తిరుపతి వ్యవహారం చల్లబడినట్టేనా..?
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో అవసరం లేకపోయినా ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్ లేకుండానే టీడీపీ అభ్యర్థిని ప్రకటించేసింది. గ్రేటర్ ఎన్నికల ఉత్సాహంతో ఏకంగా బీజేపీ మీటింగ్ లు పెట్టేసింది. పవన్ కల్యాణ్ ఏకంగా రైతు పరామర్శ యాత్ర పేరుతో తిరుపతి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లారు. టైమూ రాలేదు, నోటిఫికేషన్ లేదు.. ప్రచార వ్యవహారాలు మాత్రం జోరుగా సాగాయి. రాగా పోగా తిరుపతి వ్యవహారంలో వైసీపీ మాత్రమే ఆచి తూచి […]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో అవసరం లేకపోయినా ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్ లేకుండానే టీడీపీ అభ్యర్థిని ప్రకటించేసింది. గ్రేటర్ ఎన్నికల ఉత్సాహంతో ఏకంగా బీజేపీ మీటింగ్ లు పెట్టేసింది. పవన్ కల్యాణ్ ఏకంగా రైతు పరామర్శ యాత్ర పేరుతో తిరుపతి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లారు. టైమూ రాలేదు, నోటిఫికేషన్ లేదు.. ప్రచార వ్యవహారాలు మాత్రం జోరుగా సాగాయి.
రాగా పోగా తిరుపతి వ్యవహారంలో వైసీపీ మాత్రమే ఆచి తూచి స్పందిస్తోంది. దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇవ్వలేదనే విషయం మాత్రమే అధికారికం. అంతకు మించి ఎవ్వరూ అభ్యర్థిపై మాట జారలేదు. జస్ట్ లీక్ ఇచ్చి వదిలేశారంతే.
తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిని వైసీపీ అధికారికంగా ప్రకటించకపోయే సరికి అసలు ఎన్నికల వాతావరణే లేకుండా పోయింది. వీలైతే స్థానికం జరపాలి, లేదంటే జమిలి తొందరగా రావాలి, ఈలోగా వచ్చిన ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలంటూ ఎన్నికలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న చంద్రబాబుకి ఇది మింగుడు పడని వ్యవహారంలా మారింది.
వైసీపీపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ పార్టీ అభ్యర్థిపై అధికారిక ప్రకటన రాకపోయే సరికి ఎన్నికల మూడ్ ఇంకా రానట్టేననుకోవాలి. ఒకవేళ తొందరపడి వైసీపీ తన అభ్యర్థిని ప్రకటిస్తే… దానికంటే ముందు స్థానిక ఎన్నికలు జరపాలని టీడీపీ పట్టుబట్టి ఉండేది. అయితే టీడీపీ ఎంత రెచ్చగొట్టినా వైసీపీ ఆ ఉచ్చులో పడలేదు, అయితే నియోజకవర్గాల వారీగా మంత్రులకు విధులు కేటాయించడంలో మాత్రం జగన్ ముందంజలో ఉన్నారు.
ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ చార్జిగా ప్రకటించి బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈలోగా అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు చప్పబడ్డారు. అసలు అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికలకు ఏమాత్రం ఉత్సాహం చూపించకపోవడంతో టీడీపీలో కూడా నిరాశాజనక వాతావరణమే నెలకొన్నట్టు తెలుస్తోంది.
ఇక బీజేపీ, జనసేన పరిస్థితి కూడా ఇంతే. ముందస్తుగా హడావిడి చేసి, చివరకు టికెట్ త్యాగం చేయాల్సి వస్తే అది మరింత పరువు తక్కువ అని రెండు పార్టీలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు ఢిల్లీలో కూడా సరైన హామీ లభించకపోవడంతో జనసైనికుల్లో కూడా ఉత్సాహం లేదు. బీజేపీ కూడా సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నా.. కనీసం పరిశీలనలో ఉన్న అభ్యర్థి పేర్లు కూడా బైటపెట్టలేని పరిస్థితి.
మొత్తమ్మీద నెలరోజుల క్రితం తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కనిపించిన హడావిడి ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగిపోయింది.