వైసీపీ తిరుపతి అభ్యర్థి ఎవరు...? కొనసాగుతున్న సస్పెన్స్...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణం కారణంగా రాబోతున్న ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రులు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం జగన్ అభ్యర్థిని ప్రకటించకుండా సమావేశం ముగించారు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయం తీసుకున్న జగన్, తన నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు కూడా అభ్యర్థిని ఎంపిక చేసే నిర్ణయాన్ని సీఎం జగన్ […]
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణం కారణంగా రాబోతున్న ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
తాజాగా మంత్రులు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం జగన్ అభ్యర్థిని ప్రకటించకుండా సమావేశం ముగించారు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయం తీసుకున్న జగన్, తన నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు కూడా అభ్యర్థిని ఎంపిక చేసే నిర్ణయాన్ని సీఎం జగన్ కే వదిలిపెట్టామని, ఆయన ఎవరిని ఎంపిక చేస్తే వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.
మరోవైపు బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి స్థానికంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, తండ్రి మరణం తర్వాత ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలందరినీ కలసి తనకు మద్దతు తెలపాలని, జగన్ వద్ద తన పేరు సిఫార్సు చేయాలని కూడా కోరారు.
అయితే ఆయనకు ఎమ్మెల్యేలనుంచి ఎలాంటి హామీ లభించలేదనే విషయం మాత్రం వాస్తవం. ఇప్పుడు జగన్ వద్ద కూడా ఎమ్మెల్యేలు ఎవరి పేరూ ప్రతిపాదించలేదని, కేవలం జగన్ మాటే శిరోధార్యం అని చెప్పి వచ్చేశారని తెలుస్తోంది.
ఓవైపు టీడీపీ తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు ప్రకటించేసి తిరుపతి ఉప ఎన్నికల్లో హీట్ పెంచింది. అటు దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో.. దూకుడు మీదున్న బీజేపీ.. తిరుపతిలో సభలు, సమావేశాలు పెట్టి సన్నాహాలు చేసుకుంటోంది. అభ్యర్థి విషయంపై కసరత్తులు మొదలు పెట్టింది.
అయితే అధికార పార్టీ విషయమే కాస్త ఆలస్యం అవుతోంది. దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇచ్చేది నిజమైతే.. ఈ పాటికే దానిపై ప్రకటన విడుదలయ్యేదని, బైట వ్యక్తులకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టే అభ్యర్థి నిర్ణయం ఆలస్యమవుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది.
మొత్తమ్మీద తిరుపతి పార్లమెంట్ పరిధిలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.