Telugu Global
Arts & Literature

అరకులో కవి సూర్యుడు

కవులకేం తెలుసు కవిత్వం రాయడం తప్ప, అని మా ఆవిడ మేడం నామీద చాలా సార్లు సెటైర్లు వేస్తుంది. ఏ పుచ్చొంకాయలో ఏ ముదురు బెండకాయలో సొరకాయలో తెచ్చినప్పుడు ఎక్కువగా ఇలాంటి దండయాత్రలు నా మీద సాగుతాయి. నీకేం తెలుసోయ్, కవులే గాని అధికారంలోకి వస్తే మొత్తం ప్రపంచమే మారిపోదా అని నేనేదో సరదా పట్టిస్తాను. ఆమె పట్టించుకోదనుకోండి.

అరకులో కవి సూర్యుడు
X

కవులకేం తెలుసు కవిత్వం రాయడం తప్ప, అని మా ఆవిడ మేడం నామీద చాలా సార్లు సెటైర్లు వేస్తుంది. ఏ పుచ్చొంకాయలో ఏ ముదురు బెండకాయలో సొరకాయలో తెచ్చినప్పుడు ఎక్కువగా ఇలాంటి దండయాత్రలు నా మీద సాగుతాయి. నీకేం తెలుసోయ్, కవులే గాని అధికారంలోకి వస్తే మొత్తం ప్రపంచమే మారిపోదా అని నేనేదో సరదా పట్టిస్తాను. ఆమె పట్టించుకోదనుకోండి. కవిత్వం తప్ప నాకేం తెలియదని తన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎవరైనా గొప్ప కవులు గొప్ప గొప్ప పనులు చేస్తే వారి గురించి చెప్తాను. అలాగా..అవునా..ఓహో అని మెచ్చుకోలుగా చూస్తుంది. నువ్వు కాదుగా అని అందులో ఏదో మతలబు ధ్వనిస్తుంది నాకు. సరే ఈ ప్రహసనానికేం గాని, ఇవాళ నేను ఓ కవి గురించి చెప్పిన విషయాన్ని విని నా సహచరి నన్ను కూడా మెచ్చుకుంది. కారణం ఏమంటే కనీసం అలాంటి మిత్రులైనా నాకున్నారని అన్న మాట. కవిత్వం తప్ప ఇతరత్రా ఘనకార్యాలు చేసిన ఆ కవి ఎవరబ్బా అంటారా? అయితే ఇనుకోండి.

ఆకెళ్ళ రవిప్రకాష్ నాకు చాలా ఆత్మీయుడు. అతి కొద్ది కాలంలోనే అత్యంత దగ్గరయ్యాం. ఇటీవల ఆయన పంపిన మూడు పుస్తకాలు అందుకుని నెలలు గడిచింది. చదివి ఏమైనా రాయాలని అనుకుంటూ కూడా నెలలు గడిచింది. కొత్త ఇంటికి మారినప్పుడు వందలాది పుస్తకాలు మిత్రుడు కస్తూరి మురళీకృష్ణ ద్వారా లైబ్రరీలకు ఇచ్చేశాను. కొత్త ఇంట్లో పుస్తకాలు కుదురుగా సర్దుకుంటూ వుంటే ఈ మూడు పుస్తకాలూ కనిపించాయి. రవి రాసిన అరకు అనుభవాలు చదివినప్పుడు కవిగా ఆయన మీద నాకున్న అభిమానం,ప్రేమ అలా వుంచితే, ఆయనలోని ఉన్నతాధికారికి శిరసు వొంచి వందనం చేయాలనిపించింది.

ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం గుజరాత్ లో పాల విప్లవానికి కారకుడైన వర్గీస్ కురియన్ గురించి చదివినప్పుడు అనుకున్నాను. నిజాయితీ, పట్టుదల, ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉంటే ఒక అధికారి ఎంతో చేయగలడు కదా. ఇలాంటి అధికారులు ప్రతి రాష్ట్రానికి నలుగురైదుగురు ఉన్నా చాలు కదా అనుకునే వాడిని. రవిప్రకాష్ రాసిన అరకు అనుభవాలు చూశాక రవిలో కురియన్ కనిపించాడు. రవి, కవి కదా ఆయన అరకు అనుభవాలంటే పుస్తకం నిండా అరకు అందాల ఆరబోత కవిత్వమై పరచుకుంటుందని అనుకున్నాను. అరకు గిరిజన కార్పొరేషన్ ఎం.డి.గా తాను ఏం చేశాడో అది రాశాడు. గిరిజనుల వ్యవసాయానికి తగిన సదుపాయాలు కల్పించి, వారి ఉత్పత్తుల మార్కెటింగ్ లో అడ్డంకులను తొలగించి ఆదివాసీల శ్రమకు తగిన ఫలితాన్ని అందించడంలో రవిప్రకాష్ చేసిన కృషి ముందు తరాల అధికారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తన కంటె ముందు అక్కడ పనిచేసిన అధికారులు ఒకడుగు ముందుకేస్తే, రవి పదడుగులు ముందుకేశాడు. పదిహేను రకాల అటవీ ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ సంపాదించడం జి.సి.సి. కి ఒక పెద్ద మైలు రాయి అని గర్వంగా చెప్తూ, అమూల్ దారిలో జి.సి.సి. ప్రయాణం మొదలయిందని మటుకు చెప్పగలను అని తృప్తిగా ప్రకటించాడు. ఒక ఉన్నతాధికారి ప్రస్థానంలో ఇటువంటి తృప్తికరమైన అనుభవాలే గొప్ప మైలు రాళ్ళుగా నిలుస్తాయి.

అరకు కాఫీ కథలో రవిప్రకాష్ ఎంట్రీనే పెద్ద మలుపు అని చెప్పొచ్చు. నిస్వార్థంగా నిజాయితీగా మన పని మనం చేసుకుపోతే చాలనుకునే వారే ఎక్కువ. అది చాలదు. అడుగడుగునా దళారీలు ఎదరయ్యే వ్యవస్థలో అధికారులు కొన్ని సాహసాలు చేయాలి. అనేక అవరోధాలు వస్తాయి. నిబ్బరంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అదే సమయంలో మన ఉద్యోగం, మన జీవితం ప్రమాదంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాదు, మనం ఎవరికి మేలు తలపెట్టామో వారే మన నిజయితీని శంకించే సందర్భాలూ వస్తాయి. ఎంత కత్తి మీద సాము ఇది. అయినా రవి తన ఉద్యోగ ధర్మంగానే కాదు, తన హృదయ ధర్మంగా చాలా చేశాడు. అత్యధిక టన్నుల కాఫీని సేకరించి, పారదర్శకమైన, శాస్త్రీయ పద్ధతుల్లో వేలం వేసి, దళారీల చేతుల్లోంచి గిరిజనులకు విముక్తిని ప్రసాదించడంలో చాలా సాహసోపేతమైన చర్యలే తీసుకున్నాడు. అందుకే మొదట్లో అనుమానించిన గిరిజనులు చివరికి తమ సొంత బిడ్డలా రవిని దగ్గరకు తీసుకున్నారు. తను ఒక చోట ఇలా రాశాడు:

" కాఫీ సీజనులో నాకు అసలు విశ్రాంతి ఉండేది కాదు.అర్థరాత్రి దాటాకా న్యూయార్క్ ఎక్స్ ఛేంజీ ధరలు తెలిసేవి. ఉదయాన్నే నాలుగు గంటలకి NeML Website లో అవి నమోదు చేయాలి. అది చెయ్యకపోతే ఆరోజు కాఫీ పాటలు జరగవు. రోజూ రాత్రి రెండు గంటల నిద్ర కూడా ఉండేది కాదు. అయినా మనసులో ఆనందంగా వుండేది. ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక గొప్ప ప్రయత్నం చేయడం, గిరిజనులకు మంచి జరగడంలో భాగం కావడం అదృష్టంగా భావించే వాడిని."

