Telugu Global
International

2020లో జర్నలిస్టుల హత్యలు పెరిగినయ్...

తన కళ్లతో చూసిన నిజాన్ని ప్రపంచానికి ముందుగా చూపించేవాడు. ఆ ప్రపంచం తరఫున ముందుగా గొంతు విప్పి మాట్లాడేవాడు. సమాజానికి ఎవరు హాని చేస్తున్నారు? హక్కుల్ని ఎవరు కాలరాస్తున్నారు? ప్రకృతిని ఎవరు ధ్వంసం చేస్తున్నారు? నేరం చేసి తప్పించుకుంటున్నది ఎవరు? మోసం చేసి పారిపోతున్నది ఎవరు?… అని ఎప్పుడూ నిఘా పెడుతుంటాడు. ఎవడయ్యా వాడు అంటే..జర్నలిస్ట్‌! ఈ నిఘా నిరాటంకంగా కొనాసాగినన్ని రోజులూ.. ప్రభుత్వంలో అన్ని విభాగాలు ప్రజల కోసం సక్రమంగా పని చేస్తాయి. ప్రజలు కూడా […]

2020లో జర్నలిస్టుల హత్యలు పెరిగినయ్...
X

తన కళ్లతో చూసిన నిజాన్ని ప్రపంచానికి ముందుగా చూపించేవాడు. ఆ ప్రపంచం తరఫున ముందుగా గొంతు విప్పి మాట్లాడేవాడు. సమాజానికి ఎవరు హాని చేస్తున్నారు? హక్కుల్ని ఎవరు కాలరాస్తున్నారు? ప్రకృతిని ఎవరు ధ్వంసం చేస్తున్నారు? నేరం చేసి తప్పించుకుంటున్నది ఎవరు? మోసం చేసి పారిపోతున్నది ఎవరు?… అని ఎప్పుడూ నిఘా పెడుతుంటాడు. ఎవడయ్యా వాడు అంటే..జర్నలిస్ట్‌! ఈ నిఘా నిరాటంకంగా కొనాసాగినన్ని రోజులూ.. ప్రభుత్వంలో అన్ని విభాగాలు ప్రజల కోసం సక్రమంగా పని చేస్తాయి. ప్రజలు కూడా సంతోషంగా స్వేచ్ఛను అనుభవిస్తారు.

న్యాయం కోసం మాట్లాడే గొంతు, సత్యాన్ని వెలికితీసే గొంతును కోసి రక్తం కళ్ల చూసిన రోజు… భావప్రకటనా స్వేచ్ఛకు అర్థం లేకుండా పోతుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుకు, ప్రజలు నిర్మించుకున్న ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే.. 2020లో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల హత్యలు ఎన్నడు లేనివిధంగా పెరిగిపోయాయని ‘రౌండప్ బై రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌’ ( ఆర్‌‌ఎస్‌ఎఫ్‌) వార్షిక నివేదికలో వెల్లడైంది.

పోయిన సంవత్సరం టార్గెట్ చేసిన జర్నలిస్టుల్లో 63 శాతం మంది హత్యకు గురైతే.. ఈ సారి అది 84 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ 15 మధ్య మొత్తం 50 మంది జర్నలిస్టులను చంపేశారు. ఇందులో పది మంది లోకల్‌గా జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఉన్నారు. నిధులు దుర్వినియోగం చేస్తున్నరాని రిపోర్ట్ చేసినవాళ్లని, క్రైమ్‌ రిపోర్టింగ్ చేసేవాళ్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుల పరిస్థితే దారుణంగా ఉందని, వీళ్లను టార్గెట్ చేసి చంపడం పెరిగిపోతోందని ఈ నివేదిక హెచ్చరించింది.

2020లో మరో కొత్త ట్రెండ్ కూడా వచ్చింది. అదే.. నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చంపడం. నిరసనల్ని రిపోర్ట్ చేస్తుండగా.. ఈ సారి ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. యుద్ధాలు జరుగుతున్న సిరియా, లిబియా, ఇరాక్‌ లాంటి దేశాల్లో జర్నలిస్టుల పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఈ సారి కోవిడ్‌ వల్ల చనిపోయినవాళ్లలో జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ‘జర్నలిజం.. ఇప్పటికీ డేంజర్ ప్రొఫెషన్‌గానే ఉంది!’ అని యూనెస్కో అభివర్ణించింది. 2020లోనూ ఇదే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! లక్షల జీతం కాదనుకొని ప్యాషన్‌తో ఎంతోమంది ఈ ప్రొఫెషన్‌కి వచ్చి.. ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, నాణేనాకి రెండో వైపు ఉన్నట్టు.. డబ్బు తీసుకుంటూ అన్యాయం వైపు, అసత్యం వైపు పనిచేసేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు.

మన దేశం కూడా డేంజరే

జర్నలిస్టులను హత్య చేయడంలో మెక్సికో టాప్‌. ఈ దేశంలో గత ఐదేళ్లుగా.. ఏటా పదిమంది కంటే ఎక్కువే జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారు. మెక్సికోలో డ్రగ్‌ మాఫియా ఎలా ఉంటుందో తెలిసిందే. డ్రగ్‌ మాఫియాకు, రాజకీయ నాయకులకు ఉన్న లింక్‌ని కనుక్కోవడానికి దర్యాప్తు చేసే క్రమంలో అనేకమంది జర్నలిస్టులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మెక్సికో తర్వాత ఆఫ్గానిస్తాన్‌ రెండో ప్లేస్‌లో ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం ఆరుగురు జర్నలిస్టులను చంపారు. పాకిస్తాన్‌, భారత్‌లు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో నలుగురు జర్నలిస్టుల చొప్పున హత్యకు గురయ్యారు. అంటే జర్నలిస్టులకు మన దేశం కూడా స్వర్గం ఏం కాదన్నమాట!

గతపదేళ్లలో మీడియాలో ఇన్వెస్టిగేటివ్‌ వార్తలు తగ్గిపోయిన తీరును అర్థం చేసుకోగలిగితే.. మన దేశ జర్నలిస్టుల మీద భయం నీడలు ఎంతలా కమ్ముకున్నాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బెదిరింపులకు లొంగి నిజాలు బయటపెట్టని జర్నలిస్టులు కొంతమందైతే.. ‘మనకెందుకులే రిస్క్‌’ అని వదిలేసేవాళ్లు ఇంకొంతమంది. ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నవాళ్లను, లొంగని జర్నలిస్టులను క్రిమినల్స్ చంపేవరకూ వేటాడుతున్నారు.

ఇక, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఏం తక్కువ కాదు. ప్రపంచవ్యాప్తంగా 250 మంది జర్నలిస్టులు ఈ సంవత్సరం జైలు పాలయ్యారు. ఆర్‌‌ఎస్‌ఎఫ్ నివేధిక యాభై మంది హత్యకు గురయ్యారు అని చెప్తున్నా..కచ్చితంగా ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుంది అనడంలో సందేహం లేదు. చివరికి చెప్పేది ఏమంటే… జర్నలిస్టు గొంతుకోయడం అంటే.. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరి గొంతుకోయడమే!

First Published:  29 Dec 2020 9:22 PM GMT
Next Story