Telugu Global
Health & Life Style

అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే...

వచ్చే ఏడాదినాటికి కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, కరోనా కష్టాలకు చెల్లుచీటీ రాసేయొచ్చని అందరూ సంబరపడుతున్న వేళ.. ఢిల్లీ ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) డైరెక్టర్ రణదీప్ గులేరియా ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ భారత్ లో ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే 2022 దాటే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంటే 2021లో వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినా భారత్ లోని సాధారణ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మరో రెండేళ్లు పట్టడం గ్యారెంటీ అనమాట. […]

అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే...
X

వచ్చే ఏడాదినాటికి కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, కరోనా కష్టాలకు చెల్లుచీటీ రాసేయొచ్చని అందరూ సంబరపడుతున్న వేళ.. ఢిల్లీ ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) డైరెక్టర్ రణదీప్ గులేరియా ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ భారత్ లో ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే 2022 దాటే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

అంటే 2021లో వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినా భారత్ లోని సాధారణ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే మరో రెండేళ్లు పట్టడం గ్యారెంటీ అనమాట. భారత్ లో జనాభా అధికంగా ఉండటం వల్లే అంత సమయం పట్టే అవకాశం ఉందన్నారాయన. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి అనుకూలించేలా శీతల పరిస్థితులను కల్పిస్తూ.. సిరంజిలు, సూదులు వంటి వాటిని పెద్దమొత్తంలో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత దానికంటే మరింత ప్రభావవంతంగా పనిచేసే మరో వ్యాక్సిన్‌ వస్తే.. దానిపై పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరముందని గులేరియా తెలిపారు. వైరస్‌ తీవ్రతను బట్టి ఎవరికి ఏ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రావాలన్నారు. అయితే వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ను పూర్తిగా నాశనం చేయలేమని గులేరియా స్పష్టం చేశారు.

సాధారణంగా పెద్దవారిపైనే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేస్తున్నారని, కరోనా వైరస్‌ చిన్నారులపై అంతగా ప్రభావం చూపడం లేదని… అందువల్ల పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగం అనే విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని అన్నారు రణదీప్ గులేరియా.

అయితే పిల్లలు వైరస్ క్యారియర్స్ గా ఉంటారు కాబట్టి, వారికి వైరస్ హాని చేయకపోయినా వారి ద్వారా మరొకరికి వ్యాపించే అవకాశమున్నందున కొన్ని రోజుల తర్వాతయినా ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగిస్తున్న రెమిడెసివిర్ ఔషధం‌ వల్ల మరణాల సంఖ్య తగ్గిందని చెప్పలేమని, అయితే అంతకుమించిన ఔషధం అందుబాటులో లేనందువల్ల దానినే ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. రెమిడెసివిర్ లాంటి ఔషధాలు ఏదీ వాడకపోయినా చాలామందిలో కరోనా నయమైందని ఆయన చెప్పారు.

మొత్తమ్మీద కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చినా.. భారత్ లో ప్రజలందరికీ చేరాలంటే మాత్రం కచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది. కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాల్లో వైరస్ పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య ఇంకా లక్షల్లోనే ఉన్న సందర్భంలో… రేపు వ్యాక్సిన్ వచ్చినా ఇలాంటి పరిస్థితులే ఉంటాయనడంలో సందేహం లేదు. వ్యాక్సిన్ సామాన్య ప్రజలకు చేరువ కావాలంటే దాదాపుగా రెండేళ్ల సమయం పడుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ చేసిిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

First Published:  8 Nov 2020 7:02 PM GMT
Next Story