మరి గిరిజనులు హృదయాలకు హత్తుకున్నారంటే ఆశ్చర్యం ఏముంది? ఆదివాసీలు అమాయకులే గాని, పట్టణవాసులను అంత సునాయాసంగా వారు నమ్మరు. వారి గుండెల్లో నీటి అడుగున రాళ్ళ మీద మనల్ని సానబెట్టి మరీ చూసుకుంటారు. అలా వారి పరీక్షలో నెగ్గిన వారిని గుండెల మీదే పెట్టుకుంటారు. వారి పరీక్షలోనూ తనకు తానే పెట్టుకున్న పరీక్షలోనూ రవి సఫలీకృతుడయ్యాడు. అందుకే ఆయన అరకు అనుభవాల అక్షరాలు ఇంత గొప్పగా వెలుగుతున్నాయి. తనతో పాటు జి.సి.సీలో రాత్రింబవళ్ళు పనిచేసిన సిబ్బందికందరికీ ఈ విజయంలో క్రెడిట్ ని ఇవ్వడం అతని నిజాయితీకి మరో మచ్చు తునకగా చెప్పాలి. వర్గీస్ కురియన్ రాసిన I too had a dream అనే పుస్తకాన్ని చాలా మంది చదివే ఉంటారు. తానూ చదవడమే కాదు, ఆదివాసీ రైతులకు మేలు చేయాలని రవి నడుం కట్టడమే విశేషం. కురియన్ వల్ల లక్ష మంది పాల ఉత్పత్తిదారులు లబ్ధి పొందితే, రవిప్రకాష్ వల్ల లక్ష మంది గిరిజనులు లాభం పొందారు. అది మరెందరో అధికారులకు ప్రేరణగా నిలుస్తుంది. మరికొన్ని లక్షల మంది గిరిజనులు ముందు కాలంలో మరింత లబ్ధి పొందుతారు. చింత నుంచి తేనె దాకా, కరక్కాయ నుంచి తేనె దాకా అరకు గిజరిజనుడు పడిన శ్రమకు పైసా ఖర్చు లేని ప్రచారంతో ప్రపంచంలో విలువ తెచ్చిన రవి కృషి ఎనలేనిది.

నిజాయితీకి నిబద్ధతకు అపజయం లేనే లేదు. ఉద్యోగ ధర్మమే కాదు, హృదయ ధర్మం కూడా ఒకటి వుంటుంది దాన్ని వినాలి. పట్టుదల సడలకుండా ప్రయాణం సాగించాలి. ఈ పుస్తకాన్ని చదివాక రవిప్రకాష్ అంటే నాకున్న ప్రేమ, గౌరవం వంద రెట్లు పెరిగాయి. మీరూ చదవండి. నా స్నేహితుడు రాసిన పుస్తకం అని చదవడం మొదలు పెట్టిన నాకు, నాకు తెలియని ఒక నిఖార్సయిన ఉన్నతాధికారిని ఈ పుస్తకంలో చూసి ఆశ్చర్యపోయాను. ఇందులో చాలా విషయాలు చాలా సింపుల్ గా తేల్చేసినట్టు అనిపించింది. వీటినే ఎన్నో కథలుగా గొప్ప నవలగా రవి భవిష్యత్తులో రాస్తాడని ఆశిస్తున్నాను. గొప్ప కవే కాదు, గొప్ప ఐ.ఏ.యస్.అధికారి కూడా నా మిత్రుడు రవిప్రకాష్ అనుకుంటే నాకు భలే గర్వంగా వుంది. అరకు గిరిజన బతుకు లోయల్లో నాలుగేళ్ళ పాటు వెలుగులు కురిపించిన రవిప్రకాశం అతను.

ప్రసాదమూర్తి

First Published:  3 Jan 2021 11:11 PM GMT
Next Story