Telugu Global
International

అంతు చిక్కని కేసీఆర్ రాజకీయం...

“కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నా.. హైదరాబాద్ లోనే ప్రతిపక్షాలతో కూటమి కడతా.. దేశ ప్రయోజనాలకోసం ఏ త్యాగానికైనా సిద్ధం.. రైతులను ముంచే చట్టాల రద్దుకోసం పోరాడతాం, కేంద్రానికి కనువిప్పు కలిగేలా చేస్తాం..” కేసీఆర్ నోటివెంట ఈ మాటలు వచ్చి సరిగ్గా నెలరోజులు కూడా కాలేదు. కట్ చేస్తే.. ప్రస్తుతం కేంద్ర మంత్రులతో సామరస్య పూర్వక భేటీలతో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. వరద సాయం ఇవ్వకుండా హైదరాబాద్ ని ముంచేశారని విమర్శించి కేసీఆర్.. ఇప్పుడు అదే వరదసాయం కోసం […]

అంతు చిక్కని కేసీఆర్ రాజకీయం...
X

“కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నా.. హైదరాబాద్ లోనే ప్రతిపక్షాలతో కూటమి కడతా.. దేశ ప్రయోజనాలకోసం ఏ త్యాగానికైనా సిద్ధం.. రైతులను ముంచే చట్టాల రద్దుకోసం పోరాడతాం, కేంద్రానికి కనువిప్పు కలిగేలా చేస్తాం..” కేసీఆర్ నోటివెంట ఈ మాటలు వచ్చి సరిగ్గా నెలరోజులు కూడా కాలేదు.

కట్ చేస్తే.. ప్రస్తుతం కేంద్ర మంత్రులతో సామరస్య పూర్వక భేటీలతో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. వరద సాయం ఇవ్వకుండా హైదరాబాద్ ని ముంచేశారని విమర్శించి కేసీఆర్.. ఇప్పుడు అదే వరదసాయం కోసం విపత్తు నిధులివ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కోరారు. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహకరించాలన్నారు. 40నిముషాలపాటు అమిత్ షా తో కేసీఆర్ భేటీ వెనక మరిన్ని రాజకీయాలు చర్చకు వచ్చాయని సమాచారం.

అమిత్ తో భేటీ ముగిశాక, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలసిన కేసీఆర్.. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ నష్టపోతోందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కూడా చర్చించినట్టు సమాచారం.

ఇక ఈరోజు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్ దీప్ సింగ్ పూరీ, ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. అమిత్ షా, షెకావత్ ని ఏకాంతంగా కలిసిన కేసీఆర్.. ఇతర మంత్రులు, ప్రధానితో కూడా ఏకాంతంగానే సమావేశమవుతారా లేక, అధికారులను, ఇతర నాయకులను వెంటబెట్టుకుని వెళ్తారా అనే విషయం తేలాల్సి ఉంది. ప్రధాని అపాయింట్ మెంట్ కష్టమేనంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో.. కేసీఆర్ ప్రధాని సహా.. నలుగురు కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధపడటం పొలిటికల్ హీట్ ని పెంచింది.

అటు కేసీఆర్ హస్తినలో పెద్దలందరితో ఏకాంతంగా భేటీ అవుతున్న వేళ, ఇటు తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. కేంద్రం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్య ధోరణితో అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు.

అటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. సిద్దిపేట విమానాశ్రయం హామీని మాటల గారడీగా కొట్టి పారేశారు.

ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. అటు కేంద్ర పెద్దలతో కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు.

మొత్తమ్మీద రోజుల వ్యవధిలోనే కేసీఆర్ తన పొలిటికల్ స్ట్రాటజీ మార్చినట్టు తెలుస్తోంది. కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వుతానన్న ఆయన.. ఇప్పుడు సామరస్య చర్చలకు తెరతీసి.. అందరికీ షాకిచ్చారు.

First Published:  11 Dec 2020 10:18 PM GMT
Next Story