Telugu Global
International

జమ్ము కశ్మీర్‌‌లో... ఫస్ట్ బోట్‌ అంబులెన్స్‌!

అంబులెన్స్ అనగానే.. రోడ్డు మీద ‘కుయ్‌..కుయ్‌’ అనుకుంటూ స్పీడ్‌గా పరుగులు తీసే వ్యాన్లే మనకు గుర్తుకొస్తాయి. కానీ, బోట్‌ అంబులెన్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? పేరులో ఉన్నట్టుగా బోట్‌లోనే అంబులెన్స్‌లో ఉండే ప్రతి సౌకర్యం ఉంటుంది అన్నమాట! కశ్మీర్‌‌ లోయలో ఉన్న దాల్‌ సరస్సులో ఈ బోట్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బోట్ అంబులెన్స్ అందుబాటులోకి వస్తే దల్‌ సరస్సులో హౌజింగ్‌ బోట్స్‌పై నివసిస్తున్న కొన్ని వందలమంది ప్రజలకు మెరుగైన […]

జమ్ము కశ్మీర్‌‌లో... ఫస్ట్ బోట్‌ అంబులెన్స్‌!
X

అంబులెన్స్ అనగానే.. రోడ్డు మీద ‘కుయ్‌..కుయ్‌’ అనుకుంటూ స్పీడ్‌గా పరుగులు తీసే వ్యాన్లే మనకు గుర్తుకొస్తాయి. కానీ, బోట్‌ అంబులెన్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? పేరులో ఉన్నట్టుగా బోట్‌లోనే అంబులెన్స్‌లో ఉండే ప్రతి సౌకర్యం ఉంటుంది అన్నమాట! కశ్మీర్‌‌ లోయలో ఉన్న దాల్‌ సరస్సులో ఈ బోట్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బోట్ అంబులెన్స్ అందుబాటులోకి వస్తే దల్‌ సరస్సులో హౌజింగ్‌ బోట్స్‌పై నివసిస్తున్న కొన్ని వందలమంది ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయలు అందుతాయి.

ఇది ప్రభుత్వం తీసుకొస్తున్న అంబులెన్స్‌ సర్వీస్ కాదు. ఈ బోటు అంబులెన్స్ తీసుకురావడం వెనుక ఒక కథ ఉంది. తరిఖ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి తన సొంత పైసలతో ఈ బోటును తయారు చేయించాడు. జమ్ముకశ్మీర్‌‌లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసుల్లో దల్‌ సరస్సు ఒకటి. దీన్నే ‘పూల సరస్సు’ అని, ‘కశ్మీర్ కీరిటంలో మణిహారం’ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సులో పడవలపై తేలియాడే ఇళ్లలో ప్రజలు నివసించడమే దీని ప్రత్యేకత. అంటే హౌజింగ్ బోట్స్ అన్నమాట! ఈ బోట్స్‌ అచ్చంగా మన ఇళ్లలాగే డిజైన్ చేసుకుని, అందులోనే ఉంటున్నారు. టూరిజం ద్వారానే ఇక్కడి వాళ్లు ఉపాధి పొందుతుంటారు. అయితే, వీళ్లకు ఎలాంటి ఆపద వచ్చినా.. శ్రీనగర్‌‌లో ఉన్న హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిందే.

రెండు నెలల కింద తరిఖ్‌ అహ్మద్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా అని తెలియగానే అతడికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దల్ సరస్సు దాటి శ్రీనగర్ వెళ్లాలి అంటే పడవలోనే ప్రయాణించాలి. కరోనా పేషెంట్‌ని తీసుకుపోతే తమకూ కరోనా వచ్చే అవకాశం ఉందనే భయంతో అతనికోసం ఎవరూ పడవ తీయలేదు. చివరికి అహ్మద్ స్నేహితుడు ఒకతను ముందుకొచ్చాడు. అతనికి సాయం చేసి, పడవలో హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత.. తనకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకుడదని అప్పుడే అనుకున్నాడు అహ్మద్‌.

‘పది నిమిషాల ముందు తీసుకొస్తే ఆ మనిషి బతికేవాడే’ అని డాక్టర్లు అనే మాట… దల్ సరస్సు ప్రజల విషయంలో అప్పటికే చాలాసార్లు విని ఉన్నాడు అహ్మద్‌. ఒకవేళ అన్ని అన్ని హెల్త్‌కేర్ సౌకర్యాలతో ఒక బోట్ అంబులెన్స్ ఉంటే.. పేషెంట్‌ని సేఫ్‌గా హాస్పిటల్‌కి తీసుకుపోవచ్చు కదా? అనుకొని.. బోట్‌ అంబులెన్స్ తయారు చేయించాడు. ‘ఎమర్జెన్సీ సమయంలో పేషెంట్స్‌కి హెల్త్‌కేర్ సౌకర్యాలు అందించడమే ఈ బోట్ అంబులెన్స్ ప్రధాన లక్ష్యం. ఇందులో ఆక్సిజన్ సిలిండర్‌‌, ఈసీజీ, ఆక్సిమీటర్‌‌, వీల్ చైర్‌‌, స్ట్రెచర్‌‌ ఉంచాం. దీంతోపాటు ప్రజలు సంప్రదించడానికి డోర్ల మీద టోల్ ఫ్రీ నెంబర్‌‌ కూడా పెట్టాం. తొందర్లోనే ఈ సర్వీస్ మొదలుపెట్టబోతున్నాం’ అని అహ్మద్ చెప్పాడు. అంతేమరి, బాధను అనుభవించినవాళ్లే.. నలుగురి బాధను తీర్చడానికి నడుం బిగిస్తారు. ఆ లిస్ట్‌లో మన అహ్మద్‌ కూడా ఉంటాడు!

First Published:  18 Dec 2020 10:29 AM GMT
Next Story