ఆలోచనల్లోనే కాదు... ఆచరణలోకి వస్తున్న జమిలి...
ఇప్పటి వరకూ జమిలి ఎన్నికలు కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోయాయి. అప్పుడప్పుడూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోటివెంట వచ్చే మాటగానే జమిలి ఎన్నికలు అందరికీ గుర్తు. కానీ అది నిజంగా ఆచరణలోకి వచ్చే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. జమిలిపై సీరియస్ గా ఆలోచించండి అంటూ వివిధ రాష్ట్రాల స్పీకర్లకు, అధికారులకు ఉపదేశం ఇచ్చిన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఒకే దేశం- […]

ఇప్పటి వరకూ జమిలి ఎన్నికలు కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోయాయి. అప్పుడప్పుడూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోటివెంట వచ్చే మాటగానే జమిలి ఎన్నికలు అందరికీ గుర్తు.
కానీ అది నిజంగా ఆచరణలోకి వచ్చే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. జమిలిపై సీరియస్ గా ఆలోచించండి అంటూ వివిధ రాష్ట్రాల స్పీకర్లకు, అధికారులకు ఉపదేశం ఇచ్చిన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ (వన్ నేషన్-వన్ ఎలక్షన్) ఆలోచన అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయలేమని, ఈ ఆలోచన ప్రస్తుతం దేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రసంగించిన ఆయన.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెలలో దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయన్నారు మోదీ. దేశవ్యాప్తంగా కొన్ని నెలల వ్యవధిలో నిర్వహించే ఎన్నికలు, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తాయని, ఈ కారణంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై దృష్టి పెట్టాలని కోరారు.
జమిలి ఎన్నికలపై లోతైన అధ్యయనం, చర్చ అవసరమని చెప్పారు మోదీ. ప్రిసైడింగ్ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ అంశంపై చర్చకు నాంది పలకాలన్నారు. లోక్ సభ, విధానసభ, పంచాయతీ ఎన్నికల కోసం వేర్వేరు ఓటరు జాబితాలు అవసరం లేదని, అన్నిటికీ పనికొచ్చేలా ఒకే ఒటరు జాబితా రూపొందించాలని, ఒకేసారి ఎన్నికలు జరగాలని ఆయన సూచించారు. ఓటరు కార్డులను క్రమబద్ధీకరించడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ వచ్చే ఎన్నికలకోసం ఓటరు జాబితాల తయారీకి ఎక్కువ సమయం, నిధులు వృథా అవుతున్నాయన్నారు మోదీ.
2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ను కీలకంగా పొందుపరిచింది బీజేపీ. ఈ అంశంపై మోదీ ఇప్పటికే అనేకసార్లు ప్రసంగించారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’పై చర్చించేందుకు గతేడాది జూన్‌లో ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది నాయకులు హాజరుకాక పోవడంతో ఈ విషయంపై చర్చ అసంపూర్తిగానే ముగిసింది.
అయితే తాజాగా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు జమిలి ఎన్నికల ఆవశ్యకతను చాటేలా ఉన్నాయి. రాజకీయ పార్టీల సొంత లాభం కోసం కాకుండా.. తరచూ ఎన్నికలకోసం పెట్టే వృథా ఖర్చు నివారించేందుకు, అధికారుల వృథా ప్రయాసను అరికట్టేందుకు జమిలి అవసరమని తేల్చి చెప్పారు మోదీ. ఇప్పటి వరకూ ఆలోచనల్లోనే ఉన్న ఒకే దేశం -ఒకే ఎన్నిక నినాదం.. ఇకపై ఆచరణలో కనిపిస్తుందనే ఆశ రేకెత్తించారు.