Telugu Global
NEWS

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? సంజయ్​ మాటల వెనక మర్మమేంటి?

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో జోష్​ వచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ కూడా జోరు మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట పర్యటిస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆయన ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న వరంగల్​, ఖమ్మంపై దృష్టి సారించారు. ఇప్పటికే వరంగల్​లో టీఆర్​ఎస్​ నేతలు భారీ అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమనుకుంటే వరంగల్​ భద్రకాళి టెంపుల్​లో ప్రమాణం చేయాలని సవాలు […]

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? సంజయ్​ మాటల వెనక మర్మమేంటి?
X

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో జోష్​ వచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ కూడా జోరు మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట పర్యటిస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆయన ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న వరంగల్​, ఖమ్మంపై దృష్టి సారించారు. ఇప్పటికే వరంగల్​లో టీఆర్​ఎస్​ నేతలు భారీ అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమనుకుంటే వరంగల్​ భద్రకాళి టెంపుల్​లో ప్రమాణం చేయాలని సవాలు విసిరారు.

అయితే బండి సంజయ్​ రాష్ట్రంలోని ఆలయాలను రాజకీయం కోసం వాడుకుంటున్నారని టీఆర్ఎస్​ నేతలు ఆరోపించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకొని.. ఇప్పుడేమో భద్రకాళి టెంపుల్ మీద పడ్డారని విమర్శించారు. మరోవైపు టీఆర్​ఎస్​ నేతలు గువ్వల బాలరాజ్​, బాల్క సుమన్​ సంజయ్​పై ఎదురుదాడికి దిగారు.

ఇదిలా ఉంటే బండి సంజయ్​ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయన ఏమన్నారంటే.. ‘కేటీఆర్​ ను సీఎం చేయాలని సీఎం కేసీఆర్​ భావిస్తున్నారు. అయితే ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. అది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ అందుకోసం సీఎం కేసీఆర్​ అనారోగ్యాన్ని కారణంగా చూపడమే ఆశ్చర్యంగా ఉంది. టీఆర్​ఎస్​లోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పట్టుబడుతున్నారు. వాళ్లు పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్ననేతలు.

గతంలో వారికి మంత్రి పదవులు ఇస్తామని పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చి ఇప్పుడేమే మంత్రి పదవులు ఇవ్వడం లేదు. దీంతో వాళ్లు వేరే పార్టీ పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. సీఎంవో కూడా అవినీతి మయంగా మారింది. ఏ పని కావాలన్న లంచం డిమాండ్​ చేస్తున్నారు. కేసీఆర్​ యూటర్న్​ సీఎంగా మిగిలిపోతారు’ అని ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై టీఆర్​ఎస్​నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

First Published:  10 Jan 2021 8:48 AM GMT
Next Story