Telugu Global
NEWS

'షీ క్యాబ్స్' వచ్చేశాయి

మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పదే పదే వింటూ ఉంటాం. కానీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి. మహిళలు కొన్ని పనులు మాత్రమే చేయగలరనే భావన సమాజంలో బలంగా వేళ్లూనుకుంది. వ్యవసాయం, గ్రామీణ వృత్తుల్లో పురుషులతో సమానంగా పనిచేసిన మహిళలకు నగరాల్లో సమాన అవకాశాలు ఇవ్వడానికి వెనకాడుతుంటారు. మహిళలు ఆర్థిక సమానత్వం సాధించాలంటే నిజంగానే అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. కేవలం చదువుకున్న వారికే కాదు… శ్రమను నమ్ముకున్న […]

షీ క్యాబ్స్ వచ్చేశాయి
X

మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పదే పదే వింటూ ఉంటాం. కానీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి. మహిళలు కొన్ని పనులు మాత్రమే చేయగలరనే భావన సమాజంలో బలంగా వేళ్లూనుకుంది. వ్యవసాయం, గ్రామీణ వృత్తుల్లో పురుషులతో సమానంగా పనిచేసిన మహిళలకు నగరాల్లో సమాన అవకాశాలు ఇవ్వడానికి వెనకాడుతుంటారు. మహిళలు ఆర్థిక సమానత్వం సాధించాలంటే నిజంగానే అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. కేవలం చదువుకున్న వారికే కాదు… శ్రమను నమ్ముకున్న వారికి అవకాశాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే మహిళల శక్తి బహిర్గతమవుతుంది. ఇప్పుడు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సంగారెడ్డి ఎస్సీ కార్పోరేషన్.

ప్రజా రవాణ వ్యవస్థలో మహిళలకు అవకాశం కల్పించేందుకు ఎస్సీ కార్పోరేషన్ ముదుకు వచ్చింది. వాహనాలు నడపడం కేవలం పురుషులకే సాధ్యమవుతుందనే భావనను త్రోసిపుచ్చి షీ క్యాబ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చి క్యాబ్ నడిపించుకునే అవకాశం కల్పిస్తోంది. తొలి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్న 18మందికి 8లక్షల విలువైన కార్లను సబ్సిడీపై అందించింది సంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పోరేషన్. 18-45 ఏండ్ల వయసున్న మహిళలను ఈ ప‌థ‌కానికి ఎంపిక చేశారు.

‘షీ క్యాబ్స్’ పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా అత్యాధునిక కార్లను అందజేస్తుండడం గమనార్హం. జీపీఎస్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా కార్లలో అందుబాటులో ఉంచారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఊహించని ప్రమాదం ఎదురైతే వారి నుంచి తప్పించుకునేందుకు పెప్పర్ స్ప్రేను కూడా కార్లలో ఉంచనున్నారు. సంగారెడ్డి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశలో అధికారులు ఆలోచిస్తున్నారు.

షీ క్యాబ్స్‌ వాహనాలను ‘ఉబెర్‌’కు అనుసంధానం చేసి స్థానిక పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల ప్రయాణానికి వీటిని వినియోగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజికంగా వెనకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక భరోసా అందించేందుకు రూపొందించిన ఈ పథకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. షీ క్యాబ్స్ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు, తమపై తమకు విశ్వాసం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కొన్ని కొందరు మాత్రమే చేయగలరనే తప్పుడు అభిప్రాయాలను తుత్తునియలు చేస్తూ రాష్ట్రంలో ‘షీ క్యాబ్స్’ ప్రారంభమైంది.

First Published:  5 Jan 2021 4:09 AM GMT
Next Story