘాలు కూడా ధీటుగానే బదులిచ్చాయి. చర్చలకు సిద్ధమే, కానీ చట్టాలను పక్కనపెట్టాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
మొత్తమ్మీద రైతులంతా పెద్ద సంఖ్యలో ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్న వేళ.. ఉద్యమం తుది అంకానికి చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర వరకు వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, శాశ్వతంగా వెనక్కు తగ్గడమే ఏకైక ప్రత్యామ్నాయం. మరి కేంద్రం ఆ మాట ఎంత త్వరగా చెబుతుదనేదే ఇప్పుడు ప్రశ్న.

First Published:  30 Jan 2021 11:25 PM GMT
Next Story