మన రాజధాని ఢిల్లీ... డయాబెటిస్ క్యాపిటల్ కాబోతోందా?!
మధుమేహ సమస్య మనదేశంలో చాలా తీవ్ర స్థాయిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 25 ఏళ్లలోపు వయసున్న ప్రతి నలుగురిలో ఒకరిలో షుగర్ స్థాయి…. 40-50 మధ్య వయసున్నవారిలో ఉన్నంతగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి తెలిపింది. ఓ నూతన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వైద్యపరీక్షల చైన్… మెట్రోపాలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన డేటా విశ్లేషణను బట్టి… ఢిల్లీలో మధుమేహం చాలా వేగంగా పెరుగుతోంది. దాంతో దేశ రాజధాని డయాబెటిస్ క్యాపిటల్ గా మారే […]
మధుమేహ సమస్య మనదేశంలో చాలా తీవ్ర స్థాయిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 25 ఏళ్లలోపు వయసున్న ప్రతి నలుగురిలో ఒకరిలో షుగర్ స్థాయి…. 40-50 మధ్య వయసున్నవారిలో ఉన్నంతగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి తెలిపింది. ఓ నూతన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వైద్యపరీక్షల చైన్… మెట్రోపాలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన డేటా విశ్లేషణను బట్టి… ఢిల్లీలో మధుమేహం చాలా వేగంగా పెరుగుతోంది. దాంతో దేశ రాజధాని డయాబెటిస్ క్యాపిటల్ గా మారే ప్రమాదం కనబడుతోంది. జనవరి 2019 నుండి 2020 ఆగస్టు వరకు మెట్రోపాలిస్ హెల్త్ కేర్… తమ ఢిల్లీ ల్యాబ్ లో మధుమేహ నిర్దారణ కోసం 1,37,280 నమూనాల పరీక్షలు నిర్వహించారు. ఇందులో 18శాతం మంది డయాబెటిస్ ని నియంత్రించలేని స్థితిలో ఉన్నారని తేలింది. నియంత్రించలేని స్థితిలో ఉన్న షుగర్ స్థాయిలు అత్యధికంగా… 20 నుండి 30ఏళ్ల మధ్య వయసువారిలో ఎక్కువగా కనిపించాయి. వీరిలో 25శాతం మందిలో ఇలాంటి పరిస్థితి ఉంది. 30 నుండి 40 ఏళ్ల వయసున్నవారిలో 24 శాతం మందిలో, 40 నుండి 50 ఏళ్ల వయసున్నవారిలో 23 శాతం మందిలో మధుమేహం… నియంత్రణలో లేని స్థితిలో ఉంది.
గత ఇరవై అయిదు సంవత్సరాల్లో మనదేశంలో మధుమేహం 64 శాతం పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్… 2017 నవంబరులో ఇచ్చిన నివేదిక ప్రకారం … వ్యాయామం లేకపోవటం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవటం వలన మధుమేహం రిస్క్ పెరుగుతోంది. ముఖ్యంగా 20 -30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మధుమేహం మరింత వేగంగా పెరుగుతోంది.
2017లో 72 మిలియన్ల మధుమేహం కేసులు నమోదైనట్టుగా లెక్కలు చెబుతున్నాయి.
సాధారణంగా పెద్ద వయసు వారిలో మధుమేహం ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ విపరీతంగా, వేగంగా పెరుగుతున్నది మాత్రం చిన్న వయసు వారిలోనే. పెరుగుతున్న ఒబేసిటీ, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యువతీయువకుల్లో మధుమేహం చాలా వేగంగా పెరుగుతోంది. మధుమేహం 80 ఏళ్లు దాటినవారిలో ఏడుశాతం ఉండగా 20నుండి 30ఏళ్ల వయసు వారిలో స్థిరమైన పెరుగుదల ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అలాగే మధుమేహం నియంత్రణ మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా ఉందని కూడా మెట్రోపాలిస్ హెల్త్ కేర్… అధ్యయనంలో తేలింది.
జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, శారీరక వ్యాయామం, మంచి ఆహారాలతో మధుమేహాన్ని నిలువరించవచ్చని… మరీ చిన్న వయసులోనే దాని బారిన పడకుండా తప్పించుకోవచ్చని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.