Telugu Global
NEWS

జానారెడ్డికి సీనియర్ల సహకారం ఉంటుందా..?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల విషయంలో అభ్యర్థిని ఖరారు చేయడం దగ్గర్నుంచి హడావిడి చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక, గ్రేటర్ చేదు ఫలితాల తర్వాత తెలంగాణలో పడిపోతున్న పార్టీ పరువుని నిలబెట్టుకోవాలంటే సాగర్ లో సత్తా చూపాలనేది ఆపార్టీ ఆశయం. అందుకు తగ్గట్టే సీనియర్ నేత జానారెడ్డిని ఒప్పించి మరీ బరిలో నిలపెట్టింది అధిష్టానం. కేవలం ఉప ఎన్నిక కోసమే పీసీసీ అధ్యక్ష నిర్ణయాన్ని కూడా వాయిదా వేసింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో […]

జానారెడ్డికి సీనియర్ల సహకారం ఉంటుందా..?
X

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల విషయంలో అభ్యర్థిని ఖరారు చేయడం దగ్గర్నుంచి హడావిడి చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక, గ్రేటర్ చేదు ఫలితాల తర్వాత తెలంగాణలో పడిపోతున్న పార్టీ పరువుని నిలబెట్టుకోవాలంటే సాగర్ లో సత్తా చూపాలనేది ఆపార్టీ ఆశయం. అందుకు తగ్గట్టే సీనియర్ నేత జానారెడ్డిని ఒప్పించి మరీ బరిలో నిలపెట్టింది అధిష్టానం. కేవలం ఉప ఎన్నిక కోసమే పీసీసీ అధ్యక్ష నిర్ణయాన్ని కూడా వాయిదా వేసింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఓ మూల చిన్న అనుమానం. సీనియర్లు జానారెడ్డికి అండగా ఉంటారా, ప్రచార పర్వంలో కలిసొస్తారా, అసలు జానాకి పార్టీ సహకారం ఎంత అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా జానారెడ్డికి సొంత కేడర్ ఉంది. అందువల్లే ఆయన అక్కడ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కేవలం 4 శాతం ఓట్ల మార్జిన్ తో ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆ 4శాతం ఓట్లు కవర్ చేసి విజయ పతాక ఎగరేయాలనేది ఆయన ఆలోచన. ఓ దశలో బీజేపీ గాలానికి కూడా చిక్కకుండా జానారెడ్డి జాగ్రత్త పడటానకి కారణం కూడా గెలుపుపై ఆయనకున్న ధీమానే.

దుబ్బాక-సాగర్ పోలిక ఉందా..?
2018 ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది, 2020 ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. కారణం ఏంటి? బీజేపీ దెబ్బ కేవలం టీఆర్ఎస్ పైనే కాదు, కాంగ్రెస్ పై కూడా పడిందనేది వాస్తవం. అయితే ఆ ఓటమిని కాంగ్రెస్ లైట్ తీసుకుంది. కేవలం 3శాతం మాత్రమే తమ ఓటుబ్యాంకులో కోతపడిందని సర్దిచెప్పుకుంటున్నారు నేతలు. ప్రచారం కూడా అంతంతమాత్రంగానే సాగడంతో ఎన్నికకు ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నట్టయింది. దీంతో కాంగ్రెస్ కి వేసే ఓటు వృథా అని భావించినవారంతా బీజేపీవైపు మొగ్గు చూపారు.

సాగర్ లో పరిస్థితి ఏంటి..?
సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి వంటి బలమైన నేత ఉన్నారు. అటు పీసీసీ పదవినీ కోరుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లా అది, ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఉన్నారు. వీరంతా జానా తరపున అలుపెరగని ప్రచారం చేస్తారనే ఆశ ఉంది. మరోవైపు తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కి కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఆయన హయాంలో ఇప్పటికే పార్టీ రెండుసార్లు పరాభవ భారాన్ని మూటగట్టుకుంది. ఈసారైనా తన మార్కు చూపించాలని మాణిక్యం ఆలోచిస్తున్నారు. గతంలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలకోసం అధిష్టానం ఎలాగు కదలి రాలేదు. బీజేపీ నుంచి మాత్రం కేంద్ర పెద్దలంతా తరలి వచ్చారు. ఈ సారి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ కూడా కీలక నేతల్ని రంగంలోకి దింపాలని చూస్తోంది. మొత్తమ్మీద ప్రచార పర్వంలోనే కాంగ్రెస్ కాస్త తేడా చూపాల్సిన అవసరం ఉంది, కార్యకర్తల్లో స్థైర్యం నింపాల్సిన సమయం వచ్చింది. పీసీసీ చీఫ్ ఎన్నికల సందర్భంగా బైటపడిన విభేదాలు పక్కనపెట్టి సీనియర్లంతా కలసి కట్టుగా కృషిచేస్తేనే సాగర్ లో కాంగ్రెస్ కి విజయం దక్కుతుంది.

First Published:  16 Jan 2021 11:06 PM GMT
Next Story