Telugu Global
International

ఈ మూడు కంపెనీలు ప్లాస్టిక్ పొల్యూషన్లో... ఫస్ట్ !

కోకాకోలా, పెస్పికో, నెస్లే… ఈ మూడు ప్రముఖ కంపెనీల పేర్లు వినని వారు ఉండరు. వీటి బ్రాండ్ పేర్లను మనం అవి తయారుచేసే ఉత్పత్తుల ప్రచారంలో చాలా తరచుగా వింటూ, చూస్తూ ఉంటాం. అయితే… వీటి పేర్లు మరొక విషయంలో కూడా తెరమీదకు వచ్చాయి. అత్యంత ఎక్కువ స్థాయి ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని చేస్తున్న కంపెనీలు కూడా ఇవే. ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించడంలో ఇవి ‘జీరో ప్రోగ్రెస్’ లో ఉన్నాయి. బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ […]

ఈ మూడు కంపెనీలు ప్లాస్టిక్ పొల్యూషన్లో... ఫస్ట్ !
X

కోకాకోలా, పెస్పికో, నెస్లే… ఈ మూడు ప్రముఖ కంపెనీల పేర్లు వినని వారు ఉండరు. వీటి బ్రాండ్ పేర్లను మనం అవి తయారుచేసే ఉత్పత్తుల ప్రచారంలో చాలా తరచుగా వింటూ, చూస్తూ ఉంటాం. అయితే… వీటి పేర్లు మరొక విషయంలో కూడా తెరమీదకు వచ్చాయి. అత్యంత ఎక్కువ స్థాయి ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని చేస్తున్న కంపెనీలు కూడా ఇవే. ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించడంలో ఇవి ‘జీరో ప్రోగ్రెస్’ లో ఉన్నాయి.

బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ (2018 నుండి ఈ విషయంలో పనిచేస్తున్న గ్లోబల్ మూవ్ మెంట్) తాలూకూ సాంవత్సరిక ఆడిట్ నివేదిక ప్రకారం… ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో కోకాకోలా మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాల్లో నెస్లే, పెప్సీకో ఉన్నాయి.

సర్వే నిర్వహించిన మొత్తం 55 దేశాల్లో… 51 దేశాల్లో కోకాకోలా కంపెనీ బ్రాండ్ ఉన్న 13,834 ప్లాస్టిక్ ముక్కలను వాలంటీర్లు గుర్తించారు. పార్కులు, నదులు, బీచ్ లు మొదలైన ప్రాంతాల్లో కోకాకోలా ప్లాస్టిక్ బాటిల్స్ తాలూకూ వ్యర్థాలు 51 దేశాల్లో అత్యధికంగా కనిపించాయి. నెస్లే, పెప్సికో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

వీటి తాలూకూ ప్లాస్టిక్ ముక్కలు 8,633 (నెస్లే), 5,155 (పెస్పికో) సర్వేలో లభ్యమయ్యాయి. ఈ రెండు కంపెనీల తాలూకూ ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపితే వచ్చే మొత్తం కంటే ఎక్కువగా కోకాకోలా వ్యర్థాలు ఉన్నాయి. 15వేలమంది వాలంటీర్లతో బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్… ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది.

కోకాకోలా, పెప్సికో, నెస్లే, యూనిలివర్ ఈ నాలుగు కంపెనీల తాలూకూ వ్యర్థాలు… ఆరు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంవత్సరానికి ఐదు లక్షల టన్నుల వరకు ఉంటున్నాయని టీయర్ ఫండ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

ప్రపంచంలోనే ప్లాస్టిక్ కాలుష్యంలో ప్రథమ స్థానంలో ఉన్న ఈ కంపెనీలు ఎప్పటికప్పుడు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతుంటాయి కానీ…ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్యాకేజీలను అవి తయారుచేస్తూనే ఉన్నాయని బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ గ్లోబల్ క్యాంపైన్ కోఆర్డినేటర్ ఎమ్మా ప్రీస్ట్ ల్యాండ్ అన్నారు. ఈ సమస్యని నివారించాలంటే… తాగిపారేసే ప్లాస్టిక్ బాటిల్స్ ని తయారుచేయటం ఆపేయాలని, తిరిగి వాడే అవకాశం ఉన్నవాటిని తయారుచేయాలని ఎమ్మా అన్నారు.

First Published:  11 Dec 2020 11:11 AM GMT
Next Story