Telugu Global
International

కొవిషీల్డ్, కొవాక్సిన్.. రెండిటికీ లైన్ క్లియర్..

భారత్ లో కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాల అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన గంటల వ్యవధిలోనే రెండింటికీ ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులిచ్చింది. దీంతో భారత్ లో కరోనా టీకా పంపిణీలో మరో అడుగు ముందుకు పడినట్లయింది. టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తొలుత.. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్త ఆవిష్కరణ అయిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ పేరుని డీసీజీఐకి సిఫార్సు చేసింది. అనంతరం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన […]

కొవిషీల్డ్, కొవాక్సిన్.. రెండిటికీ లైన్ క్లియర్..
X

భారత్ లో కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాల అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన గంటల వ్యవధిలోనే రెండింటికీ ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులిచ్చింది. దీంతో భారత్ లో కరోనా టీకా పంపిణీలో మరో అడుగు ముందుకు పడినట్లయింది. టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తొలుత.. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్త ఆవిష్కరణ అయిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ పేరుని డీసీజీఐకి సిఫార్సు చేసింది. అనంతరం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాక్సిన్ పేరుని కూడా డీసీజీఐకి సూచించింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రెండు పేర్లను డీసీజీఐకి సిఫార్సు చేసింది కమిటీ. అయితే ఈ రెండు వ్యాక్సిన్లకు ఒకేసారి డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. దీంతో భారత్ లో ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాబోతున్నాయనే విషయం స్పష్టమైంది. కొవిషీల్డ్ ని తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ తమ వద్ద 5కోట్ల డోసులు సిద్దంగా ఉందని ప్రకటించింది. మార్చి నాటికి మరో 10కోట్ల డోస్ లు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. ఇక భారత్‌ బయోటెక్ ఇప్పటికే కోటి డోసుల కొవాక్సిన్ ఉత్పత్తిచేసింది. ప్రస్తుతం మూడో దశ పరీక్షలు జరుగుతుండగా, తుది అనుమతి రాగానే వీటిని పంపిణీ చేస్తారు. భారత్ బయోటెక్ కి కంపెనీకి ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంది. ఇంజెక్షన్‌ ద్వారా ఈ టీకాలను ఇస్తారు. తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండో డోసు ఇస్తారు.
డీసీజీఐ అనుమతి రావడంతో మరో వారం రోజుల్లో ఈ రెండు టీకాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అనంతరం వాటి పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం మొదలు పెడుతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ డ్రై రన్ పేరుతో వ్యాక్సినేషన్ ట్రయల్స్ నిర్వహించారు అధికారులు. ఈనెలాఖరులోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కొవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ ఆ వ్యాక్సిన్ కి అనుమతులు ఇవ్వడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదనే కారణంతోనే తొలుత నిపుణుల కమిటీ కొవాక్సిన్ ని పక్కనపెట్టి, కేవలం కొవిషీల్డ్ పేరుని మాత్రమే డీసీజీఐకి సిఫార్సు చేసింది. అయితే గంటల వ్యవధిలోనే కొవాక్సిన్ కి పేరు కూడా తెరపైకి రావడం.. చకచకా రెండు టీకాలకు డీసీజీఐ అనుమతులిచ్చేయడం విశేషం.

ప్రధాని అభినందన..
భారత్‌ లో టీకా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌ పై యద్ధం కీలక మలుపు తిరిగిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిషీల్డ్‌, కొవాక్సిన్ కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. ఈ నిర్ణయం భారత్ ను‌ ఆరోగ్యవంతమైన కొవిడ్‌ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందని అన్నారు. దేశప్రజలకు, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కృషి చేసి శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌ లోనే తయారు కావడం మన దేశానికే గర్వకారణమని అన్నారు మోదీ.

అమిత్ షా వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన..
కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలకు డీసీజీఐ అనుమతులివ్వడంపై కేంద్ర మంత్రులు స్పందించారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. అయితే హోం మంత్రి అమిత్ షా ఓ అడుగు ముందుకేసి, మోదీ దార్శినికతకు ఇదే నిదర్శనం అంటూ కితాబిచ్చారు. భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేశారని తెలిపారు షా. మోదీ వంటి దార్శనికుడి నాయకత్వం దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లగలదని, దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు విజయవంతం అవుతుండటంతో మోదీ ప్రతిపాదించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కీలక మలుపు తిరిగిందని వ్యాఖ్యానించారు అమిత్ షా. శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించాల్సిన సందర్భంలో వారికంటే ఎక్కువగా మోదీని ఆకాశానికెత్తేసిన అమిత్ షా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.

First Published:  3 Jan 2021 6:42 AM GMT
Next Story