Telugu Global
National

ఫ్యాషన్ మేగజైన్ ముఖచిత్రంగా... మహిళా మంత్రి !

సాధారణంగా ఫ్యాషన్ పత్రికలపై ముఖచిత్రాలుగా సినీతారలు, మోడల్స్ ఉంటారు. ఎందుకంటే అలాంటి పత్రికలన్నీ అత్యంత ఆధునిక ఫ్యాషన్లకు, గ్లామర్ కు పెద్ద పీట వేస్తుంటాయి కనుక. అయితే గ్లామర్ తో సంబంధం లేని ఒక రాజకీయ నాయకురాలి ఫొటో ప్రముఖ ఫ్యాషన్ పత్రిక వోగ్ కవర్ పేజీగా వచ్చింది. ఆమె కేరళ ఆరోగ్య సామాజిక సంక్షేమ శాఖా మంత్రి కెకె శైలజ. కోవిడ్ ని తరిమి కొట్టటంలో ఆరోగ్యమంత్రిగా అహర్నిశలు శ్రమించారామె. ‘భయపడేందుకు సమయం లేదు… భయం […]

ఫ్యాషన్ మేగజైన్ ముఖచిత్రంగా... మహిళా మంత్రి !
X

సాధారణంగా ఫ్యాషన్ పత్రికలపై ముఖచిత్రాలుగా సినీతారలు, మోడల్స్ ఉంటారు. ఎందుకంటే అలాంటి పత్రికలన్నీ అత్యంత ఆధునిక ఫ్యాషన్లకు, గ్లామర్ కు పెద్ద పీట వేస్తుంటాయి కనుక.

అయితే గ్లామర్ తో సంబంధం లేని ఒక రాజకీయ నాయకురాలి ఫొటో ప్రముఖ ఫ్యాషన్ పత్రిక వోగ్ కవర్ పేజీగా వచ్చింది. ఆమె కేరళ ఆరోగ్య సామాజిక సంక్షేమ శాఖా మంత్రి కెకె శైలజ. కోవిడ్ ని తరిమి కొట్టటంలో ఆరోగ్యమంత్రిగా అహర్నిశలు శ్రమించారామె. ‘భయపడేందుకు సమయం లేదు… భయం కంటే కరోనాని జయించాలనే తాపత్రయమే నాలో ఎక్కువగా కలిగింది’… ఇదీ కెకె శైలజ ఉక్కు సంకల్పం.

‘ఉమెన్ ఆఫ్ 2020’ పేరుతో వోగ్ ఇండియా ప్రత్యేక సంచికని వెలువరించింది. ఇందులో ఈ ఏడాది మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన మహిళలను పరిచయం చేశారు. కోవిడ్ 19పై పోరాటం చేస్తున్న మహిళా వారియర్లకు నవంబరు వోగ్ సంచికని పూర్తిగా కేటాయించారు. భారతదేశపు శక్తిమంతమైన మహిళా కోవిడ్ వారియర్లలో 20మందిని ఎంపిక చేయగా వారిలో కెకె శైలజ ఉన్నారు.

కరోనా మొదలైన సమయంలో దానిని చాలా వేగంగా ప్రభావవంతంగా కట్టడి చేయటంలో సమర్ధవంతంగా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు శైలజ. ఈ విషయంలో కేరళ మోడల్ స్టేట్ గా గుర్తింపు పొందటంలో శైలజ కృషి ఎంతో ఉందని వోగ్ లో ఆమె గురించి రాశారు. కోవిడ్ పోరాటంలో సవ్యంగా స్పందించిన మహిళా నాయకురాళ్లు… న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కిల్, తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ లాంటివారిలో శైలజ కూడా ఒకరని వోగ్ పేర్కొంది.

కరోనా నివారణలో శైలజ పనితీరుని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా కేరళ ఆరోగ్య శాఖని ఈ విషయంలో అభినందించింది. ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్ ’ గుర్తింపు పొందిన శైలజ ఎరుపు రంగు అంచున్న తెల్లని చీరలో ఎరుపు రంగు బ్లౌజ్ ధరించి… చక్కని ఆత్మవిశ్వాసం ఉట్టిపడే నవ్వుతో వోగ్ పై కనిపించారు.

శైలజతో పాటు కేరళలో నర్సుగా పనిచేస్తున్న రేష్మ మోహన్ దాస్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మొట్టమొదటి మహిళా ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్, భారత మహిళల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టు… మొదలైనవారు సైతం ‘ఈ ఏడాది మహిళలు’ గా గుర్తింపు పొందారు. రేష్మ మోహన్ దాస్ కోవిడ్ పేషంట్లకు సేవలు అందిస్తూ దానిబారిన పడిన మొట్టమొదటి నర్సు. ఆమె తాను కోలుకున్న వెంటనే విధుల్లో చేరారు.

కరోనా మహమ్మారి విపత్తు సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో గ్లోబల్ ఎకనమిక్ పాలసీ విషయంలో సరిగ్గా మార్గనిర్దేశనం చేశారని గీతా గోపీనాథ్ ని గురించి వోగ్ లో వెల్లడించారు.

Next Story