Telugu Global
International

భారతీయులకు టీకా కావాలా..? వద్దా..??

అమెరికాలో టీకా అత్యవసర వినియోగం మొదలైంది. కెనడాలో కూడా తొలివిడత టీకా పంపిణీ చేస్తున్నారు. అన్ని దేశాలూ.. ప్రయోగాలు పూర్తి కాకుండానే అత్యవసర వినియోగానికి సై అంటున్నాయి. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇంకా ఇవ్వలేదు. ప్రభుత్వం సంగతి సరే మరి ప్రజలేమనుకుంటున్నారు? కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొత్తల్లో భారతీయులు కూడా టీకా ఎప్పుడొస్తుంది, ఎవరు తయారు చేస్తున్నారనే విషయాలపై ఆసక్తి కనబరిచారు. రాను రాను […]

భారతీయులకు టీకా కావాలా..? వద్దా..??
X

అమెరికాలో టీకా అత్యవసర వినియోగం మొదలైంది. కెనడాలో కూడా తొలివిడత టీకా పంపిణీ చేస్తున్నారు. అన్ని దేశాలూ.. ప్రయోగాలు పూర్తి కాకుండానే అత్యవసర వినియోగానికి సై అంటున్నాయి. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇంకా ఇవ్వలేదు.

ప్రభుత్వం సంగతి సరే మరి ప్రజలేమనుకుంటున్నారు?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొత్తల్లో భారతీయులు కూడా టీకా ఎప్పుడొస్తుంది, ఎవరు తయారు చేస్తున్నారనే విషయాలపై ఆసక్తి కనబరిచారు. రాను రాను కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో భారతీయుల్లో ఆ భయం చాలావరకు తొలగిపోయింది. వ్యాక్సిన్ పై మీడియా హడావిడే కానీ.. జనాల్లో ఏమాత్రం లేదు. మాస్కులు లేకుండా బైట తిరిగేస్తున్న సగటు భారతీయుడు.. వ్యాక్సిన్ వేయించుకోడానికి ఉత్సాహం చూపిస్తాడంటే అది అతిశయోక్తే అవుతుంది. ఉచితంగా టీకా ఇచ్చినా కూడా ఎంతమంది దానికోసం క్యూలైన్లో నిలబడతారో చూడాలి.

సర్వేలు ఏం చెబుతున్నాయి…?

లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఆన్ లైన్ లో చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సంస్థ రెండు నెలల క్రితం కరోనా వ్యాక్సిన్ వినియోగంపై సర్వే చేయగా 61శాతం మంది భారతీయులు టీకా విషయంలో ఆసక్తి చూపడంలేదని తేలింది. టీకా ఉచితంగా వేస్తామన్నా దుష్ప్రభావాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే అనుమానంతో 51 శాతం మంది వద్దన్నారు. మార్కెట్ లోకి ఎప్పుడొచ్చినా అసలు తాము వ్యాక్సిన్ వేయించుకోబోమని 10 శాతం మంది పేర్కొన్నారు. తాజాగా మరోసారి ఈ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా భారతీయుల ఆలోచన మారలేదని తేలింది. టీకా వద్దని చెప్పేవారి శాతం 65కి పెరిగిందట. ప్రభుత్వం ఉచితంగా టీకా ఇస్తామని ప్రకటించినా కూడా తాము ఉత్సాహంగా లేమని వీరంతా తేల్చి చెప్పారట.

గతంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కొన్నేళ్లు సాగేది. ఈసారి ఏడాది లోపే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కరోనాకు మందు కనిపెట్టకుండానే వ్యాక్సిన్ ఎలా కనిపెడతారంటూ ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అంతర్జాతీయంగా సొమ్ము చేసుకునేందుకు కొన్ని ఫార్మా కంపెనీలు సష్టిస్తున్న కథనాలే ప్రజల భయాందోళనలకు కారణమని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. వీరంతా టీకాకు వ్యతిరేకం అనలేం కానీ.. అప్పుడే ఏం తొందరొచ్చిందనేది మాత్రం వీరి మాటల్లో స్పష్టమవుతోంది. కేసుల సంఖ్య తగ్గిపోతున్న ఈ దశలో అత్యవసర వినియోగం అనే మాట అర్థరహితం అని అంటున్నారు.

ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం టీకా పంపిణీకి సిద్ధమైపోయాయి. టీకా ఉచిత పంపిణీకి ఎన్నికల హామీల్లో కూడా చోటు దక్కడం చూస్తుంటే టీకా వినియోగం, దాని పేరుతో వచ్చే ప్రయోజనాలపై రాజకీయ వర్గాలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

First Published:  15 Dec 2020 2:50 AM GMT
Next Story