Telugu Global
International

గూగుల్... పనీర్ ఎలా తయారుచేయాలి !

2020 సంవత్సరం ప్రపంచానికి కోవిడ్ నామ సంవత్సరమే. మనమంతా దీని జపమే చేశాం. చేస్తున్నాం. దానినుండి కాపాడుకునే ప్రయత్నాలే మనందరి లక్ష్యంగా మారిపోయిన సంవత్సరం ఇది. మరి ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన విషయాలు కోవిడ్ గురించే  అయి ఉండాలి కదా. అవును అలాగే ఉన్నాయి. ఎక్కువమంది కరోనా గురించిన సమాచారాన్నే అడిగారు. అయితే వాటి మధ్యలో అంతే స్థాయిలో ఎక్కువమంది సెర్చ్ చేసిన అంశాల్లో పనీర్ ఎలా తయారుచేయాలి, కేక్ ఎలా […]

గూగుల్... పనీర్ ఎలా తయారుచేయాలి !
X

2020 సంవత్సరం ప్రపంచానికి కోవిడ్ నామ సంవత్సరమే. మనమంతా దీని జపమే చేశాం. చేస్తున్నాం. దానినుండి కాపాడుకునే ప్రయత్నాలే మనందరి లక్ష్యంగా మారిపోయిన సంవత్సరం ఇది.

మరి ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన విషయాలు కోవిడ్ గురించే అయి ఉండాలి కదా. అవును అలాగే ఉన్నాయి. ఎక్కువమంది కరోనా గురించిన సమాచారాన్నే అడిగారు. అయితే వాటి మధ్యలో అంతే స్థాయిలో ఎక్కువమంది సెర్చ్ చేసిన అంశాల్లో పనీర్ ఎలా తయారుచేయాలి, కేక్ ఎలా చేయాలి… జిలేబి ఎలా చేయాలి… లాంటివి ఉన్నాయి.

కోవిడ్ తెచ్చిన లాక్ డౌన్ కారణంగా ఎక్కువమంది తమ ఇళ్లలో వంటల ప్రయోగాలు చేశారు. బయట హోటళ్లు అందుబాటులో లేని సమయంలో హోటళ్లలో దొరికే భిన్నమైన ఆహారాలను ఇళ్లలో తయారుచేయడానికి ప్రయత్నించారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ లో కనిపించాయి.

ఇక కోవిడ్ గురించి ఎక్కువమంది వెతికిన అంశాల్లో ‘రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి’ ఒకటి. కోవిడ్ నుండి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలనే అవగాహన దాదాపు అందరిలోనూ పెరిగిన నేపథ్యంలో గూగుల్ లో ఎక్కువమంది దీని గురించి వెతికారు.

దల్గొనా కాఫీని ఎలా తయారుచేయాలి? శానిటైజర్ ని ఎలా తయారుచేయాలి? అనే అంశాలను సైతం నెటిజన్లు ఎక్కువగా వెతికారు. శానిటైజర్ వినియోగం అత్యవసరం కావటం, దీనిని తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకోవాలని చాలామంది ఆశించడం వలన శానిటైజర్ తయారీ ట్రెండింగ్ లో నిలిచింది.

ఇంకా కరోనా వైరస్ కి సంబంధించి… కరోనా వైరస్ అంటే ఏమిటి? ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? కరోనా వైరస్ ని ఎలా నివారించాలి? అనే అంశాలను సైతం నెటిజన్లు ఎక్కువగా వెతికారు.

అయితే విశేషం ఏమిటంటే… ఈ రెండింటికంటే రెండు రెట్లు ఎక్కువగా ‘విరాళాలు ఎలా ఇవ్వాలి?’ అనే అంశాన్ని సెర్చ్ చేశారు. ‘ఎలా తయారుచేయాలి’ ‘అంటే ఏమిటి’… అనే ప్రశ్నల్లో ట్రెండింగ్ అంశాలివి.

ఇవి కాకుండా… ద ఇండియన్ ప్రీమియర్ లీగ్, బీహార్ ఎన్నికల ఫలితాలు, అమెరికా అధ్యక్షుని ఎన్నికలు, జో బైడెన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరి సినిమా దిల్ బేచారా, ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ మొదలైనవి గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ టాప్ ట్రెండింగ్ ప్రశ్నగా నిలిచింది. అలాగే ఎన్నికల ఫలితాలు, జూమ్, ఆపిల్, ఇండియా వర్సెస్ న్యూజీల్యాండ్ మ్యాచ్… టాప్ టెన్ సెర్చ్ ల్లో ఉన్నాయి.

First Published:  10 Dec 2020 10:33 AM GMT
Next Story