Telugu Global
National

భారత్ ని చుట్టుముడుతున్న బర్డ్ ఫ్లూ.. నాలుగు రాష్ట్రాలకు పాకిన వైరస్..

రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు పాకింది. రాజస్థాన్ సహా మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు బైటపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ లో చనిపోయిన బార్ హెడెడ్ గూస్ అనే వలస పక్షుల మరణానికి కూడా బర్డ్ ఫ్లూ వ్యాధే కారణం అని తేలడంతో అధికారులు షాకయ్యారు. ఈ పక్షులన్నీ మధ్య ఆసియా ప్రాంతాలు, సైబీరీయా, రష్యానుంచి ప్రతి ఏటా ఇదే సీజన్ లో భారత్ కు […]

భారత్ ని చుట్టుముడుతున్న బర్డ్ ఫ్లూ..  నాలుగు రాష్ట్రాలకు పాకిన వైరస్..
X

రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు పాకింది. రాజస్థాన్ సహా మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు బైటపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ లో చనిపోయిన బార్ హెడెడ్ గూస్ అనే వలస పక్షుల మరణానికి కూడా బర్డ్ ఫ్లూ వ్యాధే కారణం అని తేలడంతో అధికారులు షాకయ్యారు. ఈ పక్షులన్నీ మధ్య ఆసియా ప్రాంతాలు, సైబీరీయా, రష్యానుంచి ప్రతి ఏటా ఇదే సీజన్ లో భారత్ కు వలస వస్తుంటాయి. ఇవే పక్షులు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని పులికాట్ సరస్సుకి కూడా వలస వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇక బర్డ్ ఫ్లూ బైటపడిన రాజస్థాన్ లో సోమవారం ఒక్కరోజే మరో 170 పక్షులు మృతి చెందినట్టు అంచనా. కాకులు మృతి చెందిన ఝలావర్‌, బరన్‌, కోటా, పాలి, జోధ్‌పూర్‌, జైపూర్‌ తదితర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. మధ్యప్రదేశ్ ‌లో కూడా బర్డ్ ఫ్లూతో కాకులు మరణించడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇండోర్‌, మాంద్‌ సౌర్‌, అగర్‌-మాల్వ, ఖార్గావ్‌, సెహోర్‌ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

కేరళలో 40వేలకు పైగా కోళ్లు, బాతుల్ని చంపేందుకు నిర్ణయం..
కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూని గుర్తించారు. ఇటీవల ఈ రెండు జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. రాజస్థాన్ లో బర్డ్ ఫ్లూ వార్తలతో అప్రమత్తమైన కేరళ అధికారులు వాటి నమూనాలను భోపాల్‌ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్ కు పంపించారు. ఇందులో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయా ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలోని ఉన్న కోళ్ల ఫారాలు, బాతుల పెంపకం ప్రదేశాల్లో ఉన్న 40 వేలకు పైగా పక్షులను చంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఈ వైరస్‌ సోకే ప్రమాదమున్న నేపథ్యంలో కొట్టాయం, అలప్పుజ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

మనుషులకు సోకే ప్రమాదం ఉందా..?
బర్డ్ ఫ్లూ, మ్యాడ్ కౌ.. అనేవి పక్షులు, జంతువుల్లో వేగంగా వ్యాపించే వ్యాధులైనా.. ఆ వ్యాధిబారిన పడినవాటిని తినడం వల్ల మానవులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి భారత్ లో ఎక్కడా మనుషుల్లో బర్డ్ ప్లూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించలేదు. అయితే కరోనా విస్తృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

First Published:  4 Jan 2021 8:41 PM GMT
Next Story