Telugu Global
International

బ్రిటన్ లో భయం... దక్షిణాఫ్రికాపై నెపం...

కరోనా వైరస్ పేరు చెబితేనే.. అందరికీ మొదట గుర్తొచ్చే పేరు చైనా. కరోనా పుట్టినిల్లుగా చైనాకి పేరు స్థిరపడిపోయింది, ఓ దశలో ఇతర దేశాలన్నీ వాణిజ్య పరంగా చైనాని ఏకాకిని చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా వైరస్ అనే పేరు తెరపైకి తెచ్చి ఆ దేశానికి నిద్రలేకుండా చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు కొవిడ్ కొత్త రూపానికి పుట్టినిల్లుగా బ్రిటన్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చేసింది. బ్రిటన్ తో విమాన ప్రయాణాలను అన్ని ఇతర దేశాలు రద్దు […]

బ్రిటన్ లో భయం... దక్షిణాఫ్రికాపై నెపం...
X

కరోనా వైరస్ పేరు చెబితేనే.. అందరికీ మొదట గుర్తొచ్చే పేరు చైనా. కరోనా పుట్టినిల్లుగా చైనాకి పేరు స్థిరపడిపోయింది, ఓ దశలో ఇతర దేశాలన్నీ వాణిజ్య పరంగా చైనాని ఏకాకిని చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా వైరస్ అనే పేరు తెరపైకి తెచ్చి ఆ దేశానికి నిద్రలేకుండా చేశారు.

కట్ చేస్తే.. ఇప్పుడు కొవిడ్ కొత్త రూపానికి పుట్టినిల్లుగా బ్రిటన్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చేసింది. బ్రిటన్ తో విమాన ప్రయాణాలను అన్ని ఇతర దేశాలు రద్దు చేసుకున్నాయి. డిసెంబర్ 31వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ఆదేశాలిచ్చినా.. ఆ తర్వాత కూడా కొనసాగించేందుకే ఎక్కువ దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో బ్రిటన్ లో భయం మొదలైంది. చైనా లాగా పేరు పడితే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. సమీప భవిష్యత్ లో ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు కూడా పునరుద్ధరించుకునే అవకాశాలు ఉండవు.

అందుకే నెపం దక్షిణాఫ్రికాపై నెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు బ్రిటన్ నాయకులు. కొత్తరకం కరోనా వైరస్ కి బ్రిటన్ వైరస్ అనే పేరు పడటంకంటే ముందు.. దానికి దక్షిణాఫ్రికా వైరస్ అనే పేరు వచ్చేలా ప్రచారం మొదలు పెట్టారు. మార్పు చెందిన కరోనా కంటే వేగంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కొత్త కరోనా దాడి చేస్తోందని బ్రిటన్ ఆరోగ్యమంత్రి మట్ హన్ కాక్ ప్రకటించారు. కరోనా రెండోసారి కొత్త రూపం సంతరించుకుందని చెబుతున్న ఈ ప్రకటన మొత్తం దక్షిణాఫ్రికాను వేలెత్తి చూపడానికే పరిమితమైంది.

ఇప్పటికే బ్రిటన్ లో బైటపడ్డ కరోనా రూపాంతరాని కంటే భిన్నంగా ఈ కొత్త వైరస్ ఉందని, ఇది తమ దేశానికి దక్షిణాఫ్రికానుంచి వచ్చిందని, అక్కడినుంచి వచ్చినవారిద్దరిలో ఈ లక్షణాలు కనపడ్డాయని బ్రిటన్ మంత్రి ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి తమ దేశానికి రాకపోకలు నిషేధించామని, లాక్ డౌన్ కొనసాగిస్తున్నామని అన్నారాయన. అక్కడినుంచి వచ్చినవారు 15రోజుల క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆదేశాలిచ్చారు. రూపం మార్చుకున్న కరోనా వైరస్ కంటే దక్షిణాఫ్రికానుంచి వచ్చిన కొత్తరకం మరింత ప్రమాదకారి అని, వ్యాప్తి వేగం కూడా ఎక్కువ అని అంటున్నారాయన. దక్షిణాఫ్రికా రకం వైరస్ ‌పై ఇంగ్లండ్‌ లో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. టోటల్ గా దక్షిణాఫ్రికాను కార్నర్ చేసేశారు.

భారత్ లో పెరుగుతున్న భయం…

మార్పు చెందిన కరోనా వైరస్ భయం భారత్ ను పట్టి పీడిస్తోంది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య పెరగకపోయినా.. విదేశాలనుంచి వచ్చినవారిపై గట్టి నిఘా పెట్టారు. బ్రిటన్ నుంచి వచ్చే విమాన సర్వీసులు ఆపేశారు. బ్రిటన్ సహా ఇతర దేశాలనుంచి వచ్చినవారిని కూడా ఎయిర్ పోర్ట్ లో పరీక్ష తర్వాతే బయటకు అనుమతిస్తున్నారు.

దీంతో విమానాశ్రయాల వద్ద గంటలతరబడి ప్రయాణికులు, వారికోసం వచ్చిన బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే యూకేనుంచి ఇండియాకి వచ్చి ఇళ్లకు వెళ్లిపోయిన ప్రయాణికుల లిస్ట్ తీస్తున్నారు. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. వారిపై నిఘా పెట్టారు.

మహారాష్ట్ర లాగే కర్నాటక ప్రభుత్వం కూడా రాత్రి పూట రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కూడా ఈ ప్రభావం పడే అకాశం ఉంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, గెట్ టు గెదర్ వంటి వాటిపై అనధికారిక ఆంక్షలు విధించాయి. భారత్ లో మరోసారి లాక్ డౌన్ పెట్టబోతున్నారన్న పుకార్లు కూడా జోరందుకున్నాయి.

First Published:  23 Dec 2020 10:16 PM GMT
Next Story