Telugu Global
NEWS

అన్నయ్యే వస్తారా..? తమ్ముడు ఆహ్వానిస్తారా..??

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. కాపు సభలో.. కులసంఘ నాయకులను ఊరడించడానికి ఆయన చిరంజీవి ప్రస్తావన తెచ్చారో లేక, నిజంగానే మెగాస్టార్ నుంచి బలమైన సంకేతాలు ఉన్నాయో తెలియదు కానీ చిరు రీఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేమని పవన్ మాట దాటేశారు. నాదెండ్ల మనోహర్ తెరపైకి తెచ్చిన చిరు రీఎంట్రీ విషయాన్ని పవన్ సమర్థించలేదు, అలాగని వ్యతిరేకించలేదు. అభిమానుల్ని మాత్రం మరింత ఉత్కంఠలోకి నెట్టేశారు. పవన్ […]

అన్నయ్యే వస్తారా..? తమ్ముడు ఆహ్వానిస్తారా..??
X

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. కాపు సభలో.. కులసంఘ నాయకులను ఊరడించడానికి ఆయన చిరంజీవి ప్రస్తావన తెచ్చారో లేక, నిజంగానే మెగాస్టార్ నుంచి బలమైన సంకేతాలు ఉన్నాయో తెలియదు కానీ చిరు రీఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేమని పవన్ మాట దాటేశారు. నాదెండ్ల మనోహర్ తెరపైకి తెచ్చిన చిరు రీఎంట్రీ విషయాన్ని పవన్ సమర్థించలేదు, అలాగని వ్యతిరేకించలేదు. అభిమానుల్ని మాత్రం మరింత ఉత్కంఠలోకి నెట్టేశారు.

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?
‘ చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేను. అది ఆయన అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. చిరంజీవి రాజకీయ అభిప్రాయాల్ని గౌరవిస్తాను. ఒక తమ్ముడిగా నేను విజయం సాధించాలనే ఆయన కోరుకుంటారు’ అని ముక్తాయించారు.

ప్రజారాజ్యం విలీనం, కాంగ్రెస్ లో మంత్రి పదవి, ఆ తర్వాత కొన్నాళ్లు రాజ్య సభ సభ్యత్వం.. ఇలా సాగింది చిరంజీవి ప్రస్థానం. రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలను పట్టించుకోవడం మానేశారు. కనీసం కాంగ్రెస్ లో తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించుకోకుండా దాటవేశారు, ఏ పార్టీకి సంబంధంలేని వ్యక్తిగా మిగిలిపోయారు. 2019లో స్వయానా తమ్ముడు పోటీ చేసినా కూడా చిరంజీవి ప్రచారానికి రాలేదు, అభిమానులకు సందేశం కూడా ఇవ్వలేదు. రాజకీయాలపై పూర్తి వైరాగ్యంతో ఉన్న చిరంజీవి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తారంటే నమ్మడం కష్టమే. కానీ పవన్ కల్యాణ్ మాటల్ని బట్టి చూస్తే మాత్రం చిరులో ఇంకా ఎక్కడో రాజకీయాలపై ఆశ సజీవంగానే ఉన్నట్టు అర్థమవుతోంది. అన్నయ్యకు రాజకీయాలు పూర్తిగా ఇష్టంలేకపోతే.. పవన్ కల్యాణే ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టేవారు. ఏదో ఓ మూల అన్నయ్యని కూడా పార్టీలో భాగస్వామిని చేయాలనే కోరిక ఉంది కాబట్టే ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇప్పుడే కాదు అని దాటవేశారు. ఇలా అన్నదమ్ములిద్దరికీ పొలిటికల్ మల్టీస్టారర్ చేయాలని ఉంది కాబట్టే చూచాయగా ఈ విషయాలపై లీకులిస్తున్నారని తెలుస్తోంది.

2024నాటికి కాపులంతా ఏకమవుతారా..?
రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలపై కులం ముద్రలు బలంగా పడిపోయిన తర్వాత.. మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న కాపుల్ని ఏకం చేసేందుకు అటు బీజేపీ, జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇద్దరి అజెండా ఒకటే కాబట్టి ముందుగా రెండు పార్టీలు కలసిపోయి కలసికట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముద్రగడతో వీర్రాజు భేటీకూడా ఈ ప్రణాళికలో భాగంగా జరిగిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ ని కాపుసంఘాల నాయకులు కలవడం, చిరంజీవి పేరుని ప్రస్తావనకు తీసుకు రావడం.. అంతా ఓ వ్యూహం ప్రకారమే జరుగుతోందనే విషయం తెలుస్తోంది. మొత్తమ్మీద వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాపులను ఏకం చేయడానికి రెండు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అన్నయ్య ఆధ్వర్యంలో, తమ్ముడి నేతృత్వంలో కాపుసేన ఏమేరకు సఫలమవుతుందో చూడాలి.

First Published:  29 Jan 2021 9:05 PM GMT
Next Story