Telugu Global
National

ఏలూరులో ఏం జరుగుతోంది.. ?

ఏలూరులో వింత వ్యాధి, అంతుచిక్కని పరిస్థితులు, ఒకరి వెంట ఒకరు ఆస్పత్రి పాలవుతున్న స్థానికులు, ఎక్కడికక్కడ కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు. ఇవీ.. కొన్ని గంటలుగా ఏలూరు గురించి బయట ప్రపంచానికి అందుతున్న వార్తలు. శనివారం రాత్రి ఏలూరులోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడిపోయారు. మూర్ఛలాంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో పిల్లలు, పెద్దలు, పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు. సుమారు 100మంది ఆస్పత్రులకు వస్తే వారిలో 50మంది రాత్రికి రాత్రే డిశ్చార్జి […]

ఏలూరులో ఏం జరుగుతోంది.. ?
X

ఏలూరులో వింత వ్యాధి, అంతుచిక్కని పరిస్థితులు, ఒకరి వెంట ఒకరు ఆస్పత్రి పాలవుతున్న స్థానికులు, ఎక్కడికక్కడ కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు. ఇవీ.. కొన్ని గంటలుగా ఏలూరు గురించి బయట ప్రపంచానికి అందుతున్న వార్తలు. శనివారం రాత్రి ఏలూరులోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడిపోయారు. మూర్ఛలాంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో పిల్లలు, పెద్దలు, పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు.

సుమారు 100మంది ఆస్పత్రులకు వస్తే వారిలో 50మంది రాత్రికి రాత్రే డిశ్చార్జి అయిపోయారు. తాగునీరు కలుషితం కావడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో.. ఆయా ప్రాంతాల్లో మరికొందరికి అనుమానం ఎక్కువై ఇలాంటి లక్షణాలే కనిపించాయంటూ ఆస్పత్రుల ముందు క్యూ కట్టారు. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చిన 277మందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు.

వీరిలో చాలామందికి ప్రాథమిక లక్షణాలు కూడా లేవు. అయితే ఒకరిని చూసి ఒకరు, మంచినీరు సరిగా లేదనే కారణంతో, ఏదో జరిగిపోయిందనే ఆందోళనలో అస్వస్థతకు గురయ్యారు. ఏలూరు వ్యవహారాన్ని సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసిన తీరు మాత్రం బాధాకరం, ఆందోళనకరం కూడా. ఆస్పత్రులకు వచ్చినవారిలో సగం మంది ఇలా సోషల్ మీడియాలో వీడియోలు చూసిన తర్వాతే కుప్పకూలారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకి కూడా అలాంటి లక్షణాలున్నాయనే ఆందోళనతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. ఇదంతా సోషల్ మీడియా చేసిన అతి కాక ఇంకేమీ కాదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

రాత్రి ఈ ఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేరుగా ఆస్పత్రుల వద్దకు వెళ్లి పరిస్థితి సమీక్షించారు. బాధితులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడివారితో మాట్లాడారు. ఆదివారం ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయని, ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నారని, ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరిని చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఆళ్ల నాని. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు.

ఏలూరులో బాధితులు ఉన్న ప్రాంతాలనుంచి నీటి నమూనా సేకరించి రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ కు పంపారు అధికారులు. నీటిలో కాలుష్యం లేదని నివేదిక వచ్చింది. బాధితుల రక్త నమునాలలో కూడా ఎలాంటి వైరస్ జాడ లేదు. మరికొన్ని రిపోర్టులు వచ్చాక కారణాలు తెలిసే అవకాశముందని వైద్య అధికారులు చెబుతున్నారు. సీఎం జగన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏలూరులో ఏదో జరిగిపోతోందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. అంతు చిక్కని వైరస్ కి ప్రజలు కుప్పకూలిపోతున్నారని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అనుమానం వ్యక్తం చేయడం మరింత దారుణం. కరోనా భయం పూర్తిగా వదిలిపోకముందే.. ఏలూరు వాసులు మరో భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఎవరికీ ప్రాణాపాయం లేదు, అసలు వైద్యమే అవసరం లేకుండా మిగతావారు డిశ్చార్జి అవుతున్నారు. ఈ దశలో ఈ ఘటనలపై అవగాహన పెంచడానికి అధికారులు కృషిచేయాలి. లేనిపోని భయాందోళనలకు గురికాకుండా ప్రజలకు భరోసా ఇవ్వాలి.

Next Story