Telugu Global
NEWS

ఇది నిమ్మగడ్డ రాజ్యాంగం.. గీత దాటారో వేటు తప్పదు..

సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య ఉన్న ఆధిపత్యపోరు ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో అధికారం మొత్తం తన చేతిలోకే వచ్చేసిందని భావిస్తున్న ఎస్ఈసీ, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై సైతం అభిశంసన ఉత్తర్వులివ్వడం సంచలనంగా మారింది. చివరకు చీఫ్ సెక్రటరీ జోక్యంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. గతంలో తానిచ్చిన […]

ఇది నిమ్మగడ్డ రాజ్యాంగం.. గీత దాటారో వేటు తప్పదు..
X

సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య ఉన్న ఆధిపత్యపోరు ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో అధికారం మొత్తం తన చేతిలోకే వచ్చేసిందని భావిస్తున్న ఎస్ఈసీ, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై సైతం అభిశంసన ఉత్తర్వులివ్వడం సంచలనంగా మారింది. చివరకు చీఫ్ సెక్రటరీ జోక్యంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. గతంలో తానిచ్చిన బదిలీ ఆర్డర్లను పట్టుబట్టి మరీ అమలులోకి తెప్పించుకున్న నిమ్మగడ్డ. రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయించారు. అంతటితో ఈ వ్యవహారం అయిపోయిందనుకుంటే పొరపాటే. అధికారులపై నిమ్మగడ్డ పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

పంచాయతీల ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్ ‌ను వివరణ కోరారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆయనపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే ఉంటుందని.. ప్రకటనలు ఇచ్చే ముందు విధిగా తనను సంప్రదించాలని, అలా చేయనందుకు ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రవీణ్ ప్రకాశ్ పై వేటు..
తాజాగా నిమ్మగడ్డ కు మరో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ టార్గెట్ అయ్యారు. గతంలో తాను సమీక్షలకు పిలిచినా అధికారులు రాలేదని, దానికి కారణం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశేనంటూ ఆయనపై ఆరోపణలు చేశారు నిమ్మగడ్డ. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ సీఎస్ ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలివ్వాలన్నారు. ఈనెల 25న నామినేషన్ల స్వీకరణకు ప్రవీణ ప్రకాశ్ సహకరించలేదని ఆయన వల్లే ఎన్నికల షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చిందనేది నిమ్మగడ్డ ఆరోపణ.
అయితే తాను నిబంధనల ప్రకారమే పనిచేశానని ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు. ఎస్‌ఈసీ నుంచి తనకు మెయిల్‌ ద్వారా వచ్చిన లేఖపై తాను వెంటనే స్పందించానని, జీఏడీ ముఖ్య కార్యదర్శి కార్యాలయం స్వతంత్రమైనది కాదని, జీఏడీకి సీఎస్‌ అధిపతి అని, తాను ఆయనకే రిపోర్టు చేస్తాననే విషయాన్ని నిమ్మగడ్డ తెలుసుకోవాలన్నారు. జీఏడీ కార్యదర్శి కేవలం సీఎస్ కు సపోర్టింగ్ అధికారి మాత్రమేనని, కాబట్టి తాను స్పందించలేదు అనడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. అధికారులు సమీక్షకు రాకపోవడానికి కారణం తాను కాదని వివరణ ఇచ్చారు.

ఇక్కడితో ఆగేనా..?
ఓవైపు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా ఇంకా పాత విషయాలను బయటకు తీస్తూ.. అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆయన వ్యవహార శైలితో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు విసిగిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేసినా తిప్పలు తప్పడంలేదని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఎంతమంది అధికారులపై నిమ్మగడ్డ వేటు వేస్తారో వేచి చూడాలి.

First Published:  29 Jan 2021 9:19 PM GMT
Next Story