Telugu Global
Health & Life Style

తేనెలో షుగర్ సిరప్... ప్రముఖ బ్రాండ్ల నిర్వాకం !

తేనె వలన  చాలా ఆరోగ్య లాభాలున్నాయని మనం తరచుగా వింటూ ఉంటాం. తేనెని ఆహారంలో తీసుకోవాలని, ఉదయాన్నే వేడినీటితో కలిపి తాగాలని… ప్రకృతి వైద్యులు తరచుగా చెబుతుంటారు. అయితే స్వచ్ఛమైన కల్తీలేని తేనెని తీసుకుంటేనే మనకు ఆ ఫలితాలన్నీ వస్తాయి. లేకపోతే మరిన్ని సమస్యలు కూడా రావచ్చు. మార్కెట్లో ఇప్పుడు చాలా పేరున్న కంపెనీలు తయారుచేస్తున్న తేనె దొరుకుతోంది. అయితే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సిఎస్ఇ) సంస్థ నిర్వహించిన పరిశోధనలో… చాలా పెద్ద […]

తేనెలో షుగర్ సిరప్... ప్రముఖ బ్రాండ్ల నిర్వాకం !
X

తేనె వలన చాలా ఆరోగ్య లాభాలున్నాయని మనం తరచుగా వింటూ ఉంటాం. తేనెని ఆహారంలో తీసుకోవాలని, ఉదయాన్నే వేడినీటితో కలిపి తాగాలని… ప్రకృతి వైద్యులు తరచుగా చెబుతుంటారు. అయితే స్వచ్ఛమైన కల్తీలేని తేనెని తీసుకుంటేనే మనకు ఆ ఫలితాలన్నీ వస్తాయి. లేకపోతే మరిన్ని సమస్యలు కూడా రావచ్చు.

మార్కెట్లో ఇప్పుడు చాలా పేరున్న కంపెనీలు తయారుచేస్తున్న తేనె దొరుకుతోంది. అయితే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సిఎస్ఇ) సంస్థ నిర్వహించిన పరిశోధనలో… చాలా పెద్ద బ్రాండ్లు తయారుచేస్తున్న తేనెలో కూడా కల్తీ ఉందని తేలింది. 13 భారతీయ బ్రాండ్లు తయారుచేస్తున్న తేనెలను ఎంపిక చేసుకుని పరిశీలించగా వాటిలో పదింటిలో కల్తీ ఉందని తేలింది. కల్తీ తేనెని అమ్ముతున్న కంపెనీల్లో డాబర్, పతంజలి, ఇమామి లాంటి పేరున్న బ్రాండ్లు కూడా ఉన్నాయి. కరోనా కాలంలో తేనె ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందనే ఉద్దేశ్యంతో చాలామంది దీన్ని వాడుతున్నారు. అలాంటివారికి ఇది చాలా చేదు వార్తే.

సిఎస్ఇ పరిశోధకులు ఇండియాలో తేనెని అమ్ముతున్న 13 కంపెనీల తేనెల తాలూకూ 22 శాంపిళ్లను ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసిన తేనెల శాంపిళ్లను …. గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్టులోని సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ లో మొదట పరిశీలించారు. కల్తీని కనుగొనేందుకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం శాంపిళ్లలో ఐదు మాత్రమే స్వచ్ఛమైనవని తేలింది. పరీక్షకు ఎంపిక చేసుకున్నవాటిలో 77 శాతం నమూనాల్లో షుగర్ సిరప్ కలిసిందని సిఎస్ఇ తెలిపింది.

ఇక అంతర్జాతీయంగా ఆమోదం పొందిన న్యూక్లియర్ మ్యాగ్నటిక్ రిసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఎమ్ఆర్) పరీక్షలో కేవలం మూడు మాత్రమే స్వచ్ఛమైనవిగా నిలిచాయి. ఈ పరీక్షలు జర్మనీలో జరుగుతాయి. తేనె విదేశాలకు ఎగుమతి కావాలంటే ఈ పరీక్షల్లో కూడా సఫలం కావాల్సి ఉంది.

డాబర్, పతంజలి, బైద్యనాథ్, ఝండు, హిత్కారీ, యాపిస్ హిమాలయా లాంటి ప్రముఖ బ్రాండ్లు అన్నీ ఎన్ఎమ్ఆర్ (న్యూక్లియర్ మ్యాగ్నటిక్ రిసొనెన్స్) పరీక్షలో ఫెయిల్ అయ్యాయి. పెద్ద బ్రాండ్లలో మారికో వారి సఫోలా హనీ, మార్క్ ఫెడ్ సోహ్నా, నేచర్స్ నెక్టా… మాత్రమే అన్నిరకాల స్వచ్ఛత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి.

తేనె వ్యాపారం చేస్తున్న కొన్ని భారతీయ కంపెనీలు తేనెలో కలిపేందుకు చైనా నుండి సింథటిక్ షుగర్ సిరప్ ని దిగుమతి చేసుకుంటున్నాయని సిఎస్ఇ పరిశోధనలో తేలింది. తాము నిర్వహించిన ఈ పరిశోధనా ఫలితాలు తమని షాక్ కి గురిచేశాయంటున్నారు సిఎస్ఇ ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ స్టాఫ్ ప్రోగ్రామ్ డైరక్టర్ గా పనిచేస్తున్న అమిత్ ఖురానా.

ప్రజలు తేనె అనే నమ్మకంతో మరింత ఎక్కువగా షుగర్ ని తీసుకుంటున్నారని, షుగర్ శరీర బరువుని పెంచుతుందని… అధిక బరువు ఉన్నవారు ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని… ఆ విధంగా వీరు మరింతగా కోవిడ్ కి గురయ్యే పరిస్థితులను కొనితెచ్చుకుంటున్నారని సిఎస్ఇ డైరక్టర్ జనరల్ సునీత నరైన్ అన్నారు.

Next Story